Saturday, July 18, 2026
E-PAPER
Homeజాతీయం20వ‌ర‌కు బ‌తికే ఉంటా

20వ‌ర‌కు బ‌తికే ఉంటా

- Advertisement -

ఆ రోజునే పార్ల‌మెంట్ మార్చ్ చేపడదాం: పర్యావరణ కార్యకర్త సోన‌మ్ వాంగ్ చుక్‌
విషమిస్తోన్న ఆరోగ్యం 24 గంటల పర్యవేక్షణ
కేరళం మాజీ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌, ప్రముఖ క్రీడాకారిణి
మను భాకర్‌ స‌హా ప‌లువురి సంఘీభావం

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
​నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, సీబీఎస్‌ఈలో అవ‌క‌త‌వ‌క‌లకు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌కర్త‌ సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 20 రోజులు పూర్తి చేసుకుంది. దీక్ష‍తో ఆయన ఆరోగ్యం క్ష‍ీణిస్తోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన 24 గంటల పర్యవేక్ష‍ణలో ఉన్నారు. దీక్ష ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు వాంగ్‌చుక్ 9.5 కిలోల బరువు తగ్గారు. మరోపక్క జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళ‌న 27వ రోజుకు చేరుకుంది. అక్కడే నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు 20న పార్లమెంట్‌ మార్చ్ నిర్వహిస్తామని సీజేపీ చీఫ్‌, వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్‌ మాట్లాడుతూ ‘‘నేను ఈనెల 20 వరకు ఎలాగైనా బ్రతికి ఉంటా. మీ అందరితో కలిసి పార్లమెంటుకు కవాతు చేస్తా. ఒకవేళ జులై 20న మన కవాతు విజయవంతం కాకపోతే నేను దెయ్యంగా తిరిగి వస్తాను’’ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ సోనమ్ వాంగ్‌చుక్ తన హాస్య చతురతను కోల్పోలేదు. వాంగ్‌చుక్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. శుక్రవారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజ్జూ కృష్ణన్, అశోక్ ధావలే, కేంద్ర కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ , సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్ సంఘీభావం తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆందోళ‌న వేదికైన క్రాంతి కార్నర్ వ‌ద్ద విద్యార్థులు, యువ‌త‌ను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రశ్నాపత్రాల లీకేజ్‌ల‌పై స్పందించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

సోనమ్ వాంగ్‌చుక్‌కు కేరళం మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ సంఘీభావం తెలిపారు. ‘‘సోనమ్ వాంగ్‌చుక్ తన నిరవధిక నిరాహార దీక్షలో ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను. న్యాయం కోసం పోరాడుతున్న ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయే అంచున ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమూ ఉదాసీనంగా ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం తన మౌనాన్ని వీడి, అర్థవంతమైన చర్చలు జరపాలి. నీట్ పేపర్ లీక్ సంక్షోభం నేపథ్యంలో జాతీయ పరీక్షా విధానంలో సమగ్ర సంస్కరణలతో సహా జవాబుదారీతనం కోసం వస్తున్న న్యాయమైన డిమాండ్లకు స్పందించాలి. న్యాయం, జవాబుదారీతనం కోసం సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి అచంచలమైన సంఘీభావం తెలుపుతున్నాను’’ అని ఎక్స్‌లో పిన‌ర‌యి స్పందించారు. వాంగ్‌చుక్ దీక్ష‌, సీజేపీ ఆందోళ‌న‌కు ​ప్రముఖ క్రీడాకారిణి మను భాకర్ మద్దతు ఇచ్చారు. ప్రముఖ హాస్యనటుడు మహీప్ సింగ్, ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టి.ఎస్. సింగ్‌డియో, రాజ‌స్తాన్‌ మాజీ ఉప ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్‌ సోనమ్ వాంగ్‌చుక్ కు, నిరసనకారులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. హ‌ర్యానా మాజీ ఉప ముఖ్య‌మంత్రి దుష్యంత్ చౌతాలా, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే, కాంగ్రెస్ నేత సీనియ‌ర్ నేత ప‌వ‌న్ ఖేర్‌, ముంతాజ్ పటేల్, యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాజేంద్ర పాల్ గౌత‌మ్‌, యోగేంద్ర యాద‌వ్, ‘వంచిత బహుజన అఘాడి’ అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ సంఘీభావం తెలిపారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -