అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అని పాత కాలం సామెత. ప్రస్తుతం తెలంగా ణాలో రైతు పరిస్థితి అలానే ఉంది. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు గానీ, ఎరువులు గానీ, కొందామంటే దొరకని పరిస్థితి. ఒకవేళ విత్తనాలు దొరికినా, సరైనవైతే ఫరవాలేదు. నాణ్యతలేని విత్తనాలైతే, మొత్తం పెట్టుబడి పెట్టి, కాలం చివరికొచ్చాక దిక్కుతోచని పరిస్థితి. పంట పండదు. విత్తన కంపెనీలపైన చర్యలుండవు. నష్టపోయిన రైతులకు పరిహారం ఉండదు. ఒకే ప్రాంతం వారై ఉండి, అదీ పెద్ద సంఖ్యలో ఉండి, గట్టిగా పోరాడితే, అరకొరగా పరిహారం లభిస్తే లభించవచ్చు. లేకపోతే లేదు. ఎరువుల విషయమైతే మరింత దారుణం.ప్రభుత్వం ధరలను నియంత్రించే యూరియా, డిఎపిలు దొరకటం గగనతలం అవుతున్నది. ఒక్కో బస్తా కొనుగోలుకు రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కొత్త పద్ధతి యాప్‌లో నమోదు చేసుకోవాలని పెట్టారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు, సెల్ ఆపరేట్ చేయటం రాని రైతుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఇక మిగిలిన ఎరువులైన అమోనియా, పొటాషియం, 28-28-0 మొ.గు వాటి ధరలు, రూ.వందల్లో నుండి వేలల్లోకి చేరుకొన్నాయి. న్యూట్రియన్స్డ్ బేస్డ్ సబ్సిడీ స్కీంలో, కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి, ధరలు మీ ఇష్టం అని వదిలివేసిన ఫలితం ఇది. ఈ పై వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల తలెత్తిన ఇబ్బంది.
ఇది కాక ప్రకృతిపరమైన ఇబ్బందులు. అతివృష్టి, అనావృష్టి. నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిణామాలు కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. అలా ఎండిపోయిన పంటలను, రైతు తనచేత్తో తానే తగులబెట్టుకొనే విషమ పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. గత ఖరీఫ్ సీజన్‌లో అనేక జిల్లాల్లో అధిక వర్షాల సమస్య వెంటాడింది. ఒకేసారి కుండపోతలాగా వచ్చాయి. దీనివల్ల వచ్చే వరదలతో చేతికొచ్చిన పంటలు చేలోనే పడిపోవటం, నీళ్లల్లో నాని మొక్క మొలవటం, పంట కుళ్లటం, వెరసి పంట పూర్తిగా దెబ్బతింది. ఈ పరిస్థితి తీవ్రమైనప్పుడు కేంద్రబృందాలు వచ్చాయి. రాష్ట్ర అధికార యంత్రాంగం జరిగిన నష్టాన్ని వివరించింది. ఇదంతా మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆ బృందాలు పంట దెబ్బతిన్న రైతులకు సానుభూతి ప్రకటించాయి. జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశాయి. పూర్తి నష్టాన్ని గురించి కేంద్రానికి నివేదిస్తామని చెప్పి వెళ్లిపోయాయి.
