Friday, May 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా పరిణామక్రమం

సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా పరిణామక్రమం

- Advertisement -

బౌద్ధ ప్రామాణిక గ్రంథాల నుండి విషయాలు సేకరించి నేనిక్కడ చర్చించడం లేదు. యువరాజు సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు? అనే విషయం- ఆయన జీవితంలోని కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తూ, ఆయా సందర్భాలలో ఆయన ఎలా స్పందించాడో తెలుసుకుందాం. ఆ స్పందనల్లో క్రమక్రమంగా ఆయనలో వచ్చిన మార్పును, ఆ పరిణామక్రమాన్ని పరిశీలిద్దాం. ఒక సామాన్య రాజకుమారుడు అసమాన్య మేధావిగా, సంఘ సంస్కర్తగా, ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన యుగ పురుషుడిగా ఎలా తయారయ్యాడు? – అన్నది తెలుసుకోవాలంటే అతి సున్నితమైన, అతి సూక్ష్మమైన అంశాల్ని తరచి తరచి చూడాల్సి ఉంటుంది. గ్రహించగలిగితే ఈ చిన్న చిన్న సంఘటనల్లోంచి లోతైన, గాఢమైన అంశాల్ని అర్థం చేసుకోవచ్చు-
రాహుదోషం: సిద్ధార్థుడికి పెళ్లిఅయ్యింది. భార్యయశోధరతో జీవితం గడుపుతున్నాడు. కొన్ని రోజులుగా యశోధర నది ఒడ్డుకు పోయి, ఏవో కొన్ని ఆచారాలు పాటించి వస్తోంది. ఒక రోజు సిద్ధార్థుడు గమనించి, ఆమెను అడ్డుకుని ‘ఎందుకు వెళుతున్నా’వని ప్రశ్నించారు. ‘కొన్ని సంప్రదాయాలు పాటించాల్సి ఉందట – అత్తయ్య గారు పాటించాలని చెబితే, పాటించకుండా నేను ఎలా ఉండగలనూ?’ – అని అంటుంది యశోధర.

‘సరే ! ఎందుకు పాటించమంటుందో ఆమెను అడగలేదా?’ ‘లేదు – పిల్లల క్షేమమే కదా ఏ తల్లయినా కోరుకుంటుంది? ఆమె ఆజ్ఞ శిరసావహించడమే నేను చేయగలను!’ ‘అయితే, మా అమ్మను నువ్వు ప్రశ్నించలేదు. విషయం తెలుసుకోలేదు- అయితే, నేనే వెళ్లి, అడుగుతా’- అంటూ సిద్ధార్థుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ‘ఇంట్లో ఈ ఆచారాలేమిటమ్మా? రోజూ యశోధర ఎండలో నది ఒడ్డుకు వెళ్లడం ఏమిటీ? ఎందుకీ పనికిరాని ఆచారాలూ ?’ – అని అడిగాడు. ‘తప్పు నాయనా! అలా అనకు. యశోధరకు రాహుదోష ముందని మన కుల గురువు వాచస్పతిగారు చెప్పారు సిద్ధార్థా! అందుకే పిల్లలు కలగడం లేదన్నాడు’ – అంది తల్లి.

‘కుల గురువు వాచస్పతి రాహువును ఎప్పుడైనా చూశాడా ? ఆయన ఎప్పుడైనా శనితోనూ, మంగళ్‌‌తోనూ కలిశాడా? ఎందుకు మనమంతా కళ్లు మూసుకుని, శాస్త్రాలు ప్రామాణికమన్న భ్రమలో ఉంటున్నాం?’ అని అన్నాడు సిద్ధార్థుడు వేదనాభరితమైన హీన స్వరంతో- ‘శాస్త్రాలు ప్రామాణికమని మన కుల గురువులు చెప్పారు. మనం పాటిస్తూ ఉండాలి’ అంది తల్లి. ‘
ప్రామాణికం? ఎలా ప్రామాణికం? ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అయినప్పుడు మరి ఈ శాస్త్రాలు కాలానుగుణంగా మారవెందుకూ?’
‘ఎందుకంటే సిద్ధార్థ! అవి సనాతనమైనవి. ఈశ్వరుడి కృప వల్ల అవి మానవ జాతికి లభించాయి ‘అహాఁ – ఆయన ఇచ్చినప్పుడు ఎవరు చూశారూ? ఆయన ఎవరికి ఇచ్చాడు? ఒక వేళ నిజంగా ఈశ్వరుడంటూ ఉంటే-యశోధరా బాధలు ఆయనకు పట్టవా? ప్రపంచంలో ఇంత దుఃఖం ఉంటే, ఇన్ని బాధలు ఉంటే వాటిని తీర్చకుండా ఆయన ఏం చేస్తున్నట్లూ? ప్రపంచంలో ఇంత అశాంతి ఎందుకున్నట్టూ? అమ్మా! నువ్వు చెప్పగలవా? మన కులగురువు చెప్పగలడా? మీరు నమ్ముతున్న ఆ ఈశ్వరుడైనా చెప్పగలడా?’ అంటూ విసుగ్గా వెనుదిరిగి వెళ్లిపోయాడు సిద్ధార్ధుడు.

తొలిసారి సన్యాసిని కలిసిన సిద్ధార్థుడు: సిద్ధార్థుడు ఒక సన్యాసిని కలవాలని అనుకుంటాడు. ఆ సన్యాసి శూద్రులు నివసించే ప్రాంతంలో ఉన్నాడని తెలుసు కుని, అక్కడికి వెళతాడు. ఆసన్యాసి సిద్ధార్థుణ్ణి చూడగానే, అన్ని ఆభరణాలు, రాజ వస్త్రాలు వదిలేసి, మామూలు వస్త్రాలలో వచ్చి కూర్చోమంటాడు. సిద్ధార్థుడు అలాగే చేస్తాడు. అప్పుడు ఆ సన్యాసి గురువు- సహజంగా, సాధారణంగా ఉండటంలోని విశిష్టతను వివరిస్తారు. ‘బంగారం, ధనం, విలువైన వస్త్రాలు అహంకారానికి ప్రతీకలని’, అవి వదిలేస్తేనే – నువ్వేమిటో నీకు తెలుస్తుందనీ చెపుతాడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ముందు సహజంగా ఉండడం నేర్చుకోవాలి! అప్పుడే నీలో ఉన్న సత్యం బహిర్గతమౌతుంది – అని చెప్పుతాడు ఆసన్యాసి.
అక్కడే ఆక్షణమే సిద్ధార్థుడికి ఆ విషయం అనుభవంలోకి వస్తుంది. జ్ఞానం- బాహ్య అలంకరణల్లోంచి రాదు, మనలో ఉన్న సాధారణ, సామాన్య స్థితిలోంచి వస్తుంది – అనే విషయం గ్రహిస్తాడు.

అది మొదలు – అక్కడి నుండి సిద్ధార్థుడిగా ప్రారంభమైన యువరాజు బుద్ధుడయ్యాక చెప్పిన విషయం కూడా అదే! ప్రయాణం బాహ్య ప్రపంచంలో కాదు – అంతర ప్రపంచంలో చేయాలి! నీలోకి నువ్వు ప్రయాణించాలి! ముందు నిన్ను నీవు తెలుసుకోవాలి!! – అనేదాక చేరుకున్న సిదార్థుడు, బుద్ధుడయాడు! పరిశ్రమిస్తే ఇది అందరికీ సాధ్యమే అనికూడా అన్నారు.
గురువు పరీక్షలో నెగ్గిన సిద్ధార్థుడు:అరణ్యంలో ఒక ఆశ్రమం. అక్కడ గురువు ముందు కొందరు యువకులు కూర్చుని ఉన్నారు. అందులో వారి ప్రవర్తన, నమ్రత, సభ్యత, సంస్కారాలను, ఆలోచనా విధానాన్ని గురువుగారు పరీక్షించి, అందులోంచి ఆయన తన శిష్యులను ఎన్నుకుంటారు. సిదార్థుణ్ణి రెండో రోజే గురువుగారు దగ్గరకు పిలిచి, ముంజేతికి జపమాల చూడతారు. అంటే- నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తున్నానని చెప్పడం – సిద్ధార్థుడు వినయంగా ప్రణమిల్లి పక్కన నిలబడతాడు. గురువుగారు మరొక శిష్యుణ్ణి కూడా పిలిచి, ముంజేతికి జపమాల చుడతాడు. అతను కూడా నమస్కరించి, ‘ గురుదేవా! మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా?’ అని ప్రశ్నిస్తాడు. గురువు గారు చిరునవ్వుతో ‘అడుగు’అని అంటారు.

‘గురుదేవా! నా గురించి నేను చెప్పుకునేది ఏముంది? ఇంతకు ముందే ఎంతో మంది గురువుల వద్ద జ్ఞానమార్జించాను. వేదాలు నాలుగూ కంఠస్తం చేశాను. ఉపనిషత్తుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. అయినా నన్ను శిష్యుడిగా స్వీకరించడానికి వారం రోజుల సమయం తీసుకున్నారు. కానీ, ఈ సిద్ధార్థుణ్ణి వచ్చిన రెండో రోజే శిష్యుడిగా ఎందుకు స్వీకరించారో నాకు అర్థం కావడం లేదు’ – అన్నాడు. ‘సరే! నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’- అన్నాడు గురువు. ‘నాకు ఒక విషయం చెప్పు. ఈ ఇసుకను ఈ మట్టి పాత్రలో ఉన్న నీటిలో వేస్తున్నా ను. యోగ సాధనకు సంబంధించి దీన్ని ఎలా వివరిస్తావూ?’ – అని అడిగాడు. – ‘ఓస్! అదేమంత కఠినమైన విషయం కాదు గురువర్యా! ఇసుక రేణువులు నీటి అడుగు భాగానికి చేరతాయి. కొంత సేపటికి పాత్రలోని నీరు నిశ్చలమై పోతుంది. ఆ తర్వాత ఆ నీరు తాగడానికి యోగమవుతుంది. అప్పుడు మనం ఆ పై నీటిని నిస్సంకోచంగా తాగొచ్చు’ అని చెప్పాడు శిష్యుడు. ‘నేను యోగ సాధనకు సంబంధించిన విషయం చెప్పమన్నాను శిష్యా!’- అని గురువు తను అడిగిన విషయాన్ని గుర్తు చేశాడు. శిష్యుడు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఏం చెప్పాలో అతనికి తోచలేదు. అప్పుడు గురువు గారు సిద్ధార్థుడి వైపు చూశాడు – ‘నువ్వు చెప్పు’ అన్నట్లు – ‘సరే- గురుదేవా! మీరు అడిగిన విషయం నాకు అర్థమైనంతలో చెప్పడానికి ప్రయత్నిస్తాను’ అని సిద్ధార్థుడు ఇలా చెప్పాడు. “ఈ ఇసుక రేణువులు బరువైనవి. మనలోని అహం, మదం, మాత్సర్యం వంటివన్నీ ఈ ఇసుక రేణువుల్లాంటివే. బరువైనవే. వాటిని అట్టడుగుకు పంపించేస్తేనే… పైన స్వచ్ఛమైన జలం – ప్రేమ, కరుణ, జాతిలాగా మానవులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ నీరు ప్రాణదాయిని కాగలుగుతుంది గురుదేవా!’ అన్నాడు.

గురువుగారు సంతోషంగా కళ్లు విప్పార్చి, ఆ రెండో శిష్యుడి వైపు చూసి, ‘నువ్వు అడిగిన ప్రశ్నకు నీకు ఇందులో సమాధానం దొరికిందనుకుంటాను. సిద్ధార్థుడిలోని అవగాహనా స్థాయి, విజ్ఞత, జ్ఞానం గ్రహించాను గనకనే, వెంటనే శిష్యుడిగా స్వీకరించాను – మనం ఎన్నిచోట్ల చదివామన్నది కాదు. ఎన్ని గ్రంథాలు కంఠస్తం చేశామన్నది కాదు. వాటిలోంచి జీవితానికి పనికొచ్చే జ్ఞానాన్ని, జ్ఞాన సారాన్ని ఎంత గ్రహించామన్నది ముఖ్యం!’ – అని గురువు గారు చిన్న వివరణ ఇచ్చారు. సిద్ధార్థుడు వినయంగా తలవంచి గురువుకు నమస్కరించాడు. అహంకారం వదులుకోలేని మరోశిష్యుడు గత్యంతరం లేక నేల చూపులు చూడడం మినహా మరేమీ చేయలేక పోయిండు.

ధ్యానంలో సిద్ధార్థుడి తొలి దశ: సిద్ధార్థుడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. కానీ గత అనుభవాలు, భయంకర దృష్టాలు సుడులు తిరుగుతుంటాయి. మనసును ధ్యానం మీద లగ్నం చేయలేక పోతాడు. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో గురువుగారిని అడగాలని _లేచి “గురుదేవా గురుదేవా’’ అని అరుస్తూ ఆయనను వెతుక్కుంటూ పరుగెడతాడు. గురువుగారు సరసు ఒడ్డున కూర్చుని, ఆకాశంలోని పక్షుల్ని చూస్తూ, నీటి తరంగాల్ని గమనిస్తూ కూర్చుని ఉంటారు. సిద్ధార్థుడు వెళ్లి ఆయన పక్కక కూర్చుని, ఆయన కాలు పట్టుకుని, ఆయన ముఖంలోకి చూస్తాడు-

‘ఏమిటి ? ఏమైంది? ఎందుకు పరిగెత్తుకొచ్చావ్?’ – అని అడిగారు గురువుగారు. ‘గురుదేవా! నామనసు నిలకడగా ఉండడం లేదు. వ్యాకుల పడుతోంది. గతంలోవి, ఇప్పటివి భయంకర సన్నివేశాలు నన్ను కలవర పెడుతున్నాయి. ధానం మీద మనసు లగ్నం చేయ లేకపోతున్నాను. నాకు మనశ్శాంతి లభించే మార్గం లేదా? గురువుగారు చిన్నపాటి, పలుచని రాయి తీసి నీటిలోకి విసురుతాడు. అది నీటి మీద అంచెలంచెలుగా కొట్టుకుంటూ వెళ్లి, కొద్ది దూరంలో.. నీటిలో మునిగిపోతుంది. ‘సిద్ధార్థ ! చూశావా? ఆ రాయి ఎలా కొట్టుకుంటూ వెళ్లిందో. నీ మనసు కూడా అంతే! గతాన్ని, వర్తమానాన్ని కొట్టుకుంటూ వెళుతోంది. ఆ తరువాతే మునిగిపోయి, నిశ్చల స్థితికి చేరుతుంది. అందుకు సమయం పడుతుంది. పైన ఆకాశంలో మేఘాలు చూశావా? ఆకారాలు మారుస్తూ ఉంటాయి. అయినా కూడా ఆకాశం తల్లడిల్లుతుందా? నిశ్చలంగా, నిర్మలంగా ఎలా ఉంటుందో చూడూ – అలాగే, ఒక మహాన్నతమైన ఉఛ్ఛస్థితికి మనసు చేరాలంటే శ్రమించక తప్పదు. కేంద్రీకరించక తప్పదు. పూర్తి ధ్యానంలో మునిగి పోవాలంటే, నువ్వు ఆ ఆకాశంలాగా మారిపోవాలి! ఎల్లలు లేని విశాల భావనలోకి చేరాలి! ఆలోచనలు వస్తాయి. కాలం వలె, అవి నిన్ను నాలుగు వైపుల నుండి చుట్టు ముడతాయి. కానీ, నీ మనసు, నీధ్యాస -శ్వాస మీద మాత్రమే ఉండాలి! అలా చేసినప్పుడు, నీకు ఒక సమయంలో శూన్యం అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నీ బాధలన్నీ, దుఃఖాలన్నీ, బంధాలన్నీ, బంధనాలన్నీ తొలగిపోయి- మనసు ఆకాశంలో నిర్మలమవుతుంది. అప్పుడు ఆ నీలాకాశం వలె నీలో ఒక లోతైన శాంతి భావన కలుగుతుంది!’ – అని ప్రసన్న వదనంతో గురువు గారు ధైర్యం చెప్పారు. ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్టు – సిద్ధార్థుడి ముఖం వెలిగిపోయింది.
వ్యాసకర్త : కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్ర వేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -