ప్రియమైన వేణు గీతికకు
నాన్న నేను చాలా సంతోషంగా ఉన్నాను రా! ఎందుకో తెలుసా.. నువ్వు వారం రోజులుగా నా దగ్గర ఉన్నందుకు. నువ్వు వస్తున్నావని నీకోసం ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసాను. అందులో నువ్వు, బుర్రా మోహనకృష్ణ మామయ్యా పాల్గొని మీ హాస్య వల్లరితో ప్రేక్షకులని నవ్వించారు. కుదిరినప్పుడల్లా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. సరే నాన్న! నేను పిల్లల పెంపకం గురించి చెప్తున్నాను కదా! ఇప్పుడు కూడా ఆ విషయం గురించే చెప్తాను.
చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆటలు ఆడడం నేర్పించాలి. ఈ మధ్యకాలంలో సంవత్సరం కూడా నిండని పసిపిల్లల చేతుల్లో మొబైల్ ఉంటున్నాయి. ఈ ఫోన్స్ పిల్లలకు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. పిల్లలు తమ జోలికి రాకుండా ఉండాలని తల్లిదండ్రులు వాళ్లకు మొబైల్స్, టీవీలు అలవాటు చేస్తున్నారు. వీటివల్ల జరిగేది అనర్థమే కానీ మంచి కాదు.
పిల్లలకు పసితనం నుండే అంటే వాళ్లకి పాకడం, కూర్చోవడం వచ్చినప్పుడు చిన్న చిన్న బొమ్మలు వాళ్ళ ముందు పెట్టి ఆడుకొనివ్వాలి. బొమ్మలు కూడా ఇప్పుడు పిల్లల్ని ఆకర్షించే విధంగా ఎన్నో వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్లతో పాటు తల్లిదండ్రులు కూడా కాసేపు ఆటల్లో పాల్గొనాలి. వాళ్లని సాయంత్రం పూట దగ్గర్లో ఉన్న ఏదైనా పార్కుకి తీసుకొని వెళ్ళాలి. అక్కడ వాళ్ళ వయసు పిల్లలు ఉంటే వాళ్లతో ఆడుకొనివ్వాలి. దాని వల్ల పిల్లల్లో శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అంతే కాక పిల్లలతో ఆడుకోవడంతో వాళ్ల మధ్య స్నేహపూర్వకమైన అనుబంధం ఏర్పడుతుంది. పిల్లల్ని ఎప్పుడూ బంధించి ఉంచకూడదు. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వకుండా, ఆడుకోనివ్వకుండా, ఎవరితో కలవనివ్వకుండా ఉంచుతారు కొందరు తల్లి తండ్రులు. ఎప్పుడూ అలా చేయకూడదు. వాళ్లని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. నిన్ను చిన్నప్పుడు పార్కులకు తీసుకు వెళ్ళేదాన్ని, అక్కడ ఆడించేదాన్ని.
నాన్న నిన్ను బండి మీద కూర్చోబెట్టుకుని తిప్పి తీసుకుని వచ్చేవారు. లేదా ఎత్తుకుని బైట పక్షులను, జంతువులను, రకరకాల వాహనాలను చూపిస్తూ వుండేవారు.
నేనూ నువ్వు ఇంట్లో దాగుడుమూతలు, కళ్ళకు గంతలు కట్టుకుని ఆడుకునే వాళ్ళం. ఆటల వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆటలు పిల్లలకు ఎంతో అవసరం. ఎప్పుడు సమయం దొరికినా, వారితో కనీసం అరగంట సేపు ఆడుకోగలిగితే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. వారు మీతో ఆడుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్ళతో గడిపే సమయం ఎప్పుడూ తీపి జ్ఞాపకాలే నాన్న. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి.
మరో ఉత్తరంలో మరికొన్ని చెప్తా. ఉంటాను…
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



