Thursday, May 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘నీట్’ వైఫల్యం - విద్య కేంద్రీకరణ ఫలితమే

‘నీట్’ వైఫల్యం – విద్య కేంద్రీకరణ ఫలితమే

- Advertisement -

నీట్ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస వైఫల్యాలు, పేపర్ లీక్ వ్యవహారాలు దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతు న్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా కేంద్రీకరణ, కార్పొ రేటీకరణ విధానాలే కారణం. ‘‘ఒకే దేశం – ఒకే పరీక్ష’’ అనే నినాదంతో కేంద్రం తీసుకువచ్చిన ఈ విధానం రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం అయినప్పటికీ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ప్రాంతీయ వైవిధ్యం, స్థానిక భాషలు,రాష్ట్ర బోర్డుల సిలబస్‌లకు విలువ లేకుండా పోయింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, పేద కుటుంబాల పిల్లలు వైద్య విద్యకు దూరమవుతున్నారు. ఒకప్పుడు వైద్య విద్య అంటే ప్రతిభ, కృషి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల కలగా ఉండేది. కానీ నేడు అది కోచింగ్ మాఫియా, కార్పొరేట్ విద్యా వ్యాపారం, కేంద్రీకృత పరీక్షల ఒత్తిడి, కోట్ల రూపాయల మార్కెట్‌గా మారిపోయింది. నీట్ పరీక్షల నిర్వహణలో వరుసగా బయటపడుతున్న పేపర్ లీకులు, అవకతవకలు, ఎన్‌టిఏ వైఫల్యాలు ఇవన్నీ యాదృచ్ఛిక ఘటనలు కావు. ఇవి దేశంలో అమలవుతున్న నూతన విద్యా విధానాల అసలు స్వరూపాలు.

“ఒకే దేశం – ఒకే పరీక్ష” అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం గొప్ప సంస్కరణగా ప్రచారం చేసింది. కానీ వాస్తవానికి అది భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా మారింది. భారతదేశం భిన్న భాషలు, భిన్న విద్యా విధానాలు, ప్రాంతీయ సామాజిక పరిస్థితులతో కూడిన దేశం. అలాంటి దేశంలో ఒకే విధమైన పరీక్షను రుద్దడం అంటే విద్యలో సమానత్వాన్ని కాదు, అసమానతలను మరింత పెంచడమే. సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా రూపొందే నీట్ పరీక్షలు రాష్ట్ర బోర్డుల విద్యార్థులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇది మరింత అన్యాయంగా మారింది. ఎందుకంటే వారికి అవసరమైన కోచింగ్, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, డిజిటల్ వనరులు అందుబాటులో ఉండవు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఆధారిత వైద్య ప్రవేశ విధానాలు ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాయి. స్థానిక విద్యార్థులకు అవకాశాలు లభించేవి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా వైద్య విద్యలోకి వచ్చేవారు. కానీ నీట్ అమలుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఇప్పుడు విద్యార్థి రెండు సంవత్సరాలు ఇంటర్ చదవడం కాదు, అసలు జీవితం మొత్తం కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఉదయం స్కూల్, రాత్రి కోచింగ్ కాదు, ఇప్పుడు నేరుగా స్కూల్ వ్యవస్థనే నిర్వీర్యం చేసి “ఇంటిగ్రేటెడ్ కోచింగ్” పేరిట విద్యను వ్యాపారంగా మార్చేశారు.కోటా, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ వంటి నగరాలు కోచింగ్ పరిశ్రమల కేంద్రాలుగా మారాయి. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మార్కుల యంత్రాలుగా తయారు చేస్తున్నారు. ఒక కుటుంబం తమ పిల్లవాడిని డాక్టర్ చేయాలంటే ఇంటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మధ్యతరగతి కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పేద విద్యార్థులు మొదటినుంచే పోటీ నుంచి బయటపడుతున్నారు. ఇదే విద్యలో కార్పొరేటీకరణ అసలు రూపం. ప్రభుత్వ విద్యను బలహీన పరచి, ప్రయివేటు కోచింగ్ సంస్థలు, కార్పొరేట్ కాలేజీలకు లాభాలు చేకూర్చే విధంగా మొత్తం వ్యవస్థ పనిచేస్తోంది.

నీట్ వ్యవస్థ వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రతి సంవత్సరం కోచింగ్ ఒత్తిడి, పరీక్ష భయం, కుటుంబాల అంచనాలు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోటా వంటి నగరాల్లో వరుస ఆత్మహత్యలు దేశాన్ని కుదిపేశాయి. అయినా ప్రభుత్వం సమస్య మూలాలను అర్థం చేసుకోవడం లేదు. విద్యార్థులపై మరింత పోటీ, మరింత ఒత్తిడి మోపుతోంది. వైద్య విద్యను సేవగా కాకుండా కేవలం మార్కెట్ పోటీగా మార్చింది. ఇది మానవీయత కోల్పోయిన విద్యా విధానం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు కూడా పూర్తిగా ప్రశ్నార్థకమైంది. వరుసగా పేపర్ లీకులు, ఫలితాల్లో అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదాలు, సాంకేతిక తప్పిదాలు – ఇవన్నీ సంస్థ సామర్థ్యంపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడే పరీక్షను నిర్వహించే సంస్థ కనీస పారదర్శకతను కూడా పాటించలేకపోతోంది. పేపర్ లీక్‌ల వెనుక పెద్ద మాఫియాలు, రాజకీయ-కార్పొరేట్ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష కేంద్రాల నుంచి కోచింగ్ సంస్థల వరకు విస్తరించిన అవినీతి గొలుసు విద్యా వ్యవస్థను పూర్తిగా కలుషితం చేస్తోంది.ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విద్యా విధానాల సహజ ఫలితం. జాతీయ విద్యా విధానం–2020 కూడా విద్యలో కేంద్రీకరణను, ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను క్రమంగా హరించి, మొత్తం విద్యా వ్యవస్థను కేంద్ర నియంత్రణలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. “జాతీయ ప్రమాణాలు” అనే పేరుతో స్థానిక అవసరాలు, భాషలు, సామాజిక న్యాయం అన్నీ పక్కనపడు తున్నాయి. విద్యను ప్రజల హక్కుగా కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. రాష్ట్రాలకు వైద్య ప్రవేశాల హక్కు తిరిగి ఇవ్వాలి. ఇంటర్మీడియట్ మార్కులకు ప్రాధాన్యత కల్పిస్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశ విధానాలు రూపొందించుకునే అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయాలి. కోచింగ్ ఆధారిత వ్యవస్థను తగ్గించేలా పాఠశాల విద్యనే బలంగా మార్చాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పెద్దఎత్తున పెంచి, అందరికీ అందు బాటులో ఉండే వైద్య విద్యను కల్పించాలి. ఎన్‌టిఏ వంటి కేంద్రీకృత పరీక్షా సంస్థలపై పార్లమెంటరీ, న్యాయపరమైన పర్యవేక్షణ ఉండాలి. మన రాష్ట్రానికి కూడా ఇతర రాష్ట్రాల నుండి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుతున్నారు. వారికి కూడా ఆల్‌ ఇండియా కోటాలో భాగంగా ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం, పీజీ సీట్లలో 50 శాతం ఇతర రాష్ర్టాల్లోని వైద్య విద్యార్థులకు కేటాయిస్తుండటం వల్ల మన వైద్య విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదు. దీనికి తోడు లోకల్‌, నాన్‌లోకల్‌ సమస్య కూడా మన విద్యార్థులను వెంటా డుతున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371–డి ప్రకారం మన వైద్య విద్యార్థులు ఇతర రాష్ర్టాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేస్తే మన రాష్ట్రంలో నాన్‌లోకల్‌గా పరిగణించ బడుతున్నారు. దీంతో వేలాది వైద్య విద్యార్థులు డాక్టర్‌ కావాలనే తమ కలకు మధ్యలోనే ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే రాబోయే ఐదారేండ్లలో మన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పీజీ విద్యను బోధించేందుకుగాను అనుమతి లభించనున్నది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ‘ఆల్‌ ఇండియా పూల్‌’లో కొనసాగితే మన విద్యార్థులు పీజీ సీట్లను కూడా కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆల్‌ ఇండియా పూల్‌’ నుంచి వైదొలగాలి.‘నీట్‌’లో తాజా అవతక తవకలు, అక్రమాలు మన వైద్య విద్యార్థులను భయాందో ళనలకు గురిచేస్తున్నాయి. అందుకే నీట్‌ను రద్దుచేసి రాష్ర్టాలవారీగానే వైద్య అర్హత పరీక్షను నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నీట్‌ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలె. అప్పుడే నీట్‌ గండం నుంచి విద్యార్థులు బయటపడే ఆస్కారం ఉంటుంది. ‘నీట్‌’లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నా, దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నా ప్రధాని మోదీ ఏమీ పట్టనట్టు వ్యవహ రిస్తుండటం అత్యంత గర్హనీయం. బర్ల స్కాం, గొర్లలో అవినీతి అంటూ ఊ అంటే వాలిపోయే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్‌ (ఈడీ) నీట్‌ కుంభకోణంపై పల్లెత్తు మాట కూడా మాట్లడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. విద్య అనేది మార్కెట్ సరుకు కాదు. అది ప్రజాస్వామ్య హక్కు. కానీ నేడు దేశంలో అమలవుతున్న విధానాలు విద్యను కార్పొరేట్ లాభాల సాధనంగా మార్చుతున్నాయి. నీట్ సంక్షోభం ఆ ప్రమాదానికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ. విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ – ఇవన్నీ ఈ పోరా టంతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇది కేవలం పరీక్షా సంస్కరణల సమస్య కాదు. దేశ భవిష్యత్తు ఏ దిశగా వెళ్లాలి అనే ప్రశ్న. ప్రజాస్వామ్య, సమానత్వ, శాస్త్రీయ విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కలసి పోరాడాల్సిన అవసరం అత్యవసరంగా మారింది.

టి.నాగరాజు
9490098292

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -