Wednesday, May 20, 2026
E-PAPER
Homeజాతీయంఅమెరికాతో భారత్ డీల్

అమెరికాతో భారత్ డీల్

- Advertisement -

అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 హోవిట్జర్లు
ప్రతిపాదనలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ : అమెరికా ఆయుధాల కోనుగోలుతో భారత్‌ ముందు సాగిలపడుతోం దనటానికి తాజా డీలే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికే అమ్ములపొదిలో ఉన్న అపాచీ హెలికాప్టర్లు, హోవిట్జర్ ఫిరంగులకు నిర్వహణ, మద్దతుపరమైన సర్వీసులను అందించే ప్రతిపాదనలకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. భారత్‌కు రూ.1,909 కోట్లు (198.2 మిలియన్ డాలర్లు) విలువైన అపాచీ హెలికాప్టర్ల పరికరాలు, సపోర్ట్ సర్వీసులను అందిస్తామని వెల్లడించింది. ఎం777ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగుల నిర్వహణకు మద్దతును అందించే ప్రతిపాదనకూ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అంచనా వ్యయం దాదాపు రూ.2,217 కోట్లు (230 మిలియన్ డాలర్లు). భారత్‌ వద్దనున్న అపాచీ హెలికాప్టర్ల సర్వీసింగ్‌కు బోయింగ్ కంపెనీ, లాక్‌హీడ్ మార్టిన్, హోవిట్జర్ ఫిరంగుల సర్వీసింగ్‌కు యూకేలోని క్యుంబ్రియాకు చెందిన బీఏఈ సిస్టమ్స్ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

భారత్ మా ప్రధాన రక్షణ భాగస్వామి
‘అపాచీ హెలికాప్టర్ల (ఏహెచ్ -64ఈ) ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సాంకేతిక డేటా, ప్రచురణలు, సిబ్బంది శిక్షణ, సహాయక సేవలను తమకు అందించాలని భారత్ కోరింది. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం, కాంట్రాక్టర్ల సహాయాన్ని అభ్యర్థించింది. దీంతోపాటు ఎం777ఏ2 అల్ట్రా లైట్ హోవిట్జర్ ఫిరంగుల దీర్ఘకాలిక నిర్వహణలోనూ సహాయాన్ని అందించాలని భారత్ విన్నవించింది. ఆ ఫిరంగుల అనుబంధ వస్తువులు, విడి భాగాలు, మరమ్మతు, శిక్షణ, సాంకేతిక సహాయం, లాజిస్టిక్స్ విభాగాల్లో సహకరించాలని భారత్ కోరింది. ఈ ప్రతిపాదనలకు మేం ఆమోదం తెలిపాం. అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సహకారాన్ని అందిస్తున్నాం. మేం భారత్‌ను ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక పురోగతికి దోహదపడే ప్రధాన రక్షణ భాగస్వామిగా భావిస్తున్నాం. దాని భద్రతను మెరుగుపర్చేందుకే ఈ సాయం చేస్తున్నాం. దీనివల్ల భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేలా భారత్ సామర్థ్యం ఇనుమడిస్తుంది. ప్రాంతీయ ముప్పులకు అడ్డుకట్ట పడుతుంది. భారత్‌కు ఈ సహాయక సేవలను అందిస్తున్న ఫలితంగా అమెరికా రక్షణ సంసిద్ధతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు’ అని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

భారత్ వద్ద ఎన్ని అపాచీలు ఉన్నాయి?
భారత రక్షణ దళాల వద్ద మొత్తం 28 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో 22 హెలికాప్టర్లు వాయుసేన వద్ద, 6 హెలికాప్టర్లు ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ వద్ద ఉన్నాయి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో వేర్వేరు సమయాల్లో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఒక్కో హెలికాప్టర్ ధర మారుతూ వచ్చింది. తొలి 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015లో భారత్ – అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అవన్నీ 2020 నాటికే డెలివరీ అయ్యాయి. వీటన్నింటిని వాయుసేనకే అందించారు. ఇక 2025 జులైలో 3 అపాచీ హెలికాప్టర్లు, 2025 డిసెంబరులో మరో 3 హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేసింది. వీటిని ఆర్మీకి అందజేసింది.


అపాచీల ధర ఎంత ?
22 అపాచీ హెలికాప్టర్ల కోసం 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం, భారత వాయుసేనకు ఒక్కో హెలికాప్టర్ సగటున రూ.678 కోట్లు పడింది. 2025 సంవత్సరం నాటికి ఈ హెలికాప్టర్ల రేట్లు గణనీయంగా పెరిగాయి. ఆ ఏడాది భారత్‌కు అమెరికా డెలివరీ చేసిన 6 అపాచీ హెలికాప్టర్ల మొత్తం విలువ దాదాపు రూ.4,168 కోట్లు (930 మిలియన్ డాలర్లు). అంటే ఒక్కో హెలికాప్టర్ ధర దాదాపు రూ.860 కోట్ల నుంచి రూ.948.5 కోట్లు ఉంటుంది. ఈ ఒప్పందంలో హెలికాప్టర్లే కాకుండా వాటి విడిభాగాలు, అత్యాధునిక లాంగ్‌బో రాడార్‌లు, హెల్‌ఫైర్ క్షిపణులు, ఆయుధ సామగ్రి, పైలట్ల శిక్షణ కూడా కలిసి ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -