బీహార్‌లో ఎన్నికల కమిషన్ (ఈసీఐ) జారీ చేసిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో, “ఎన్నికల జాబితాలో చేర్చడానికి అర్హతను నిర్ధారించుకునే ఉద్దేశ్యంతో పౌరసత్వానికి సంబంధిం చిన పరిమిత విచారణ నిర్వహించే అధికారం కమిషన్‌కు తన రాజ్యాంగ బద్ధ బాధ్యతల అమలులో భాగంగా ఉంది” అని పేర్కొంది. ఈ వ్యాఖ్య ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో పాటు న్యాయ మూర్తి జోయ్‌మాల్య బాగ్చీ సభ్యులుగా ఉన్న ధర్మాసనం నుంచి వచ్చింది. కచ్చితమైన ఓటర్ల జాబితాలను నిర్వహించడం, అర్హులైన వ్యక్తులకే ఓటు హక్కు వినియోగించే అవ కాశం కల్పించడం ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ బాధ్యత అని, అందువల్ల ఈ అధికారం ఆ బాధ్యత నుంచే ఉద్భవిస్తుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. స్పష్టంగా చెప్పాలంటే, సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు చాలా విస్తృతమైన, సమగ్ర అధికారాన్ని అప్పగించింది. విచారణ సందర్భం గా ఎన్నికల కమిషన్ చేసిన వాదనలను కూడా కోర్టు సమగ్రంగా పరిశీలించడానికి ప్రయత్నించలేదు. కమిషన్ వాదన ఏమిటంటే, ఎస్‌ఐఆర్ అనేది ప్రత్యేకమైన ప్రక్రియ కాదని, 2002-03లో బీహార్ ఎన్నికల జాబితాల తయారీ సమయంలో, ఆ తరువాత దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనుసరించిన విస్తృత సూత్రాల ఆధారంగానే ఇది రూపొందించబడిందని. అయితే పిటిషనర్ల ప్రశ్నలకు సమాధానంగా, 2002-03 నాటి అసలు ఉత్తర్వులు, అప్పటి విధానాలను సమర్పించే స్థితిలో తాము లేమని ఎన్నికల కమిషన్ అంగీకరించింది.
పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు
అయినప్పటికీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ విస్తృత అధికారం ఎన్నికల కమిషన్‌పై ఉన్న జవాబుదారీతనాన్ని దాదాపు తొలగించింది. కనీసం పారదర్శకతను పాటించాల్సిన అవసరాన్ని కూడా నిర్దేశించలేదు. న్యాయ, అర్ధన్యాయ ప్రక్రియలు న్యాయంగా ఉండటమే కాకుండా న్యాయంగా కనిపించాలి అనే ప్రాథమిక న్యాయసూత్రాన్ని పూర్తిగా విస్మరించింది. పారదర్శకత పట్ల ఎన్నికల కమిషన్‌కు ఏమాత్రం శ్రద్ధ లేదనేది మొదటి నుంచే స్పష్టమైంది. తొలగించిన ఓటర్ల జాబితాను ఇవ్వడమే కాదు, ఆ తొలగింపులకు గల కారణాలను కూడా వెల్లడించలేదు. ముఖ్యంగా, ప్రజల పరిశీలన కోసం ఆ జాబితాను డిజిటల్ రూపంలో లేదా యంత్రం చదవగలిగే రూపంలో ఇవ్వడానికి కూడా కమిషన్ నిరాకరించింది. ఈ కీలకమైన ప్రశ్నకు కమిషన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రజల ముందర జవాబుదారిగా ఉండాలనే ఉద్దేశం లేకపోవడానికి ఇది నిదర్శనంగా భావించవచ్చు.
పౌరసత్వ నిర్ణయంలో ఈసీఐ పాత్ర పరిమితమే
అయితే, పౌరసత్వంపై తుది నిర్ణయం తీసుకునే రాజ్యాంగబద్ధ అధికారాన్ని ఎన్నికల కమిషన్‌కు అప్పగించలేమనే విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. అందువల్ల, ఒక వ్యక్తి పౌరసత్వం ఆధారంగా ఓటర్ల జాబితాలో చేర్చడానికి అర్హుడు కాదని కమిషన్ భావిస్తే, ఆ విషయాన్ని చట్టం ప్రకారం విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారికి పంపాలని ఆదేశించింది. ఈ ఆదేశాన్ని బలపరుస్తూ, “కమిషన్ నిర్ణయం ఎన్నికల అవసరాలకే పరిమితం; పౌరసత్వ ప్రశ్నపై అది తుది నిర్ణయంగా పరిగణిం చబడదు” అని కోర్టు పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16ను ప్రస్తావిస్తూ, ఓటు హక్కు కేవలం భారత పౌరులకే కల్పించబడిందని కోర్టు గుర్తుచేసింది. అందువల్ల ఓటర్ల జాబితాలో నమోదు కావడానికి పౌరసత్వం ముందస్తు అర్హత. కాబట్టి, ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తులు ఈ అర్హతను కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకోకుండా ఎన్నికల కమిషన్ తన బాధ్యతను నిర్వర్తించలేదని పేర్కొంది.
తన వాదనను ముగిస్తూ సుప్రీంకోర్టు ఇలా పేర్కొంది:
“ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16లోని చట్టబద్ధ అవసరాన్ని దష్టిలో ఉంచుకుంటే, ఎన్నికల జాబితాల తయారీ లేదా సవరణ సమయంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలను పరిశీలించే అధికారం కమిషన్‌కు నిస్సందేహంగా ఉంది. అయితే అలాంటి విచారణ కేవలం ఎన్నికల జాబితాలో చేర్చాలా లేదా తొలగించాలా అన్న కోణంలో మాత్రమే జరగాలి. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తికి అనుకూలంగా ఉండే చట్టబద్ధ ఊహను గౌరవిస్తూ ఈ ప్రక్రియ నిర్వహించాలి. ఎన్నికల అవసరాల కోసమే కమిషన్ తన ముందున్న ఆధారాలను పరిశీలించి నిర్ణయానికి రావాలి. ముఖ్యంగా, ఈ మొత్తం ప్రక్రియ న్యాయపరమైన పునర్విమర్శకు లోబడి ఉంటుంది. తద్వారా విచారణ చట్టబద్ధంగా, విధి విధానాలకు అనుగుణం గా జరిగిందో లేదో నిర్ధారించబడుతుంది.”
ఓటుహక్కు అనే రాజ్యాంగ పునాది నిర్లక్ష్యం
‘కమిషన్ తన చట్టబద్ధ అధికారాలను మించలేద’న్న వాదనను అంగీకరిస్తూ ఎన్నికల కమిషన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు, వాస్తవానికి మరింత గందర గోళంతో పాటు స్వీయ వైరుధ్యాన్ని సృష్టించింది. ఇది మన గణతంత్ర రాజ్యాంగపు ప్రాథమిక సూత్రాలనే ప్రభావితం చేస్తోంది. మన రాజ్యాంగ నిర్మాణ చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే, స్వతంత్ర, ప్రజాస్వామ్య, లౌకిక గణతంత్రంగా భారత దేశం ఓటు హక్కును ఎన్నికల వ్యవస్థ పునాదిగా స్వీకరించిందని స్పష్టమవుతుంది. అందుకే తొలి ఎన్నికల కమిషన్ నుంచీ ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో చేర్చడం లేదా తొలగించడం అనే బాధ్యతను వ్యక్తిగత పౌరుడిపై ఎప్పుడూ మోపలేదు. ఆ బాధ్యత ఎల్లప్పుడూ ఎన్నికల కమిషన్ లేదా దాని పరిపాలనా వ్యవస్థపైనే ఉండేది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు ‘సర్’ నిర్వహించే చట్టబద్ధ అధికారం ఉందని భావించినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తి బాగ్చీ తీర్పు వ్యక్తిగత పౌరుడి రాజ్యాంగబద్ధ ఓటు హక్కు అనే సమానంగా కీలకమైన అంశంపై ప్రమాదకరమైన మౌనం పాటించింది. రాజ్యాంగంలో పొందుపరచబడిన ఈ హక్కును వివిధ ధర్మాసనాలు అనేకసార్లు పునరుద్ఘాటించాయి.
పశ్చిమబెంగాల్ అనుభవం చెబుతున్న హెచ్చరిక
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఏడు లక్షల మంది ఓటు హక్కు కోల్పోయిన వాస్తవం దష్ట్యా ఈ ప్రశ్నలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కాలపరిమితి, వివాదాస్పద న్యాయ, రాజ్యాంగ ప్రశ్నలను పరిష్కరించేందుకు తగిన ప్రక్రియలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. చివరకు ఈ వివాదాల పరిష్కారానికి న్యాయ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాల్సి వచ్చినది కూడా సుప్రీంకోర్టే. అయితే ఆ ట్రిబ్యునళ్లలో ఒకదానికి అధ్యక్షత వహిస్తున్న కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, “అన్ని దరఖాస్తులను పరిష్కరించడానికి కనీసం నాలుగేళ్లు పడుతుంది” అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. దురదష్టవశాత్తు, సుప్రీంకోర్టు ఉత్తర్వు ఈ వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోలేదు. వ్యక్తిగత పౌరుడి రాజ్యాంగ హక్కుకు తగిన ప్రాధాన్యం ఇవ్వబడలేదు.
హిందుత్వ ప్రభావం, న్యాయవ్యవస్థపై ఆందోళనలు
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందుత్వను భారత రాష్ట్ర ప్రధాన సిద్ధాంతంగా ముందుకు నెట్టుతున్నారని ఇప్పుడు గమనించ వచ్చు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మాదిరిగానే న్యాయవ్యవస్థ కూడా ఈ సిద్ధాంత ప్రభావానికి పూర్తిగా అతీతంగా ఉంటుందని భావించడం అమా యకత్వం. భారత రాజ్యాంగం ఎప్పుడూ హక్కుల ఆధారితమైనది. ఆ హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టే తుది సంరక్షకుడు. భారత మీడియా వర్గాల్లో ఆరెస్సెస్ ఆధ్వర్యంలోని అఖిల భారతీయ అధివక్తా పరిషత్ న్యాయస్థానాలు, న్యాయవాదుల వర్గాలపై తన ప్రభావాన్ని నిరంతరం విస్తరించుకుంటోందనే వార్తలు వెలువడుతు న్నాయి. ఈ పరిణామం గణతంత్ర రాజ్యాంగాన్ని లోపలినుంచి ఖాళీ చేసి, పౌరుల హక్కుల ఆధారిత ప్రజాస్వామ్యాన్ని బలపరచడం బదులుగా కేంద్రీకత అధికారాన్ని బలపరిచే ‘భారతీయ’ న్యాయ సిద్ధాంతానికి స్థలం కల్పించే ప్రయత్నంలా కనిపిస్తోంది. వివేకంతో ఆలోచించే పాఠకులకు ఇది చాలిన సంకేతం. అందువల్ల, సార్వత్రిక ఓటుహక్కును హరించే ప్రయత్నాలను దీర్ఘకాలిక పోరాటం ద్వారా తిప్పికొట్టాలి. భయం లేకుండా, పక్షపాతం లేకుండా ఓటు వేయగల రాజ్యాంగబద్ధ హక్కును కాపాడేందుకు ఎన్నికల సంస్కరణల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.
(జూన్ 3, 2026 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
భారత గణతంత్ర రాజ్యాంగపుఒక కీలక పునాదిని కూల్చివేయడం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



