నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయానికి చెందిన పదవ తరగతి విద్యార్థి బాలాజీ 600/581 మార్కులను సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలాజీ జిల్లా హైదరాబాదులోని ఐ ఫౌండేషన్ ప్రతిభా పురస్కారమునకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఏ. సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్, ప్రముఖ పద్యకవి డా. బి వెంకట్ లు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 19న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే ఐ ఫౌండేషన్ ప్రతిభా పురస్కార కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర మంత్రులచే బాలాజీ పురస్కారమును అందుకోనున్నాడని చెప్పారు.
బాలాజీ తల్లిదండ్రులు ఇందుబాయి- దత్తు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోసుపల్లి గ్రామస్థులు. వీరిది వ్యవసాయ కుటుంబం. బాలాజీ 4వ తరగతి వరకు వివేకానంద ఇంగ్లీష్ మోడల్ స్కూల్లో చదివారు. మండల, జిల్లాస్థాయిలో కబడ్డీ ఆడి, ఎన్నో ప్రశంసా పత్రాలను అందుకున్నారు. బహుమతులను కూడా స్వీకరించాడు. గురుకుల విద్యాలయంలో క్విజ్, వ్యాసరచన, గణితం వంటి పోటీలలో బహుమతులను అందుకున్నారని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. సంస్కృతం, తెలుగు, హిందీ, గణితం, జీవ, భౌతిక, సాంఘిక శాస్త్రాలలో మంచి ప్రతిభతో రాణించారు. ఉన్నత చదువుల్లో బాగా చదివి డాక్టరుగా కావాలన్నదే తన లక్ష్యమని బాలాజీ చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ఐ ఫౌండేషన్ ప్రతిభా పురస్కారమునకు ఎంపికైన బాలాజీని ప్రిన్సిపాల్ ఏ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డా బి.వెంకట్, రెగ్యూలర్ ఉపాధ్యాయులు – బి.సుమన్,జి.రాము,జే.గణేశ్, యస్,నరహరి, జూనియర్ అసిస్టెంట్ ఫ్రేం సింగ్ లు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.



