టుబా సిద్ధిఖీ… తన సహజసిద్ధమైన పర్సనల్ కేర్ బ్రాండ్ అయిన ‘సాయిల్ కాన్సెప్ట్’ ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నారు. లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ నుండి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసిన టుబా సిద్ధిఖీ ఇంట్లో ఒక చిన్న ఔషధ తోటను ప్రారంభించారు. దానికి ‘గార్డెన్ ఆఫ్ హెల్త్’ అని పేరు పెట్టారు. కలబందతో పాటు అనేక రకాల తులసి, మల్టీ-విటమిన్, ఇన్సులిన్ మొక్కలను పెంచారు. అయితే ఇదంతా ఆమె డబ్బు సంపాదించడం కోసం కాకుండా ప్రకృతి శరీరం కోసం ఏమి అందించగలదనే విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలతో వాటిని సంరక్షిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
తన ‘గార్డెన్ ఆఫ్ హెల్త్’ను నిర్వహిస్తున్న సమయంలో టుబా సహజసిద్ధమైన మొక్కలకు సంబంధించిన కార్యక్రమాల కోసం రాయ్‌పూర్‌కు ప్రయాణించారు. అలాగే లక్నోలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్‌తో కూడా అనుబంధం పెంచుకున్నారు. “నేను ఉత్పత్తి అభివృద్ధిపై అనేక శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యాను. నెమ్మదిగా పరిస్థితులు అనుకూలించాయి. అప్పుడు నేను ‘ఈ మొక్కల నుండి ఉత్పత్తు లను ఎందుకు తయారు చేయకూడదు?’ అని అనుకు న్నాను. వాటిని పెంచాలంటే చాలా శ్రద్ధ అవసరం, వాటిని నేను సద్వినియోగం చేయాలనుకున్నాను” అని ఆమె తెలిపారు.
భర్త సహకారం తోడై…
టుబా భర్త ఫైజ్ కూడా ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్నాడు. అతను నూనెలు, రసాయనాలలో ప్రత్యేకతతో కెమికల్ టెక్నాలజీని అభ్యసించారు. ఆ తర్వాత అతను శాస్త్రవేత్తగా, క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశారు. అతను టుబా ఆలోచనలను పంచుకున్నారు. “మేము రోజువారీ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని అనుకున్నాం. షాంపూ, సబ్బులు, లోషన్లు.. ఇలా ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే వస్తువులు తయారు చేయాలనుకున్నాం. ప్రతి ఉత్పత్తిని ఒక సహజ ప్రత్యామ్నాయంతో భర్తీ చేయాలనేది మా ఆలోచన” అని టుబా అన్నారు. పెండ్లి తర్వాత వారి కంపెనీ ప్రారంభమైంది. 2014లో వారు లక్నోలో అద్దెకు తీసుకున్న తయారీ కేంద్రంతో ‘మిట్టి సే’ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. ప్రారంభంలో నలుగురు సహ-వ్యవస్థాపకులు ఉన్నారు. వారు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి ధృవీకరణతో పాటు, FSSAI, ZED ధృవీకరణలను కూడా పొందారు. మెల్లమెల్లగా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ బ్రాండ్‌ను నిర్మించారు.
జూహీ ట్విట్ చేశారు
స్వయం సమృద్ధితో ప్రారంభించినప్పటికీ ‘మిట్టీ సే’ అనేక మైలురాళ్లను సాధించి, ఒక సుస్థిర సంస్థగా ఎదిగింది. దాని ఉత్పత్తులలో ఒకటి హార్పర్స్ బజార్ కాన్షియస్ బ్యూటీ అవార్డును గెలుచుకుంది. నటి జూహీ చావ్లా అమెజాన్ ద్వారా దాని తొలి వినియోగదారులలో ఒకరు. “జూహీ తర్వాత మాతో కనెక్ట్ అయ్యి, మా బ్రాండ్ గురించి ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం కోసం భారతదేశవ్యాప్తంగా ఉన్న టాప్ 75 కంపెనీలలో మేము కూడా ఎంపికయ్యాము. యూనిక్లో తమ లక్నో స్టోర్‌ను ప్రారంభించినప్పుడు మేము వారితో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నాం” అని టుబా చెప్పారు.
మరింత దృష్టి కేంద్రీకరించాలి
‘మిట్టీ సే’ ఇప్పుడు సాయిల్ కాన్సెప్ట్‌గా రీబ్రాండ్ చేయబడింది. లక్నోకు చెందిన ఈ పర్సనల్ కేర్ బ్రాండ్ భారతదేశంలోని 60 నుండి 70 ప్రీమియం ఆర్గానిక్ స్టోర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో 25కు పైగా SKUలను విక్రయిస్తోంది. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో పాల్గొనడం కూడా వారికి ఎన్నో విషయాలను నేర్పింది. “మేము చర్మ సంరక్షణ, క్లీనర్‌ల వంటి వివిధ రకాల ఉత్పత్తులలో చాలా ఎక్కువగా విస్తరించామని, షార్క్‌లతో సహా మా మార్గదర్శకుల నుండి మాకు మంచి సలహా లభించింది. మేము మరింత దృష్టి కేంద్రీకరించాలని వారు సూచించారు” అని ఆమె అంటున్నారు. కాలక్రమేణా మిగిలిన ఇద్దరు వ్యవస్థాపకులు వైదొలగడం, ట్రేడ్‌మార్క్‌తో సమస్యలు తలెత్తడంతో, జనవరి 2023లో టూబా, ఫైజ్ ఒక్కోదానికి ఒక్కో విభిన్న బ్రాండ్ గుర్తింపుతో ‘సాయిల్ కాన్సెప్ట్’, ‘అహింసా కేర్’ అనే రెండు కంపెనీలను ప్రారంభించారు.
నెమ్మదిగా, స్థిరంగా ఎదగుతాం
సాయిల్ కాన్సెప్ట్… హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఎసెన్షియల్ ఆయిల్స్, వెల్నెస్ ఉత్పత్తులను అందిస్తుండగా.. అహింసా కేర్… క్లీనింగ్ ఉత్పత్తులపై దృష్టి పెడుతుంది. సహజమైన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో నిండిన మార్కెట్‌లో టుబా తన ప్రత్యేకత గురించి జాగ్రత్తగా మాట్లాడతారు. “మా ప్రత్యేకత నిజాయితీ, పారదర్శకత. మేము ఉపయోగించే ప్రతి పదార్ధాన్ని బహిరంగంగా, స్పష్టంగా జాబితా చేస్తాం. ప్రకటనలు దూకుడుగా ఇవ్వము. మాకు 15,000 మందికి పైగా ప్రత్యక్ష కస్టమర్లు ఉన్నారు, వారితో మేము సన్నిహితంగా పనిచేస్తాం. మా బ్రాండ్‌ల కోసం మాకు ప్రైవేట్-లేబుల్ తయారీ కూడా ఉంది. నెమ్మదిగా, స్థిరంగా ఎదగడమే మా విధానం,” అని టుబా వివరిస్తారు.
అత్యధిక అమ్మకాలు
సాయిల్ కాన్సెప్ట్ ఉత్పత్తులు భారతదేశవ్యాప్తంగా.. ప్రధానంగా చండీగఢ్, జైపూర్, ముంబై, పూణే, గోవాలోని 60–70 స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లోని ప్రకృతివనంలో కూడా ఉన్నాయి. ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో, కంపెనీ సొంత వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.400 నుండి రూ.1,200 మధ్య ఉంటుంది. సాయిల్ కాన్సెప్ట్ కు సంబంధించిన ఉత్పత్తుల్లో హెయిర్‌కేర్ షాంపూ, హెయిర్ ఆయిల్ అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. “మేము ఇటీవల బ్లూ పీ ఫ్లవర్ టీని ప్రారంభించాం. ఇది మానసిక ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది” అని టుబా చెప్పారు.
మూడు కీలక ఛానెళ్లు
ఈ బ్రాండ్ మూడు కీలక ఛానెళ్ల ద్వారా పనిచేస్తుంది. మొదటిది దాని B2B విభాగంలో హైదరాబాద్, ముంబైలలోని ప్రీమియం అవుట్‌లెట్‌లకు సేవలు అందించే ఆఫ్‌లైన్ రిటైల్, పంపిణీ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. రెండవది దీని D2C ఛానెల్ సోషల్ మీడియా, దాని సొంత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులతో నేరుగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. మూడవది కస్టమర్ గిఫ్టింగ్ కార్యక్రమాల కోసం దీనికి తనిష్క్ జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్‌తో కార్పొరేట్ గిఫ్టింగ్ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇవి ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. ప్రస్తుతం సాయిల్ కాన్సెప్ట్ బృందంలో ఉన్న 10 మందిలో ఏడుగురు మహిళలు.
మహిళలు ఎదిగేలా…
“ఒక మహిళగా ఇంటిని, ఉద్యోగాన్ని రెండింటినీ మేమే ఎంతగా నిర్వహించాల్సి ఉంటుందో నాకు తెలుసు. ఒకదాని కోసం మరొకదాన్ని వదులుకోకుండా, ఇతర మహిళలు సంపాదించి, ఎదగగలిగే వాతావరణాన్ని నేను సృష్టించాలనుకున్నాను. ఉత్పత్తి, ముడి పదార్థాల సేకరణ, ప్యాకేజింగ్, అకౌంట్స్, కస్టమర్లతో నేరుగా చేసే అమ్మకాలకు ఉన్నత స్థాయి విద్యాభ్యాసం అవసరం లేదు. 12వ తరగతి లేదా ప్రాథమిక డిగ్రీ పూర్తి చేసిన మహిళ కూడా వచ్చి జీవనోపాధిని నిర్మించుకోవచ్చు. మా బృందంలోని చాలా మంది మహిళలు ఎనిమిదేండ్లుగా కంపెనీతోనే ఉన్నారు. వారు తమ కుటుంబాలను చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు” అని టుబా అంటున్నారు.
ఈ బ్రాండ్ నిధులను సమీకరిస్తోంది
బ్రాండ్ పొజిషనింగ్ అతిపెద్ద సవాలుగా ఉందని ఆమె చెప్పారు. “మాకు పెద్దగా నిధులు లేనందున, అందరి దృష్టిని ఆకర్షించడం కష్టం. ప్రతి ఒక్కరూ సహజమైనవి, ఆర్గానిక్ అని మాట్లాడుతున్నారు. పెద్ద మార్కెటింగ్ బడ్జెట్ లేకుండా ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించడం చాలా కష్టం. ప్రజలకు మా గురించి తెలిసే వరకు, ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఒకసారి తెలిశాక వారు మాతోనే ఉంటారు. మేము ప్రీమియం పర్సనల్ కేర్ విభాగంలో ‘సాయిల్ కాన్సెప్ట్’ను అందుబాటు ధరలో లభించే ఒక విలాసవంతమైన బ్రాండ్‌గా నిలబెడుతున్నాం. ఫార్ములేషన్లలో ఉపయోగించే మూలికల గురించి వినియోగదారులు తెలుసుకోవడానికి, వాటి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఇంకా తమ సొంత ఉత్పత్తులను తమకు నచ్చినట్లుగా మార్చుకుని తయారు చేసుకోవడానికి వీలు కల్పించే ‘ఎక్స్పీరియన్స్ స్టోర్స్’ వంటి ప్రదేశాలను పరిశీలిస్తున్నాం” అని ఆమె అన్నారు.



