Wednesday, September 16, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మహిళల పాత్ర మహోజ్వలం

మహిళల పాత్ర మహోజ్వలం

- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాటం… భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో 1946 నుండి 1951 వరకు సాగించిన వీరోచిత పోరాటం ఇది. జమిందార్లు, భూస్వాములు, రజాకార్లు, నెహ్రూ సైన్యంపై ఈ పోరాటం నడిచింది. అప్పటి వరకు ‘నీ బాంచన్‌ ‌దొరా’ అంటూ తలలు వంచి బతికిన పేద ప్రజలు ‘దోపిడీ దౌర్జన్యాలు ఇక చెల్లవంటూ’ ఎదిరించి నిలిచారు. జమిందారుల పొలాల్లో వెట్టిచాకిరి చేసిన చేతులే కొడవళ్ళెత్తాయి. ప్రజల రక్తంతో నిర్మించుకున్న భూస్వాముల గడీల పునాదులు కదలడం ప్రారంభించాయి. అలాంటి మహత్తర తెలంగాణ సాయుధ పోరులో మహిళల పాత్ర మహోజ్వలమైనది, చరిత్రాత్మకమైనది. పురుషులతో సమానంగా తుపాకులు పట్టి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు. ఆ ధీరలు నిర్వహించిన పాత్ర.. వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలు.. వారి త్యాగ నిరతి గురించి నేటి మానవిలో…

తెలంగాణ ప్రాంతంలో ఆనాడున్న భూస్వామ్య ‌వ్యవస్థకు అనుగుణంగానే మహిళల పరిస్థితి ఉంది. భూస్వామ్య, ధనిక వర్గాల కుటుంబాలలోని స్త్రీలు తమ గడిల నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా కచ్చడపు బండ్లకు చుట్టూ పరదాలు కట్టుకొని మాత్రమే బయటకు వచ్చేవారు. వారి కుటుంబ సభ్యులకు తప్పితే ఇతరులకు కనిపించేవారు కాదు, మాట్లాడేవారు కాదు. వీరిలో అక్షరాస్యత చాలా తక్కువ. టీచర్లను ఇండ్లకు పిలిపించి ఉత్తరాలు చదువుకునే మేరకు మాత్రమే ఆడపిల్లలను చదివించేవారు.

​దొరలకు బానిసలుగా…
నిరుపేద కుటుంబాల్లో అయితే ఆకలిని చంపుకోలేక కన్న ప్రేమను చంపుకొని ఆడపిల్లలను అమ్ము కొనేవారు. ఇలా బానిసగా మారిన మహిళే కమలమ్మ. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న వరంగల్‌‌కు చెందిన ఈ కమలమ్మ బానిస కుటుంబం నుండి వచ్చింది. ఈమె తల్లి కట్టుబానిసగా కొంతమంది దొరల ఇండ్లలో పని చేసింది. కమలమ్మ అమ్మను ఆమె తల్లి కరువు వచ్చి ఇంట్లో గడవని పరిస్థితులలో రెండున్నర కిలోల బియ్యం, ఒక్క రూపాయికి ఒక బ్రాహ్మణ కుటుంబానికి అమ్మిందట. కమలమ్మ అమ్మ దగ్గరనుండి మొదలై మూడు తరాల వరకు దొరల ఇండ్లలో కట్టు బానిసలుగా ఉంటూ వచ్చారు. వీరికి వివాహాలు ఉండేవి కావు నచ్చితే దొరలే వీరిని చేరదీసేవారు. భూస్వాములకు నచ్చి వారికంట్లో పడిన ఏ స్త్రీనీ వదిలేవారు కాదు. వారు ఊర్లోకి వచ్చారంటే అందరూ తలుపులు వేసుకునేవారు. స్త్రీలకు మంచి బట్టలు కట్టు కోవడానికి గానీ, పూలు పెట్టుకోవడానికి గానీ ధైర్యం చాలేది కాదు. వీరు భయపడటనికి కారణం భూస్వాముల ప్రవర్తన పరమ కర్కోటంగా ఉండటమే. వారిని కాదని తిరస్కరించి బతికి బట్టకట్టినవారు లేరు. ఆనాడు మహిళల పరిస్థితి ఇంత దారణంగా ఉండేది. ఆ అరాచకాలను భరించలేక ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

​స్ర్తీ స్వేచ్ఛకై…
అనాడు భర్తలు, అన్నల ప్రభావంతోనే ఎక్కువ మంది మహిళలు సాయుధ పోరాటంలోకి వచ్చారని చెప్పుకోవచ్చు. వారికి వచ్చిన సాధారణ చదువులతో కమ్యూనిస్టు పార్టీలో చేరిన మహిళలు మార్స్కిస్టు ‌సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. వారే ఆ తర్వాత కాలంలో సామాన్య మహిళల్లోనూ చైతన్యాన్ని నింపి ఉద్యమంలోకి సమీకరించారు. ఆరోజుల్లో అమ్మాయిలకు చిన్న వయసులోనే బలవంతంగా పెండ్లి చేసేవారు. ఆంధ్ర మహాసభ బలవంతపు వివాహాలు చేయరాదని తీర్మానించింది. అంతే కాదు ఫ్యూడల్‌ ‌సాంప్రదాయాలకూ, ఆచారాలకూ భిన్నంగా స్త్రీలు స్వేచ్ఛగా తమకు నచ్చిన వారిని పెండ్లి చేసుకోవడాన్ని కమ్యూనిస్టు పార్టీ సమర్థించింది, ప్రోత్సహించింది. బలవంతపు వివాహాలను వ్యతిరేకించింది. ఇలా తమ సమస్యలపై పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ పట్ల మహిళల్లో ఆదరణ పెరిగింది. అంతేకాదు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో వెట్టికి వ్యతిరేకంగా, అక్రమ లేవీ, ధాన్యం వసూళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు ఎదురు తిరగడం మొదలు పెట్టారు. గ్రామ కమిటీలు స్థాపించుకున్నారు. భూస్వాములు అక్రమంగా కాజేసిన బంజర భూముల కోసం పోరాటాలు నడిచాయి. ఆ విధంగా వెట్టికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం 1946 నాటికి సాయుధ రూపం తీసుకుంది.

