పోక్సో కేసులో 14 రోజుల పాటు రిమాండ్
మేడ్చల్ జిల్లా 9వ అదనపు మేజిస్ట్రేటు తీర్పు
పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సరెండర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మైనర్‌పై లైంగికదాడి జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బండి సాయి భగీరథ్‌కు 14 రోజుల పాటు రిమాండ్‌ను విధిస్తూ మేడ్చల్ జిల్లా 9వ అదనపు మేజిస్ట్రేటు శనివారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. 5 నిమిషాలు మాత్రమే మేజిస్ట్రేటు ఇటు పోలీసులు, అటు బండి భగీరథ్ తరఫు న్యాయవాదుల నుంచి వాదనలు విన్న మేజిస్ట్రేటు పై ఆదేశాలు జారీ చేశారు. దీంతో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన రాత్రి 12 గంటల 5 నిమిషాలకు భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకముందు రాత్రి 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పేట్‌బషీర్‌బాద్ పోలీసు స్టేషన్‌లో సిట్ పర్యవేక్షణాధికారి డీసీపీ రితురాజ్ నేతృత్వంలో సాయిభగీరథ్‌ను విచారిం చారు. రెండున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో బాధితురాలు ఇచ్చిన మూడు వాంగ్మూలాల ఆధారంగా భగీరథ్‌ను అధికారులు ప్రశ్నించారు. అంతేగాక విచారణకు హాజరుకావడానికి వారం పాటు ఎందుకు సమయం తీసుకు న్నారు మొదలుకొని బాధితురాలు ఇచ్చిన ఆధారాల ఆధారంగా భగీరథ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే తాను నిరపరాధిని అని పేర్కొంటు తాను తీసుకొచ్చిన కొన్ని ఆధారాలను సిట్ అధికారులకు భగీరథ్ సమర్పిం చారని తెలిసింది. ముఖ్యంగా బాధితురాలు మైనర్ కాదనీ, ఆమె మేజరేనంటూ కొన్ని ఆధారాలను చూపడంతో పాటు తనపై ఆమె, ఆమె కుటుంబసభ్యులు హనీట్రాప్‌నకు పాల్పడ్డారనీ, అడిగి నంత డబ్బులు ఇవ్వకపో వటంతోనే తనపై దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టారని నిందితుడు ఆరోపిం చినట్టు తెలిసింది. మొత్తమ్మీద సుదీర్ఘ విచారణానంతరం రిమాండ్ రిపోర్ట్‌ను తయారు చేసిన సిట్ అధికారులు 11.30 గంటల ప్రాంతంలో మేడ్చల్‌లోని పబ్లిక్ హెల్త్ సెంటర్‌కు వైద్యపరీక్షల నిమిత్తం భగీరథ్‌ను తరలించారు.కట్టుదిట్టమైన భద్రత నడుమ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి నేతృత్వంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐదు నిమిషాల పాటు పరీక్షలు జరిపిన వైద్యులు తను ఆరోగ్యంగా ఉన్నాడని తేల్చారు. దాంతో 12 గంటల ప్రాంతంలో భగీరథ్‌ను పక్కనే ఉన్న మేజిస్ట్రేట్ నివాసానికి సిట్ అధికారులు తరలించారు.
ఎట్టకేలకు చిక్కిన బండి భగీరథ్ దేశంలోనే సంచలనం సృష్టించిన బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు శనివారం కీలక మలుపుతిరిగింది. మైనర్ పై లైంగికదాడి కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్‌ను రాత్రి 8.15 గంటల ప్రాంతంలో తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ ప్రకటించారు. అదే సమయంలో కుటుంబసభ్యుల ,ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సాయి భగీరథ్‌ను పోలీసులకు అప్పగిం చామని తండ్రి బండి సంజయ్ ప్రకటించారు. ఉదయం నుంచి బండి సాయి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే..అనేక మలుపులు తిరిగాయి. ఉదయం నుంచి ఈ కేసుకు సంబంధించిన సిట్ అధికారులు డీసీపీ రీతురాజ్ నేతృత్వంలో నిందితుడి కోసం బండి సంజయ్ నివాసంలోనూ అటు కరీంనగర్‌లోని నివాసాలతో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇండ్లలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు బండి సాయి భగీరథ్ దేశం దాటివెళ్లిపోుండా ముందు జాగ్రత చర్యగా లుక్ అవుట్ నోటీసులు కూడా అన్ని ఎయిర్‌పోర్టులకు సిట్ అధికారులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ కూడా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోనున్నారనే ప్రచారం కూడా సాగింది. ఒక పక్క గాలింపులు మరో పక్క లొంగిపోతాడనే ఊహగానాల మధ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ వద్ద వె ళ్తుండగా బండి భగీరథ్‌ను పోలీసులు రాత్రి 8 గంటలకు అదుపులోకి తీసుకున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంలోనే భగీరథ్ తండ్రి బండి సంజయ్ సైతం ఒక ప్రకటన చేశారు. తన కుమారుడిని బంధువుల సాయంతో పోలీసులకు అప్పగిం చామని తెలిపారు. ఇన్ని రోజులు అతడ్ని అప్పగించకపోవడానికి కారణం.. అతడికి కోర్టు నుంచి బెయిల్ లభిస్తుందని ఆశించామని అన్నారు.
న్యాయ నిపుణులతో సంప్రదించి ఆ దిశగా ప్రయత్నాలు చేసిన కారణంగా ఈ జాప్యం జరిగిందని, ‘చివరికి చట్టం ఎవరికైనా చట్టమేనని’ అందుకే తన కుమారుడిని పోలీసులకఁ అప్పగించామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే..శనివారం రాత్రి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు నిందితుడు భగీరథ్‌ను సిట్ అధికారులు తరలించారు. అక్కడే అతడిని విచారించాక కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మెజిస్ట్రేట్ నివాసంలో భగీరథ్‌ను సిట్ అధికారులు హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉంటే శనివారం మూడో సారి కూడా బాధితురాలైన మైనర్ బాలికను మేడ్చెల్ మెజిస్ట్రేట్ ముందు సిట్ పోలీసు అధికారులు హాజరుపరిచి ఆమె చేత వాగ్మూలం ఇప్పించారు. అంతకు ముందు ఈ నెల 8వ తేదిన పిర్యాదు చేసినప్పుడు మొదటి సారిగా పేట్‌బషీర్‌బాగ్ పోలీసులు ఆమె నుంచి వాగ్మూలం తీసుకున్నారు. తర్వాత రెండోసారి భరోసా సెంటర్‌లో కూడా అధికారులు బాధితురాలి వాగ్మూలం తీసుకున్నారు.



