పశ్చిమాసియాలో సాగు తున్న యుద్ధంతో ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు వంద డాలర్ల మార్కు దాటేసింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగు తూ వుండడంతో మోడీ ప్రభుత్వం ఆ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచకుండా నిలుపుజ ేసింది. ఎన్నికలు పూర్తి కాగానే ఇప్పటికి మూడు రౌండ్లు పెట్రో ధరలను పెంచింది. ఇంక ముందు కూడా పెంచుతుందని గట్టిగా చెప్పవచ్చు. కేవలం బిజెపి సమర్థకులే గాక, అనేకమంది ఆర్థికవేత్తలు ఈ విధంగా ప్రజలపైకి పెరిగిన చమురు భారాలను నెట్టడం అని వార్యంగా జరగవలసిన సహజమైన చర్యగా పరిగణిస్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ నడక తీరు గురించిన వారి అవగాహన లోపభూయిష్టంగా ఉండడం వల్లే వారావిధంగా పొరపాటు పడుతున్నారు. ప్రాథమికమైన విషయం ఏమంటే పెట్రో ఉత్పత్తుల డిమాండ్ వాటి ధరలు పెరిగేటప్పుడు తగ్గేదీ కాదు, తగ్గినప్పుడు వాటి డిమాండ్ పెరిగేదీ కాదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు వాటి వినియోగదారులు వేరే సరుకుల కొనుగోలు తగ్గించి పెట్రో ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. అందుచేత పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు వాటి డిమాండ్ తగ్గిపోదు కాని వేరే ఇతర సరుకుల డిమాండ్ పడిపోతుంది.
దాని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులు వేస్తుంది. చమురు ఉత్పత్తుల సరఫరా ఎంతగా తగ్గితే అంతగా వాటి ధరలు పెరుగుతాయి. తగ్గిపోయిన సరఫరాకు తగ్గట్టు వాటి డిమాండ్ తగ్గిపోవాలంటే అంత ఎక్కువగా వాటి ధరలు పెరగాలి. అప్పుడు ఆర్థిక వ్యవస్థ అంత తీవ్రంగా మాంద్యంలో కూరుకుపోతుంది. అయితే, ఎక్కువ సందర్భాల్లో చమురు ధరలు పెరగడం అనేది దాని సరఫరా తగ్గినందువలన సంభవించేది కాదు. నిజానికి ఇప్పుడు ఒకవైపు యుద్ధం కొనసాగుతున్నా, చమురు నిల్వలు సరఫరాను కొనసాగించగల స్థాయిలోనే ఉన్నాయి. చమురు నిల్వలకు కొరత ఏర్పడబోతుందన్న అంచనాలు, దానివలన ధరలు పెరగనున్నాయన్న అంచనాలు వచ్చి వాస్తవ చమురు ధరల పెరుగుదలకు దోహదం చేస్తాయి. అయితే, మనం ప్రస్తుతం వాస్తవంగానే చమురు సరఫరా తగ్గిందని, దానివల్లే అంతర్జాతీయ ధరలు పెరిగాయని వాదన కోసం అంగీకరిద్దాం.
ఈ విధంగా ప్రపంచ చమురు ధరలు పెరిగినప్పుడు ఏ దేశంలోనైనా అనుసరించగల విధానాలు రెండు విధాలుగా ఉంటాయి. మొదటిది: దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలను, వాటిని ఉపయోగించి తయారు చేసే ఇతర ఉత్పత్తుల ధరలను పెరగనివ్వడం. ధరల పెరుగుదల. మాంద్యం కారణంగా ఆ ఉత్పత్తుల డిమాండ్ తగ్గిపోయి, తగ్గిన చమురు సరఫరాలకు తగినట్టు సర్దుబాటు కావడం ఒక విధానం.
ఈ విధానం వలన ఆర్థిక మాంద్యం అనివార్యంగా ఏర్పడుతుంది. వాస్తవానికి ఆర్థిక మాంద్యం వల్లే చమురు సరఫరాకు, డిమాండ్‌కు మధ్య సమతూకం ఏర్పడుతుంది. ఇక రెండవ విధానం: దేశీయంగా చమురు ఉత్పత్తుల ధరలను పెంచకుండా ఉండడం, పెట్రో ఉత్పత్తుల సరఫరాను రేషనింగ్ ద్వారా నియంత్రించడం. అందువలన ఇతర సరుకుల వినిమయం కోసం చేసే ఖర్చు దారి మళ్ళకుండా యథాతథంగా కొనసాగుతుంది. అందువలన ఆర్థిక మాంద్యం ఏర్పడదు. ఈ రేషనింగ్‌ను అమలు చేసేటప్పుడు పెట్రో ఉత్పత్తులను ముడిసరుకులుగా వాడే పరిశ్రమలకు సరఫరా కోత పెట్టకుండా కొనసాగించాలి. ప్రధానంగా సంపన్న వర్గాల వినియోగాన్ని నియంత్రించాలి. పెట్రో ఉత్పత్తుల సరఫరాను రేషనింగ్ చేసినందువలన వాటి కోసం చేయవల సిన ఖర్చు వేరే ఇతర, దేశీయంగా ఉత్పత్తి అయ్యే సరుకుల వినిమయం కోసం ఖర్చు అవుతుంది. అందువలన దేశీయంగా ఆ సరుకుల డిమాండ్ పెరుగుతుంది. అది ఉపాధి కల్పనకు దారి తీస్తుంది. అందుచేత మొదటి విధానం ఆర్థిక మాంద్యా నికి దారి తీస్తే, రెండో విధానం మరింత ఎక్కువ ఉపాధి కల్పనకు, ఉత్పత్తి పెరుగుదలకు దారి తీస్తుంది.ఇలా చెప్పడం మొదట విడ్డూరంగా అనిపించవచ్చు.
ప్రపంచ చమురు ఉత్పత్తులు తగ్గిపోయి, చమురు దిగుమతి తగ్గిపోతే ఆ దేశంలో ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? ఉపాధి ఎలా పెరుగుతుంది? అన్న సందేహాలు వస్తాయి. చమురు దిగుమతులు తగ్గినప్పుడు ఆ ప్రభావం వలన వినిమయం కూడా తగ్గిపోయి, ప్రత్యామ్నాయాల వైపు దృష్టి మళ్ళి దేశీయ ఉత్పత్తుల కోసం డిమాండ్ పెరుగుతుందని గ్రహించగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఈ విధానం కలిగించగల బహుళ ప్రభావాలు విదిత మౌతాయి. మరి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచకపోతే ఆ పెట్రో ఉత్పత్తులను దేశీయంగా ఉత్పత్తి చేసేవారు. పంపిణీ చేసేవారు నష్టపోతారు కదా. అప్పుడేం చేయాలి? ఆ నష్టాన్ని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా భరించవచ్చు. ఆ మేరకు బడ్జెట్‌లో ద్రవ్య లోటును పెంచవచ్చు. ఆ బడ్జెట్ లోటు పెరగడం పెద్ద సమస్యేమీ కాదు. ప్రపంచ చమురు ధరలు ఇరవై శాతం పెరిగా యనుకుందాం. అప్పుడు దేశంలోకి దిగుమతయ్యే చమురు పది శాతం తగ్గిపోయిందను కుందాం. అప్పుడు చమురు దిగుమతులకు మనం డాలర్ల రూపంలో చెల్లించవలసినది ఎనిమిది శాతం పెరుగుతుంది.
ఈ అదనపు విదేశీ మారక ద్రవ్యాన్ని ఎలాగో ఒకలాగ పోగేయాల్సిందే. ఒకవేళ మన దగ్గరున్న డాలర్ నిల్వల నుండి విడుదల చేశారనుకుందాం. అప్పుడు మొదటి విధానాన్ని అమలు చేస్తే, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. పెట్రో ఉత్పత్తి దారులు, పంపిణీదారులు వినియోగ దారుల నుండి రూపాయల్లో తమకు అవసరమైన అదనపు వనరుల్ని పొందుతారు. అదే రెండో విధానం అమలు చేస్తే, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగవు కనుక వారు తమకు కావలసిన అదనపు వనరులను నేరుగా ప్రభుత్వం నుంచే పొందుతారు. అంటే ఈ రెండవ విధానం అమలు చేస్తే అప్పుడు ప్రభుత్వం మీద, రిజర్వు బ్యాంక్ మీద, పెట్రో ఉత్పత్తుల కంపెనీల మీద భారం పడుతుంది. ఈ పెట్రో ఉత్పత్తుల కంపెనీల్లో ప్రభుత్వ రంగంలో కూడా ఉన్నాయి కదా. అప్పుడు అంతిమంగా ద్రవ్యలోటు పెరుగుతుంది. కాని స్థూల డిమాండ్ పడిపోకుండా నిలబడుతుంది. అందువలన అది ఆర్థిక మాంద్యానికి దారి తీయదు. పెట్రో ఉత్పత్తుల రేషనింగ్ ద్వారా సంపన్నుల వినిమయాన్ని అదుపు చేస్తే అప్పుడు వారి వినిమయం వేరే ఉత్పత్తులవైపు మరలుతుంది. ఉపాధి కూడా పెరగవచ్చు. అంతే కాదు, శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పడిపోకుండా నిలబడతాయి.
ఒకవేళ పెట్రో రేషనింగ్ కారణంగా చేయవలసిన ఖర్చు మిగిలిపోయిన దానిని సంపన్నులు ఇతర సరుకుల వినిమయం వైపు మళ్ళించకుండా దాచేస్తే? అప్పుడు అదనపు డిమాండ్ ఏర్పడదు, అదనపు ఉపాధీ కలగదు. కాని ప్రభుత్వం ద్రవ్యలోటును పెంచి తన వ్యయాన్ని పెంచి తద్వారా డిమాండ్‌ను, ఉపాధిని పెంచడానికి ఎప్పుడూ అవకాశం ఉండనేవుంది. కేవలం సంపన్నుల వినిమయాన్ని మాత్రమే రేషనింగ్ ద్వారా అదుపు చేస్తే దానివల్లే పెట్రో వినిమయం అవసరమైన మోతాదు మేరకు తగ్గిపోతుందని కూడా చెప్పలేము. కాని రేషనింగ్ వెనుక తర్కాన్ని అంగీకరిస్తే, అప్పుడు రేషనింగ్‌ను సంపన్న వర్గాల వారికి తోడు రక్షణ రంగం వంటి భారీ స్థాయి వినిమయం జరిగే రంగాలకు కూడా వర్తింప జేయవచ్చు. తగిన సంప్రదింపుల ద్వారా ఇది సాధ్యమే. 2013లో ఇదే విధంగా జరిగింది. అప్పుడు ప్రభుత్వం దగ్గర మిగిలే ఆర్థిక వనరులను ఇతర రంగాలకు మళ్ళించి దేశీయంగా డిమాండ్ ను పెంచుకోవచ్చు.
అయితే, ఈ రెండో విధానాన్ని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఏమాత్రమూ అంగీకరించదు. అందుచేత నయా ఉదారవాద విధానం అమలౌతున్న దేశాల్లో ఈ రెండవ విధానం అమలు జరిగే అవకాశమే లేదు. శ్రామిక ప్రజల జీవన ప్రమాణాలను నిలబెట్టడం, పెట్రో ఉత్పత్తుల రేషనింగ్, ద్రవ్య లోటును పెంచడం వంటివి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఆమోదయోగ్యం కానేకాదు. మరి మన బిజెపి ప్రభుత్వం ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి గొడుగు నీడనే కొనసాగుతున్నది కదా. అందుచేత పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం గాని, తద్వారా కోట్లాది మంది ప్రజల మీద భారాలను మోపడం కాని, దేశ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం పెరగడానికి దోవ తీయడం కాని మోడీ ప్రభుత్వానికి ఎంతమాత్రమూ అభ్యంతరకరం కాదు. 1973-74లో మొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా చమరు ధరల పెంపుదల తాకిడిని చవిచూసినప్పుడు మన ప్రభుత్వమే కాదు, చాలా మూడవ ప్రపంచ దేశాలు సైతం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి తప్పు చేశాయి. ఇప్పుడు మళ్లీ అదే తప్పు జరుగుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో, తక్కిన ఉత్పత్తుల వినియోగం బాగా తగ్గిపోయింది. పైగా వినియోగదా రులే పెట్రో ధరల పెంపు భారాన్ని కూడా భరించవలసి వచ్చింది. దాంతో సర్వత్రా ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి.
ద్రవ్యోల్బణం పెరగ్గానే ద్రవ్య పెట్టుబడి పొదుపు చర్యలను చేపట్టాలని ఒత్తిడి చేస్తుంది. దాంతో ద్రవ్యోల్బణం తోబాటు 1975 నాటికి తీవ్ర ఆర్థిక మాంద్యం కూడా నెలకొంది. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతోంది. దీనికి బలైపోయేది మాత్రం శ్రామిక ప్రజానీకమే. ఈ పెట్రో-రేషనింగ్ అనేదేమీ కొత్త వ్యవహారం కాదు. బీజింగ్‌లో, పారిస్‌లో కొన్ని నంబర్ల వాహ నాలను కొన్ని దినాల్లో రోడ్లపై తిరగడానికి అనుమతించరు. ఢిల్లీలో కూడా ఇటువంటిదే ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు కాలుష్యాన్ని నియం త్రించడం కోసం ఆ విధంగా చేశారు. అయితే, ఆ విధానానికి పలు మినహా యింపులు ఇవ్వడంతో అది పెద్దగా విజయవంతం కాలేదు. కాని తగిన పద్ధతిలో కట్టుదిట్టంగా దానిని అమలు చేయడం సాధ్యమే. కాని బీజేపీ ప్రభుత్వం మోకాళ్లు జారిపోయి వెంటనే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచివేసింది. దీని వలన శ్రామిక ప్రజానీకం ఎన్నో ప్రతికూల పరిస్థితులను చవిచూడవలసి వస్తుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