​మహిళలతో దళాలు
సాయుధ పోరాట సమయంలో మహిళల రక్షణ విషయంలోనూ కమ్యూనిస్టు పార్టీ బాగా ఆలోచించింది. దొరల నుండి తమని తాము కాపాడుకునేందుకు అవసరమైన తర్ఫీదునిచ్చింది. గ్రామ సంఘాల్లో వాలంటీర్లలో స్త్రీలను చేర్చుకుని నాయకత్వంలో భాగస్వాములను చేసింది. గ్రామ సంఘాల్లో ఒకరో ఇద్దరో మహిళలు కచ్చితంగా ఉండేట్టు ఏర్పాటు చేశారు. అయితే ఆ వాలంటీర్‌ ‌దళాల్లో మహిళలను చేర్చుకోడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. యువకులే ఎక్కువమంది ఉండడంతో యువతీ యువకులు కలిసి ఒకే వాలంటీర్‌ ‌దళంలో పనిచేయడం ఆనాటి పరిస్థితులల్లో సాధ్యం కాలేదు. దాంతో ప్రత్యేకంగా మహిళలతో దళాల నిర్మాణం చేశారు. ఇది కొన్ని చోట్ల సాధ్యం అయినా కొన్ని చోట్ల సాధ్యం కాలేదు. ఏది ఏమైనా అవకాశం ఉన్న ప్రతీ చోట మహిళలతో ప్రత్యేక దళాలు ఏర్పాటు చేశాను. ఆనాటికీ పార్టీలో ఐదారుగురు మహిళా కార్యకర్తలు వుండే వారు. వారంతా మహిళలను ఆర్గనైజ్‌ చేయడంలో శ్రద్ధ తీసుకునే వారు.

చిట్యాల అయిలమ్మ
తెలంగాణ సాయుధ పోరాటం అనంగానే ప్రతి ఒక్కరికీ చిట్యాల అయిలమ్మ గుర్తుకు వస్తుంది. భూస్వాముల ఎదుట నిలబడటమే గగనమైన ఆరోజుల్లో తన కుటుంబాన్ని లొంగదీసుకోవటానికి, భూమిని కాజేయడానికి భూస్వాములు ప్రయత్నించినప్పుడు ఎదురు తిరిగిన మొట్టమొదటి మహిళ అయిలమ్మ. భర్త, కొడుకు, అల్లుడు అందరినీ జైల్లో బంధించినా కుంగిపోలేదు, వెనకడుగు వేయలేదు, భూస్వాములకు లొంగలేదు. పాలకుర్తి గ్రామంలో అయిలమ్మ ఇల్లే కమ్యూనిస్టు పార్టీకి కేంద్రంగా ఉండేది.

మహిళల తెగువ
ఆనాడు గెరిల్లా దళాలలో అనేక మంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు. వీరిలో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల, అచ్చమాంబ, సాలమ్మ, కమల (వరంగల్‌) వంటి వారు ఎందరో ఉన్నారు. ‌నిర్బంధం తీవ్రంగా వున్న పరిస్థితుల్లో దళాల్లో ఉన్న స్త్రీలు ప్రసవించినవుడు చంటి పిల్లల ఉనికి దళాలమనుగడకే ప్రశ్నార్ధకంగా తయారయ్యేది. అలాంటి సందర్భాలల్లో తమ పిల్లల కంటే ఉద్యమ రక్షణ, దళాలకు రక్షణే ప్రధానంగా భావించి పసికందులను పోలీస్‌ ‌క్యాంపుల ముందు వదిలేసేవారు. మరికొందరు ఇతరులకు పెంచుకోవటానికి ఇచ్చేవారు. ఈ విషయంలో కమలమ్మ, పద్మ ప్రదర్శించిన త్యాగనిరతీ, మనో నిబ్బిరం, ఆత్మస్థైర్యం మరువలేనిది. అలాగే ఉద్యమకారులకు రజాకార్ల కదలికలను ఎప్పటికప్పుడు రహస్యంగా చేరవేశారు. అజ్ఞాతంలో ఉన్న విప్లవ యోధులకు తమ ఇళ్లలో రహస్యంగా ఆశ్రయం కల్పించి, భోజన వసతులు సమకూర్చారు. ఆ సమయంలో పోలీసుల చేతికి చిక్కితే ఇక వారి కష్టాలు మాటల్లో చెప్పనలివి కావు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -