Saturday, May 16, 2026
E-PAPER
Homeజాతీయంనిరుద్యోగాన్ని పెంచుతున్న మోడీ కొత్త ఉపాధి చట్టం

నిరుద్యోగాన్ని పెంచుతున్న మోడీ కొత్త ఉపాధి చట్టం

- Advertisement -

ఉపాధి హామీని నిర్వీర్యం చేసే వీబీజీ ఆర్ఏఎంజీని వెంటనే ఉపసంహరించుకోవాలి
• దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కార్మికుల సమ్మె.. గ్రామ పంచాయతీల ముట్టడి
• లేబర్ కోడ్ లు, ఉపాధి విధ్వంసం, ఎంఎస్పీపై నమ్మక ద్రోహానికి
• వ్యతిరేకంగా ఆగస్టులో దేశవ్యాప్త జైల్ భరో

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి తీసుకొచ్చిన వీబీజీఆర్ఏ ఎంజీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి హామీ కార్మికులు సమ్మెలో పాల్గొని, గ్రామ పంచాయ తీలను ముట్టడించారు. గ్రామీణ కార్మికులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ నిరసన సభ జరిగింది. ఈ సభలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, ఏఐకేఎస్ సీనియర్ నాయ కులు హన్నన్ మొల్లా తదితరులు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

“మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, గ్రామీణ కార్మికులను కార్పొరేట్ శక్తులకు చౌక శ్రమగా మార్చడానికి పద్ధతి ప్రకారం బలహీనపరుస్తోంది. వీబీజీఆర్ఏఎంజీ అనేది పని హక్కును కాలరాసే ఒక ప్రమాదకరమైన విధానం. ఇది ఉపాధి కల్పించే చట్టం కాదు. నిరుద్యోగం, ఆకలి చావులు, వలసలు, మరణాలకు గ్యారంటీ ఇచ్చే విధానం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ భారతదేశం ఇప్పటికే పని దినాల తగ్గింపు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాల వల్ల తీవ్ర ఉపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీని బలహీనపరచడం తో గ్రామీణ పేదల జీవనోపాధి హక్కుపై ప్రత్యక్షదాడి చేయడమేనని మండిపడ్డారు. సాంకేతికత పేరుతో కార్మికులను పనికి దూరం చేస్తున్నారని, ఆధార్ అనుసంధానం, రోజుకు రెండుసార్లు డిజిటల్ హాజరు, పని ప్రదేశాలలో కార్మికుల ఫోటోలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలనే నిర్బంధ విధానాలను తీవ్రంగా ఖండించారు.

డిజిటలైజేషన్ ముసుగులో పేదలను అవమానించడం, వారికి ఉపాధిని నిరాకరించడం అమానవీయమని, కార్మిక వ్యతిరేకమని స్పష్టం చేశారు. “పని హక్కుపై దాడి అంటే పేదల జీవించే హక్కుపై దాడే. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం సమిష్టిగా ఈ దాడు లను తిప్పికొడతాయి. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే విధానాలను ప్రజలు సహిం చరు”అని హెచ్చరించారు. ఉపాధి హామీ రక్షణ, లేబర్ కోడ్‌ల రద్దు, కనీస మద్దతు ధరకి చట్టబద్ధమైన గ్యారంటీ కోసం ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా “జైల్ భరో” పోరాటాలు నిర్వ హించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు విక్రమ్ సింగ్ అధ్య క్షత వహించగా, సుదీప్ దత్తా ముగింపు ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎం.సాయిబాబా, నర్సింగరావు, బేబీ రాణి.. తెలంగాణ నుంచి చుక్క రాములు, పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆందోళన భారీగా జరిగింది. ఈ రాష్ట్రాలలో లక్షలాది మంది వ్యవసాయ, గ్రామీణ కార్మికులు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వెలుపల వివిధ రూపాల్లో నిరసనలు, ప్రదర్శనలతో సమ్మెలో పాల్గొన్నారు. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలలో వ్యవసాయ, గ్రామీణ కార్మికులు విబిజిఆర్ఎఎంజిని వెనక్కి తీసుకోవాలని, పటిష్టమైన ఎంజిఎన్ఆర్ఈజిఏను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాలు సమర్పించారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, ఒరిస్సా, కర్ణాటక, త్రిపుర వంటి అనేక ఇతర రాష్ట్రాలలో వేలాది మంది వ్యవసాయ, గ్రామీణ కార్మికులు తమ తమ గ్రామాలలోనూ, కొన్ని చోట్ల ఎస్డిఎం కార్యాలయాల వెలుపల ప్రదర్శనలు నిర్వహించారు.

ముఖ్య డిమాండ్లు
వీబీజీ ఆర్ఏఎంజీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించి, 
మరింత బలోపేతం చేయాలి.
ఏడాదికి కనీసం 200 రోజుల పని కల్పించాలి.
రోజువారీ కనీస వేతనాన్ని రూ. 700లకు పెంచాలి.
ఆధార్ అనుసంధానాన్ని రద్దు చేయాలి.
రోజుకు రెండుసార్లు డిజిటల్ హాజరు తీసుకునే పద్ధతిని ఉపసంహరించుకోవాలి.
పని ప్రదేశాల్లో కార్మికులను నిర్బంధంగా ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయడాన్ని నిలిపివేయాలి.
నూతన లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేయాలి.
కనీస మద్దతు ధరకి చట్టబద్ధమైన గ్యారంటీ కల్పించాలి.
గ్రామసభలకు పూర్తి అధికారాలు ఇవ్వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -