Saturday, May 16, 2026
E-PAPER
Homeఆటలుసన్‌‌రైజర్స్‌ ‘పిండేస్తోంది’

సన్‌‌రైజర్స్‌ ‘పిండేస్తోంది’

- Advertisement -

అమాంతం పెరిగిన ఆర్‌‌సీబీ,
ఎస్‌ఆర్‌‌హెచ్‌ మ్యాచ్‌ టికెట్‌ ధరలు

నవతెలంగాణ-హైదరాబాద్‌ : అభిమానుల్లో ఐపీఎల్‌ ‌మ్యాచ్‌లపై ఉన్న క్రేజ్‌‌ను సన్‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రాంఛైజీ యాజమాన్యం భారీగా సొమ్ముచేసుకుంటోంది. ఉప్పల్‌ ‌స్టేడియంలో ఐపీఎల్‌ ‌మ్యాచ్‌‌కు సాధారణంగా కనీస టికెట్‌ ‌ధర రూ.950గా ఉండేది. కానీ రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరుతో మ్యాచ్‌‌కు కనీస టికెట్‌ ‌ధర రూ.1950గా మారింది. భారత స్టార్‌ ‌క్రికెటర్‌ ‌విరాట్‌ ‌కోహ్లి ఈ నెల 22న సన్‌‌రైజర్స్‌తో మ్యాచ్‌‌లో బరిలోకి దిగనుండటంతో.. అభిమాన క్రికెటర్‌‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట్‌ ‌కోహ్లిపై ఫ్యాన్స్‌ అభిమానాన్ని సన్‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌ ‌టికెట్‌ ‌ధరల పెంపు రూపంలో సొమ్ముచేసుకుంటోంది.

​అమాంతం పెరిగిన ధరలు
ఆర్‌‌సీబీ, ఎస్‌ఆర్‌‌హెచ్‌ ‌మ్యాచ్‌ ‌టికెట్‌ ‌ధరలు అమాంతం పెంచారు. కార్పోరేట్ బాక్స్‌ ‌టికెట్ ధర రూ.45 వేలు. గతంలో ఇదే టికెట్‌ ‌ధర రూ.30 వేలు మాత్రమే. సాధారణ అభిమానులు ఎక్కువగా కొనుగోలు చేసే నార్త్‌, సౌత్‌ ‌టెర్రస్‌ ‌టికెట్‌ ‌ధరలు రెట్టింపు అయ్యాయి. సౌత్‌ ‌టెర్రస్‌‌లో రూ.3500, నార్త్‌ ‌టెర్రస్‌‌లో రూ.1950కి అమ్మకానికి పెట్టారు. స్టేడియంలో మంచి వ్యూపాయింట్‌‌తో లభించే ఈస్ట్‌, వెస్ట్‌ ‌స్టాండ్స్‌ ‌టికెట్‌ ‌ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. గత మ్యాచ్‌‌లకు ఈస్ట్‌, వెస్ట్‌ ‌స్టాండ్స్‌ ‌ఫస్ట్‌ ‌ఫ్లోర్‌ ‌టికెట్‌‌ధరలు రూ.2500 కాగా.. ఆర్‌‌సీబీ మ్యాచ్‌‌కు రూ.4500 చేశారు. ఇదే స్టాండ్స్‌‌లో గ్రౌండ్‌‌ఫోర్ల్‌ ‌టికెట్‌ ‌ధరలను రూ.6000కు పెంచారు. హాస్పిటాలిటీ ఉన్న స్టాండ్స్‌ ‌టికెట్‌ ధరలు గత మ్యాచ్‌‌కు రూ.8500 కాగా.. బెంగళూరుతో మ్యాచ్‌‌కు రూ.13000కు పెంచారు. సన్‌‌రైజర్స్‌ లాంజ్‌, గోల్డ్‌ ‌లాంజ్‌ ‌టికెట్‌ ‌ధరలు సైతం రూ.20 వేలను తాకాయి. కార్పోరేట్‌ ‌బాక్స్‌‌లు, హాస్పిటాలిటి టికెట్ల ధరలు ముందు నుంచీ ఎక్కువగానే ఉన్నాయి. కానీ సామాన్య అభిమానులు కొనుగోలు చేసే స్టాండ్స్‌ ‌టికెట్‌ ‌ధరలను సైతం రెట్టింపు చేయటం ఫ్యాన్స్‌‌ను నిరుత్సాహానికి గురి చేసింది. సన్‌‌రైజర్స్‌ అభిమానులను దోపిడీ చేస్తుందనే భావన కలుగుతోంది. ‌సన్‌‌రైజర్స్‌, రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌మ్యాచ్ టికెట్లను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్‌‌లైన్‌‌లో అమ్మకానికి పెట్టగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడుపోయాయి. టికెట్ల కోసం ఆన్‌‌లైన్‌‌లో ఏకంగా 3 లక్ష‍ల మంది అభిమానులు నిరీక్ష‍ించటం గమనార్హం.

​బోర్డు నియంత్రణ లేదు
ఐపీఎల్‌ ‌మ్యాచ్‌‌లకు టికెట్‌ ‌ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రాంఛైజీలకు బీసీసీఐ కల్పించింది. ప్రతి ప్రాంఛైజీ సొంత గడ్డపై జరిగే ఏడు మ్యాచ్‌‌లకు టికెట్‌ ‌ధరలను సొంతంగా నిర్ణయిస్తుంది. కొన్ని ప్రాంఛైజీలు రూ.450కి టికెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. చెన్నై సూపర్‌‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్ చాలెంజర్స్‌ ‌బెంగళూరుతో మ్యాచ్‌‌లకు సన్‌‌రైజర్స్‌ ‌యాజమాన్యం ఆది నుంచి టికెట్‌ ‌ధరలను పెంచుతుంది. ఉప్పల్‌ ‌స్టేడియంలో ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు టికెట్ల అమ్మకంతోనే ఏకంగా రూ.15-25 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది సన్‌‌రైజర్స్‌. జెన్‌‌ జీలో ఎస్‌ఆర్‌‌హెచ్‌‌పై ఆదరణ, ఫాలోయింగ్‌ ‌గణనీయంగా పెరగటంతో ఆ అభిమానాన్ని సన్‌‌రైజర్స్‌ ‌టికెట్‌ ‌ధరల రూపంలో సొమ్ముచేసుకుంటోంది. ఐపీఎల్‌ ‌మ్యాచ్‌‌లకు అన్ని ప్రాంఛైజీలు రూ.400-500 టికెట్‌ ‌ధరతో కనీసం 25 శాతం టికెట్లను అందుబాటులో ఉంచేలా బీసీసీఐ మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని అభిమానులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -