ఇంకా వేగం పుంజుకోని కొనుగోళ్లు
రోజుల తరబడి కేంద్రాల వద్దే ఎదురుచూపులు
వరంగల్‌లో బారులు తీరిన అన్‌లోడింగ్, లోడింగ్ ట్రాక్టర్లు
ధాన్యం పారబోసి
యాదాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా..
ఇంకెన్ని రోజులంటూ లింగంపేట్‌లో రాస్తారోకో
అకాలవర్షంతో తడిసిన ధాన్యం..
రైతుల ఆవేదన
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ భువనగిరి కలెక్టరేట్/ నాగిరెడ్డిపేట్/లింగంపేట్/ చిన్న శంకరంపేట/కంది/ మదనాపురం
పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఎంత చెప్పినా క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. అనుకున్నంత వేగంగా కొనుగోళ్లు జరగడం లేదు. ధాన్యం, మక్కలను అమ్ముకునేందుకు రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూస్తున్నారు. కొనుగోళ్లు జరిగినా పంటను తరలించేందుకు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సహనం నశించి రైతులు ఆందోళనలకు దిగాల్సి వస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. ఒక్కో రైతు ఒక్క బస్తాకి రూ.82 నుండి రూ.100ల వరకు అదనపు భారాన్ని భరిస్తున్నారు. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన మక్కలను పంథిని గ్రామంలోని ఒక మిల్లును కిరాయి తీసుకొని దానిని గోదాముగా మార్చి అక్కడ అన్‌లోడ్ చేస్తున్నారు. శనివారం ఆ గోదాం మక్కల ట్రాక్టర్లతో కిటకిటలాడింది. గోదాం ఆవరణ మొత్తం ట్రాక్టర్లతో నిండిపోగా, వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వందలాది మక్కల ట్రాక్టర్లు క్యూలో ఉండాల్సి వచ్చింది. ట్రాక్టర్‌లను అన్‌లోడింగ్ చేసే విషయంలో ఎవరిది ముందు అన్‌లోడ్ చేయాలనే విషయంలో వాగ్వివాదానికి దిగారు.
యాదాద్రి కలెక్టరేట్ ముందు ధాన్యం పోసిన ఇంద్రపాలనగరం రైతులు
రాజకీయ కక్షపూరిత చర్యల కారణంగానే తాము పండించిన వడ్లను అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్ రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ గేటు ఎదుట ధాన్యం పారబోసి రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్ ముట్టడితో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్లు కలెక్టరేట్ ఎదుట కిందపోస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 45 రోజులుగా వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో ధాన్యం కేంద్రంలోపెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయాయన్నారు. వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల భయం కలవరపెడుతుంటే.. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించి, ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తూకంలో జాప్యం..
లారీలు ఆలస్యం..
‘ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులవుతోంది. అయినా తూకం వేయడం లేదు. తూకం పూర్తయితే లారీలు రావడం లేదు. మిల్లర్లు కడ్తాతో దోచుకుంటున్నారు. సమస్యలున్నా.. అధికారులకు పట్టదా..’? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. నెల రోజులుగా కుటుంబాలతో కల్లాల వద్దే కాపలా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో 7000 బస్తాల ధాన్యం సిద్ధంగా ఉన్నా.. లారీలు లేకపోవడంతో ఎండలో పేలాలుగా మారుతున్నాయని చెప్పారు. లింగంపేట్ మండలంలోని భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ గ్రామాలకు చెందిన రైతులు కొట్టాల్ సమీపంలోని ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 200కు పైబడి ధాన్యం రాశులు అలానే ఉన్నాయన్నారు.
మండుటెండలో పడిగాపులు
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో గల మెదక్-చేగుంట రహదారిపై శనివారం మధ్యాహ్నం మహిళా రైతులు ఆందోళనకు దిగారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించిన ధాన్యాన్ని 20 రోజుల నుంచి తూకం వేసిన బస్తాలు అలాగే ఉండటంతో మండుటెండలో అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళనకు దిగిన మహిళా రైతులు అధికారులను నిలదీశారు. ఈ ఆందోళనతో రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. గత వడు రోజుల నుంచి గన్ని బ్యాగుల కోసం పడికపులు కాస్తున్నామని, ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిమండల కేంద్రంలోని సొసైటీ గేట్ ముందు గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని రైతులు నిరసన చేపట్టారు. నర్సాపూర్‌లో రైతులు నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో మిల్లర్లపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తడిసిన వరిధాన్యం
వనపర్తిలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్ల రాశులు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి జిల్లాలోని వనపర్తి, గోపాల్పేట మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్ద య్యాయి. మదనాపురం మార్కెట్ యార్డుతో పాటు ఆయా గ్రామాలలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. అకాల వర్షాల కారణంగా ఆయా గ్రామాలలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పిడుగుపాటుకు కొల్లాపూర్ మండల పరిధిలోని ఎన్మానిమెట్ల గ్రామం శివారులోని వెలగొండ చిన్న వెంకటయ్య యాదవ్ కు చెందిన 30 గొర్రెలు పిడుగు పడి మరణించాయి. ధాన్యం తడిసిపోయిందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.