ఇక రాష్ట్ర ప్రభుత్వం వైపునుండి మంత్రుల పర్యటనలు జరిగాయి. పంట నష్టాలను పరిశీలించారు. అంతో ఇంతో పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇదీ జరిగిన తంతు. ఆ తరువాత పరిహారం కోసం, కేంద్రమూ నిధులేమీ ఇవ్వలేదు. రాష్ట్రమూ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోనూ, శాసన సభ మొదటి సమావేశాల్లోనూ, పంటల బీమా అమలు చేస్తామన్నారు. తరువాత దాని గురించి పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన ప్రయివేటు ఇన్సూరెన్సు కంపెనీలు వేలకోట్ల రూపాయలు పోగుచేసుకోవటానికి తప్ప, రైతులు పంట నష్టపోతే ఏ రాష్ట్రంలోని రైతులకూ ఉపయోగపడ్డ దాఖలాలు లేవు. తెలంగాణా పంటపై మరొక దాడి కోతులది. ఇది దాదాపు అన్ని జిల్లాల్లో ఉంది. అనేక గ్రామాలలో రైతులు, కోతుల బారినుండి పంటలను కాపాడుకోవటానికి, కుక్కలను-కొండముచ్చులను పెంచుకొంటున్నారు. ఉదయం 5గం.ల నుండి, సాయంత్రం 7గం.ల వరకు ఒక్క గంటకూడా విడువకుండా పొలంలోనే ఉండాల్సిన పరిస్థితి. ఏ కాస్త సమయం చిక్కినా పంట నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా ప్రతి జిల్లాలో స్టెరిలైజ్ (సంతాన నిరోధక) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఆచరణలో అమలు శూన్యం. ఇంకా కొన్ని చోట్ల అడవి పందులు, నెమళ్లు, నక్కలు కూడా పంటలను పాడు చేస్తున్నాయి.
ఇన్ని కష్టాలను దాటుకొని పంటలు పండిస్తే, ఆ పంటను అమ్ముకోవటం రైతుకు అతిపెద్ద భారమవు తున్నది. కనీస మద్దతు ధరలు ప్రకటించటం కాదు. దానికి చట్ట బద్దత కల్పించాలని 434 రైతు సంఘాలు కల్సి ఏర్పాటు చేసుకొన్న ఎస్‌కెఎం ఢిల్లీలో ఆందోళన చేస్తే, కల్పిస్తామని రాత పూర్వక హామీ ఇచ్చింది మోడీ బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు దాని ఊసెత్తటం లేదు. దీనివల్ల పండిన పంట ఎంతకమ్ము కోవాలో, ఎక్కడమ్ముకోవాలో, ఎప్పుడమ్ము కోవాలో, అమ్మకపోతే పంటను ఎక్క డుంచుకోవాలో తెలియక రైతు అల్లడితల్లడవుతున్నాడు. ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితే చూస్తే, ఇప్పుడు తెలంగాణాలో రెండు రకాల పంటలు పండించిన రైతులు తీవ్రమయిన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆ రెండు పంటలు ఒకటి ధాన్యం, రెండు మొక్కజొన్న. ఎకరానికి సరాసరి 40 బస్తాలు ధాన్యం, 40 క్వింటాళ్లు మొక్కజొన్న రాష్ట్రంలో పండింది. ధాన్యం ఎ గ్రేడ్ రకానికి క్వింటాల్ రూ.2,389 , సాధారణ వడ్లకు రూ.2,369 , మొక్కజొన్న క్వింటాళ్లకు లు2,400 మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దానికి చట్టబద్దత లేదు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మొక్కజొన్న పంటకు పూర్వ వైభవం కల్పిస్తామని ఘనంగా ప్రకటించింది. వడ్లకు క్వింటాల్‌కు రూ.500, (ఆరు గ్యారంటీల్లో ఒకటిగా) మొక్కజొన్నకు రూ.330 అదనంగా బోనస్ ఇస్తామని ప్రకటించింది. అంటే వడ్లకు రూ.2,869, (మొత్తం సాధారణ రకమే అనుకొన్నా) మొక్కజొన్నకు రూ.2,770 రావాలి. కానీ బయట వ్యాపారులు ఈ రెండు పంటలు క్వింటాల్ రూ.1700 నుండి 1900వరకు మాత్రమే కొంటున్నారు. అంటే ప్రతి క్వింటాకు రూ.వెయ్యి రైతు నష్టపోతున్నాడు. రైతు సంఘాలు, రైతులు ఆందోళనలు చేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. కొందరు మంత్రులయితే ప్రతి గింజా కొంటామని డాబుగా ప్రకటించారు కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ కొనుగోళ్లు జరగటం లేదు.
కొనుగోలు కేంద్రాలు తెరిచిన నెల తరువాత నిన్న (12 మే 2026) ముఖ్య మంత్రి ఒక సమీక్షా సమావేశం పెట్టి ప్రకటన చేశారు. అందులో ఆయన ప్రతి ఒక్క అధికారీ జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్‌లనూ వదిలేది లేదన్నారు. లారీలు సమకూర్చని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొంటామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుకు ఎలాంటి ఇబ్బందీ రావద్దన్నారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు పొందుతున్నదే ఇబ్బందులు, సమస్యలు తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ సమీక్షలో వచ్చిందో రాలేదో తెలియదు కానీ, కొనుగోలు కేంద్రాలలో కొనటానికి పదవ తరగతి విద్యార్థికి పరీక్షలు ఆరు సబ్జెక్టుల్లో పెట్టినట్లు, ధాన్యానికీ ఆరు రకాల పరీక్షలు పెడుతున్నారు. 1) తేమ 17శాతం. 2) మట్టి పెళ్లలు రాళ్లు 1శాతం. 3) చెత్త ఒక శాతం. 4) చెడి పోయినవి-రంగుమారినవి ఐదు శాతం. 5) పూర్తిగా తయారు కానివి మూడు శాతం. 6)తక్కువ రకాలు ఆరు శాతం.
ఈ ఆరు పరీక్షలలో ధాన్యం పాస్ అయితేనే కాంటాకు అర్హత పొందుతుంది. ఏ ఒక్క పరీక్షలో ఏ ఒక్క శాతం పెరిగినా ఫెయిల్ అయినట్లే. విద్యార్థులకు తగ్గితే ఫెయిల్, ధాన్యానికి పెరిగితే ఫెయిల్. ఈ పరీక్షకోసం మొత్తం ధాన్యం రాశి నుండి ఇరవై గ్రాముల ధాన్యాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ కొలతలు తీస్తున్నారు. బంగారం తూకం వేసే కాటాతో ధాన్యాన్ని కొలుస్తున్నారు. నాలుగింట మూడొంతుల రైతుల ధాన్యం ఏదో ఒక అంశంలో ఫెయిలై అనర్హత పొందు తున్నది. ఇన్ని పరీక్షలు పాసై పంపే ధాన్యంను కూడా దిగుమతి చేసుకోవటానికి మిల్లర్లు తరుగు పేరుతే ఐదు నుండి ఎనిమిది కేజీల వరకు కోత పెడుతున్నారు. ధాన్యం దిగుబడిలో రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నది. ఈ ఘనత మాదంటే మాదని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీ పడి ప్రచారం చేసుకొంటున్నాయి. కానీ రైతు అమ్ము కోవటానికి పడుతున్న కష్టానికి భాద్యత మాత్రం తీసుకోవటం లేదు.
ఇక మొక్కజొన్న రైతు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదాహరణకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియోజక వర్గాన్ని తీసుకొంటే అక్కడ బోనకల్ మండలం, గోవిందాపురం అనే గ్రామంలో ఏప్రిల్ 14న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి గింజా కొంటామని ప్రకటించారు. కానీ రాష్ట్రమంతా ఆశ్చర్యకరమైన నిబంధన పెట్టారు. ఎకరానికి 26 క్వింటాళ్ల 30 కేజీలు మాత్రమే కొంటారట. సగటు దిగుబడి 40 క్వింటాళ్లు ఉంది. మిగిలిన మొక్కజొన్నలు ఎక్కడమ్ముకోవాలి. ఆ గ్రామంలో ఒక లక్షా ఇరవైవేల బస్తాలు కాటా వేశారు. అందులో 39,680 బస్తాలు 60 లారీల ద్వారా మార్క్ఫెడ్కు పంపారు. 12 లారీలలోని బస్తాలు మాత్రమే దిగుమతి అయ్యాయి. మిగిలిన లారీలన్నీ 15 రోజుల నుండి అన్‌లోడ్ కాకుండా అలానే ఉన్నాయి. కాటావేసిన మిగిలిన 80,320 బస్తాలు పొలాల్లో ఉన్నాయి. వాటిని తీసుకుపోవటానికి మార్క్‌ఫెడ్ లారీలు పంపటం లేదు. లారీలు రావాలంటే రైతులే ప్రతి బస్తాకు 40 నుండి రూ.50 ఇస్తున్నారు. అంటే క్వింటాకు రూ.100 అవుతున్నది. ఒక్కో లారీకి కిరాయి సుమారు రూ.30వేలు రైతులు భరించాల్సి వస్తున్నది. ఇంత చేసి లారీ మాట్లాడుకోని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అధికారులు ట్రక్ షీట్ ఇవ్వటం లేదు. రోజుకు ఒక్కో కొనుగోలు కేంద్రంలో 200 టన్నులు మాత్రమే కొనుగోలు చేయమన్నారు. అంతకంటే ఎక్కువకు ట్రకోట్లు ఇవ్వలేము, కాబట్టి మీరు లారీలు మాట్లాడుకోని వచ్చినా అవి ఇక్కడ ఖాళీగా పెట్టడమే తప్ప మేమేమీ చేయలేమంటున్నారు. ఈ గ్రామంలో ఇంకా కాంటా వేయాల్సినవి 1,20,000 బస్తాలున్నాయి. ఆ కాంటా కోసం కనీసం బస్తాలు కూడా పంపటం లేదు. అవీ పొలాల్లోనే ఉన్నాయి.
ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు వేసవి వేడి తీవ్రంగా ఉండటం వల్ల రెడోజోన్‌గా ప్రకటించారు. ఇప్పటికే ఆ గ్రామంలో నాలుగెకరాల్లో పంట కాలిపొయింది. పక్కనే ఉన్న చింతకాని మండలంలో (మధిర నియోజకవర్గమే) అగ్ని ప్రమాదానికి 15 ఎకరాల్లో పంట దగ్ధం అయింది. ఒక ట్రాక్టర్ కాలి పొయింది. 30 గొర్రెలు కాలిపొయ్యాయి. 50 గొర్రెలు చావుబతుకుల మధ్య ఉన్నాయి. ఇవన్నీ పొలాల్లో జరిగినవే. పంట కాలిపొయిన పొలాల్లోని వ్యవసాయ బోరుబావిల్లోని, పైపులు మోటార్లు కూడా పూర్తిగా తగులబడి పొయ్యాయి. దీనికి తోడు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు రైతులు ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ పొలాల్లో ఉంటున్నారు. గన్నీ సంచులు ఇవ్వరు. కాంటాలు వెయ్యరు. లారీలు పంపరు. వచ్చిన లారీల్లో పంపిన బస్తాలు దిగుమతి చెయ్యరు. దిగుమతి చేసినా బిల్లులు రావు. ఇది ఒక్క గ్రామం లోని పరిస్థితే కాదు. మొత్తం రాష్ట్రం పరిస్థితే ఇలా ఉంది. మంత్రులు గానీ అధికారులు గానీ పట్టించుకోవట్లేదు.
ఇందులో కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్కో ఎకరానికి పెట్టుబడి రూ.40 వేలు. కౌలు 20వేలు అవుతున్నది. వాళ్ల పొలాలు పంటలు రికార్డులలో నమోదు కావట్లేదు. భూ యజమానులు వచ్చి థంబ్ వేయాలం టున్నారు. అమెరికాలోనో, హైదరాబాద్‌లనే ఉండే వారు దీనికోసం రారు. ఆ పేరుతో కౌలు రైతుల పంట అసలు లెక్కలోకే తీసుకోవటం లేదు. రాష్ట్రంలో కౌలు రైతులు 26శాతం మంది ఉన్నారు. ఇప్పటికయినా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తే రైతుకు కాస్తయినా ఉపశమనం లభిస్తుంది. ఫ్యూచర్ సిటీలే కాదు, వ్యవసాయానికి భద్రత లేని, రైతుకు రక్షణ లేని తెలంగాణాకు ఫ్యూచర్ ఉండదని గమనించాలి. తగిన చర్యలు చేపట్టాలి.
పోతినేని సుదర్శన్ రావు



