Saturday, June 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికూర్చునే హక్కే లేదాయే!?

కూర్చునే హక్కే లేదాయే!?

- Advertisement -

ప్రజాస్వామ్యంలో ఉద్యోగికి కూర్చునే హక్కు ఎందుకు ఉండకూ డదు? బానిసత్వం, నిర్బంధం, అణచివేతల నుండి విముక్తి పొంది-ప్రజాస్వామ్య భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం.మన ఇంటికి వచ్చిన అతిథిని “రండి కూర్చోండి” అని మర్యాద పూర్వకంగా ఆహ్వానించడం మన సంస్కృతి. మహిళను గౌరవించే దేశంగా మన దేశాన్ని “భారతమాత”గా కీర్తిస్తాం. రాజ్యాంగం స్త్రీ-పురుషులకు సమాన హక్కులు కల్పించింది. అయితే ఉద్యోగ స్థలాల్లో మాత్రం ఈ విలువలు ప్రతిఫలిస్తున్నాయా? మన దేశంలోని అనేక దుకాణాలు, షోరూములు, మాల్స్‌, వస్త్ర విక్రయ కేంద్రాలు, కొన్ని ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులు గంటల తరబడి నిలబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. పని లేకున్నా కూర్చోకూడదనే మౌ(న)ఖిక నిబంధనలు అమలవుతున్నాయి. కొన్నిచోట్ల గోడకు ఆనుకోవ డం కూడా తప్పుగా పరిగణించబడుతోంది.సీసీ కెమెరాల నిఘాలో ఉద్యోగులు నిరంతరం నిలబడేలా ఒత్తిడి చేయడం మానవీయతకు విరుద్ధం. వినియోగ దారులను చిరునవ్వుతో ఆహ్వానిస్తూ,వారి సందేహాలకు ఓర్పుతో సమాధానం చెబుతూ సంస్థకు ఆదాయం పెంచే బాధ్యత నిర్వహించే సేల్స్ సిబ్బంది కనీస విశ్రాంతి సౌకర్యానికి కూడా నోచుకోకపోవడం విచారకరం. అభివృద్ధి, ఆధునికత గురించి గొప్పలు చెప్పుకునే సమాజంలో ఉద్యోగికి కూర్చునే హక్కు లేకపోవడం, ముమ్మాటికి వారి హక్కుల చట్టాల ఉల్లంఘన-నేర పూరిత అన్యాయం.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–21 జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా, ఆరోగ్యంగా జీవించే హక్కును కూడా కల్పిస్తోంది. పని చేసే చోట భద్రమైన,ఆరోగ్య కరమైన వాతావరణం కల్పించడం యాజ మాన్యాల బాధ్యత. దీర్ఘకాలం నిలబడి పనిచేయడం వల్ల ఉద్యోగులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిరంతరం నిలబడటం వల్ల కాళ్లు,మడమలు, మోకాళ్లు, నడుం, వెన్నెముకపైతీవ్ర ఒత్తిడి పడుతుంది. కండరాల నొప్పులు, వెరికోస్ వెయిన్స్, కీళ్ల సమస్యలు, రక్తప్రసరణ లోపాలు వంటి సమస్యలు పెరుగుతాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఎక్కువసేపు నిలబడటం గుండె–రక్తనాళ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో తలనిర్మళం, రక్తపోటు మార్పులు, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. మరికొన్ని ఉద్యోగ స్థలాల్లో టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా వెసులు బాటు లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళల్లో మూత్ర పిండాలు, మూత్రనాళాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి.ఉద్యోగి శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తే ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. కాబట్టి కూర్చునే హక్కు కేవలం సౌకర్యం కాదు; అది ఆరోగ్య రక్షణకు సంబంధించిన మౌలిక హక్కు.

ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు అనేవి పోరాటాల ఫలితంగానే వచ్చాయి. తగిన వేతనం,పని గంటల పరిమితి, సెలవులు, భద్రతా ప్రమాణాలు అన్నీ ఉద్యమాల ద్వారానే సాధ్య మయ్యాయి. అదే విధంగా “రైట్ టు సిట్” (కూర్చునే హక్కు) కూడా ఒక కార్మిక హక్కుగా ప్రపంచంలోని అనేక దేశాలు చాలా కాలం క్రితమే గుర్తించాయి. భారతదేశంలో ఈ అంశంపై అత్యంత ప్రాముఖ్యమైన ఉద్యమం కేరళలో జరిగింది. సేల్స్‌వుమెన్‌గా పనిచేసే మహిళలు ఉద్యోగ సమ యంలో కూర్చునే హక్కు, విశ్రాంతి సమయం, టాయిలెట్ సౌకర్యాల కోసం దీర్ఘకాల పోరాటం చేశారు. ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమ ఫలితంగా 2018లో కేరళ ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలో సవరణలు చేసి ఉద్యోగులకు కూర్చునే సౌకర్యం కల్పించడం తప్పనిసరి చేసింది. అనంతరం తమిళనాడు కూడా ఇదే దిశగా అడుగులు వేసింది.ప్రస్తుతం దేశంలో రిటైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది. సుమారు రెండున్నర కోట్ల మంది మహిళలు,యువత ఈ రంగంలో పనిచేస్తున్నారు. అయితే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న హక్కులు ఇంకా అనేక రాష్ట్రాల్లో అమలు కాక పోవడం బాధాకరం. దేశం అభివృద్ధి చెందిం దని చెప్పుకోవడం కంటే, ఉద్యోగి గౌరవాన్ని కాపాడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్య మవుతుంది. కాబట్టి “రైట్ టు సిట్” హక్కును దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత, దాన్ని సమాజం సమర్థించడం మానవీయ-సమాజిక స్పృహకు నిదర్శనం.ఎందుకంటే?ఉద్యోగికి ఇచ్చే ఒక కుర్చీ కేవలం విశ్రాంతి కోసం కాదు, అది మానవ గౌరవానికి ఇచ్చే గుర్తింపు.

మేకిరి దామోదర్, 9573666650

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -