ఏఐ సామర్ధ్యాలులను పెంచుకోవడానికి వర్ధమాన దేశాలకు సాయం చేస్తాం : జిన్‌పింగ్
అమెరికా ప్రభావాన్ని సవాలు చేయడానికి చైనా సిద్ధం
షాంఘై : నూతన ప్రపంచ కృత్రిమ మేధకు చైనా ఛాంపియన్ అని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. షాంఘైలో శుక్రవారం జరిగిన ప్రపంచ ఏఐ కాన్ఫరెన్స్ (డబ్ల్యూఏఐసీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఓపెన్- సోర్స్ ఏఐ అరుదైన, చారిత్రక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలను కోరారు. ఏఐ సామర్ధ్యాలను పెంచుకోవడానికి వర్ధమాన దేశాలకు సాయం చేస్తామని తెలిపారు. ఈ టెక్నాలజీని పొందడంలో అసమానతల కారణంగా చారిత్రక అన్యాయాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. ఓపెన్ – సోర్స్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగాన్ని నియంత్రించే నిబంధనలపై అమెరికా ప్రభావాన్ని సవాలు చేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఈ సమావేశం అద్దం పట్టింది. ప్రపంచ ఏఐ నిర్వహణలో చైనా ఛాంపియన్‌గా నిలవాలని జిన్‌పింగ్ ఆకాంక్షిస్తున్నారు. ఆయన తన ఓపెన్ – సోర్స్ నమూనాలను ఓ ప్రపంచ ప్రజా ప్రయోజనంగా అభివర్ణించారు. సాంకేతిక నాయకత్వ పోరులో వాషింగ్టన్‌కు ప్రత్యామ్నాయంగా బీజింగ్‌ను నిలబెట్టారు. ఆవిరి యంత్రం, విద్యుత్ ఆవిష్కరణలతో ఏఐ ప్రాముఖ్యతను జిన్‌పింగ్ పోల్చారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను నియంత్రించే ప్రమాణాలను రూపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు నేతృత్వం వహిస్తూనే గ్లోబల్ సౌత్‌లోని దేశాలతో చైనా ఏఐ సాంకేతికత, నైపుణ్యాన్ని పంచుకుంటుందని జిన్‌పింగ్ చెప్పారు.



