దేశానికి ఆదర్శవంతంగా ఉండేలా కార్మికులకు కనీస వేతనాల పెంపుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన బుట్టదాఖలైంది. అశాస్ర్తీయమైన పద్ధతిలో వేతనాల్ని పెంచింది. దీన్ని సవరించాలన్న కార్మిక సంఘాల డిమాండ్ సహేతుకమైనది. దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కనీస వేతనాలను సర్కార్ సవరిస్తుందంటే కార్మికులు ఎంతగానో ఆశపడ్డారు. తమ కష్టానికి ఫలితం దక్కతుందనుకున్నారు. కానీ, ఈ పెంపు పట్ల తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన కార్మికరంగాన్ని పాలకులు విస్మరించడమే తప్ప వేరే కాదు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. సహజంగానే ఈ నిర్ణయం స్వాగతించ దగినదే. కానీ, ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, వేతనా లను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి కనీస వేతనాలను సవరించింది. పెరిగిన కనీస వేతనాలను జూన్ 1 నుంచి అన్ని సంస్థలకు అమలు చేస్తామని ప్రకటించ డంతో పాటు, ఇది అమలు జరిగేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు అసంబద్ధంగా, అన్యాయంగా ఉందనేది అర్థమవుతున్నది. 1948 నాటి కనీస వేతనాల చట్టం, కార్మిక సంఘాల డిమాండ్లు, 1991 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు, డాక్టర్ ఆండ్రాయిడ్ ఫార్ములా, రోజురోజుకూ పెరుగుతున్న నిత్యవ సర సరుకుల ధరలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. సర్కార్ నిర్ణయంతో కనీస వేతనాల పెంపు వల్ల రాష్ట్రంలోని అన్ని రంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు లాభం చేకూరకపోగా తీరం నష్టం చేస్తుందనేది వాస్తవం. కనీస వేతనాల పెంపులో కరువుభత్యం అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించలేదు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. గ్యాస్ సిలిండర్ నుంచి కూరగాయల వరకు, అద్దె ఇండ్ల నుంచి పిల్లల విద్య వరకు ప్రతిదీ కార్మిక కుటుంబాలపై భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం వేతనాల సంఖ్య పెరిగిందని చెప్పడం ద్వారా కార్మికుల జీవితాల్లో సంతోషాన్ని నింపినట్టు కాదు.
ప్రస్తుతం తెలంగాణ కాంట్రాక్ట్ లేబర్ జీవో నెంబర్ 11 ప్రకారం కార్మికులు రూ.13,098 నుంచి రూ.23,683 వరకు వేతనాలు పొందుతున్నారు. కొత్తగా ప్రకటించ ిన పెంపు ప్రకారం అన్‌స్కిల్డ్ వర్కర్లకు కొంత ప్రయోజనం కనిపించినప్పటికీ, మిగతా కేట గిరీల్లో మాత్రం పెద్దగా మార్పు లేదని స్పష్టమవుతోంది. కనీస వేతనాల సలహాల మండల సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. స్కిల్డ్ కార్మికుడికి గత జీవో ప్రకారం ఉన్న వేతనం కన్నా ఇప్పుడు ప్రకటించిన మొత్తం తక్కువగా ఉండటం ఆశ్చర్యకరం. 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం కార్మికుడి వేతనం అతని కుటుంబ జీవన అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ఉండాలి. సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో కూడా అదే స్పష్టం చేసింది. డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం కుటుంబ పోషణ, ఆహారం, దుస్తులు, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వేతనాలు నిర్ణయించాలి. ఈ ప్రమాణాలన్నింటినీ వర్తింపజేస్తే కనీస వేతనం రూ.32 వేల వరకు రావచ్చని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కానీ, వారు ప్రస్తుతం కనీసం రూ.26 వేలైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ధరల పరిస్థితుల్లో ఇది కనీస అవసరమే. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధం తీవ్రత, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కార్మికుల అసంతృప్తి ఎలా ఉద్రిక్తతలకు దారి తీసిందో పాలకులు గుర్తు పెట్టుకోవాలి. నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన కార్మిక ఆందోళనలు అందుకు ఉదాహరణ. హర్యానా ప్రభుత్వం వేతనాలు పెంచిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్కడ కార్మికుల్లో తీవ్రమైన అసహనం పెరిగింది. చివరకు ఆగ్రహం వీధుల్లోకి వచ్చింది. అలాంటి పరిస్థితులు రాకముందే ప్రభుత్వాలు సమస్యను అర్థం చేసుకోవాలి. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సంతృప్తికరమైన వేతనాలు పెంచింది. ప్రస్తుతం ప్రభుత్వాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి వంటి నినాదాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఆ పరిశ్రమలను నడిపిస్తున్న శ్రమజీవుల జీవన ప్రమాణాల గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాయి? కార్మికుడి శ్రమ లేకుండా ఉత్పత్తి లేదు. ఉత్పత్తి లేకుండా అభివృద్ధి లేదు. అలాంటప్పుడు కార్మికుడి కనీస జీవన హక్కును కూడా నిర్లక్ష్యం చేయడం ఏ విధమైన న్యాయం? కనీస వేతనం అనేది దానం కాదు. అది కార్మికుడి హక్కు. కనుక ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకే పరిమితం కాకుండా.. ప్రకటించిన వేతనాల్లో ఉన్న లోపాలను వెంటనే సవరించాలి. లేదంటే ఉద్యమాల ద్వారానే కార్మికులు వేతనాలు సాధించుకోవాలి.
సవరణ సరే..కానీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


