Monday, May 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వరంగ సంస్థల 
పరిరక్షణ కోసం ఉద్యమం

ప్రభుత్వరంగ సంస్థల 
పరిరక్షణ కోసం ఉద్యమం

- Advertisement -

కార్పొరేట్ల ప్రయోజనాలే మోడీ విధానాలు
హక్కులను హరించేందుకే నాలుగు లేబర్‌‌కోడ్‌‌లు
రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ అనే 
తేడా లేకుండా పోరాటాలు :సీఐటీయూ సదస్సులో 
ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెట్టుబడిదారులకు సేవ చేయటం తప్ప కార్మికుల, ప్రజల సంక్షేమం గురించిన ఆలోచనే లేదని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్ష‍ణ’ అనే అంశంపై ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్క రాములు అధ్యక్ష‍తన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్ తదితర సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధమైందన్నారు. ఎల్ఐసీలో కూడా ప్రయివేట్ పెట్టుబడులకు అనుమతించిందని గుర్తు చేశారు.

లాభాల్లో ఉన్న సింగరేణి బొగ్గు గనులను, విశాఖ స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరిస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఏ రంగానికీ ప్రయివేటీకరణ నుంచి మినహాయింపు ఇవ్వలేదన్నారు. మోడీ ప్రభుత్వం దేశీయ పరిశ్రమలు విస్తరించే విధానాలను అమలు జరపకపోగా ఉన్న వాటిని కూడా ప్రయివేటీకరణకు పూనుకుందని తెలిపారు. ఎరువుల తయారీ సంస్థలనూ వదిలిపెట్టడం లేదని చెప్పారు. మోడీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దేశ సంపద కొద్ది మంది వద్ద పోగుపడుతున్నదని చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించటమే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగాన్ని రక్ష‍ించుకునేందుకు రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ అనే తేడా లేకుండా ఐక్యపోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్ష‍ులు ఎస్‌ ‌వీరయ్య ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్ష‍ణకోసం ఐక్యంగా పోరాడుదామంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వ రంగం పుట్టింది చావడానికే..’అంటూ ప్రధాని మోడీ ఇటీవల కాలంలో మాట్లాడటం చూస్తే..ఆయన ఎవరి పక్ష‍మో స్పష్టంగానే అర్థమవుతున్నదని చెప్పారు. ప్రయివేటీకరణ, పెట్టుబడుల ఉపసంహారణ, మూసివేతలు లాంటి రకరకాల రూపాల్లో ప్రభుత్వరంగ సంస్థలను నీరుగార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు వీటి పరిరక్ష‍ణ కోసం, కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం అవకాశం లేకుండా కార్మికోద్యమానికి చేతులు కట్టేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అందులో భాగమే నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లని చెప్పారు. ప్రభుత్వ రంగం, ప్రయివేటు, సహకార రంగాలన్న తేడా లేకుండా, సంఘటిత, అసంఘటిత రంగమనే తేడా లేకుండా కార్మికుల హక్కులను హరించటమే ఆ లేబర్‌ ‌కోడ్‌‌ల లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ రంగ రక్ష‍ణ కోసం సమరశీల పోరాటాలకు శ్రీకారం చుట్టాలన్నారు. అందులో భాగంగా జిల్లాల వారిగా సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ తీర్మానాన్ని పాలడుగు భాస్కర్‌ ‌బలపర్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం, సామాజిక ప్రయోజనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం, కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వ్యూహాత్మక రంగాల్లో కూడా ప్రభుత్వరంగం నామమాత్రంగా ఉంటే చాలునని మోడీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఇప్పుడున్న సంస్థలన్నింటినీ సాధ్యమైనంత తొందరగా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రయివేటీకరించడం. టోకుగా అమ్మి వేయడం లేదా మూసివేయడానికి రంగం సిద్ధం చేసిందని చెప్పారు.

పెట్టుబడుల ఉపసంహరణ వేగంగా జరిగిపోతున్నదన్నారు. ఇందుకు కంపెనీ ఉన్నతాధికారులు సహకరించకపోతే, ఎండితో సహా తొలగిస్తామని కూడా బీజేపీ నాయకత్వంలోని యూనియన్ ప్రభుత్వం రాతపూర్వకంగా హెచ్చరించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో కార్మికులు, అధికారులు, కాంట్రాక్ట్, క్యాజువల్, ఫిక్స్డ్ టర్మ్ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మికులంతా కార్మిక సంఘాల అనుబంధాలకతీతంగా రాబోయే రోజుల్లో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నేతలు ఎన్‌ ‌జనార్దన్‌ ‌రెడ్డి, వీఎస్‌ ‌రావు, జె వెంకటేశ్‌, టి రాజారెడ్డి, కె ఈశ్వర్‌‌రావు, బి మధు, ఆర్‌ ‌సుధాభాస్కర్‌, భూపాల్‌, టి సత్తయ్య, కె గీత, జి సాంబశివరావు, కె వీరాంజనేయులు, ఎం స్వామి, పి మురళి, సౌందర్‌‌రాజన్‌, పాష తదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -