పోరాట స్ఫూర్తితో ఆందోళన ప్రదేశం తిరిగి స్వాధీనం
కేంద్ర మంత్రి రాజీనామాపై సీజేపీ స్పష్టం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు పోరాటానికి వెనుకడుగు వేసేదేలేదని సీజేపీ స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వ అణచివేత చర్యలను పోరాట స్ఫూర్తితో అధిగమించి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన ప్రదేశాన్ని నేతలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ మార్చ్ అనంతరం పోలీసులు, కేంద్ర బలగాలు కూల్చివేసి, సీల్ చేసిన ఎస్ఎఫ్ఐ క్రాంతి కార్నర్‌తో సహా నిరసన టెంట్లను మంగళవారం గంటల వ్యవధిలోనే పునరుద్ధరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ చేపట్టిన ఆందోళన నుంచి వెనుకడుగు వేయబోమని సీజేపీ నేతలు ప్రకటించారు.20న చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులను పోలీసులు, కేంద్ర బలగాలు దారుణంగా కొట్టాయి. గాయపడిన వారికి ఢిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తలకు గాయమైన 20 ఏండ్ల విద్యార్థి ఆర్ఎంఎల్ ఆస్పత్రి ఐసీయూలో ఉన్నారు. గాయపడిన వారిని పరామర్శించడానికి సీజేపీ, విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అనుమతించడం లేదు. చికిత్స పొందుతున్న వారిపై, పరామర్శించడానికి వచ్చేవారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. కొందరు గాయాలను సైతం లెక్కచేయకుండా జంతర్ మంతర్ వద్దే ఉండిపోయారు.
సుమారు 70 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రాజధానిలో దాదాపు 3,000 మందికి పైగా సాయుధ భద్రతా సిబ్బందిని కేంద్రం మోహరించింది. పోలీసుల అదుపులో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను 25వ రోజుకు కొనసాగించారు. ఆయన డిమాండ్లను అంగీకరించే వరకు వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన 32 రోజు మంగళవారం కొనసాగింది.మంగళవారం జంతర్ మంతర్ వద్ద పెరుగుతున్న నిరసనకారులలో పాటు ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన ఒక నీట్ అభ్యర్థి బంధువులు కూడా ఉన్నారు. వారు ఈ ఏడాది మొదటి పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు కాపీని పట్టుకుని కనిపించారు. సోమవారం నిరసనకారులపై లాఠీ చార్జ్ చేయడమే కాకుండా 10 ఏండ్ల బాలుడిని సైతం కొట్టడంతో పలువురు ఆందోళన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పిల్లలు అని కూడా చూడకుండా దౌర్జన్యం చేయడమేంటంటూ పోలీసుల తీరును పలువురు తీవ్రంగా తప్పుడుతున్నారు. పోలీసులు కొడుతుంటే సదరు బాలుడు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వామపక్ష ఎంపీల మద్దతు
అణచివేత, పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఒంటరిగా లేరని ప్రకటిస్తూ, వామపక్ష ఎంపీలు, నాయకులు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ నాయకుల రాక ఒక బలమైన హెచ్చరిక అయింది. రక్తసిక్తమైన ఈ నిరసనలో ప్రతిపక్ష నాయకులు వారి బలాన్ని పూర్తిస్థాయిలో కూడగట్టడంతో ఢిల్లీలో నిరసన తీవ్రరూపం దాల్చింది. సీపీఐ(ఎం) ఎంపిలు అమ్రారామ్, కె. రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, ఎఎ రహీమ్, ఎస్ వెంకటేశన్, ఆర్. సచ్చిదానందం, సీపీఐ ఎంపీలు పి. సంతోష్ కుమార్, పీపీ సునీర్, కె సుబ్బరాయన్, కేరళ కాంగ్రెస్ (ఎం) ఎంపీ జోస్ కె మణి జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను, గాయపడిన విద్యార్థులను ఎంపీలు కలుసుకున్నారు. పోలీసుల చర్యపై పార్లమెంటులో అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థులు, యువతపై జరిగిన భయానక దాడులు, అరాచకాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షానే బాధ్యులని స్పష్టం చేశారు. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని, అసహనాన్ని కేంద్ర ప్రభుత్వ అణచివేత చర్యలు అడ్డుకోలేవని స్పష్టం చేశారు. నిరసనకారులను కలవకుండా పోలీసులు సీపీఐ(ఎం) నాయకులను అడ్డుకున్నారు. వారిని ఆపే క్రమంలో కె. రాధాకృష్ణన్ చేతికి స్వల్ప గాయమైంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన ఎంపీలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్ కూడా జంతర్ మంతర్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు.
మేదాంతకు వాంగ్‌చుక్ తరలింపు
ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను మంగళవారం సాయంత్రం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంతకు తరలించారు.
ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తాం
నిర్బంధంలో ఉన్నవారిని న్యాయవాదులు కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే, ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వెలుపల రాత్రి 8 గంటలకు శాంతియుత ధర్నా చేపడతామని సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, దీపక్ బలియాన్, సౌరవ్ దాస్ ప్రకటించారు. ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే అదుపులోకి తీసుకున్న వారిందరిని పోలీసులు విడుదల చేశారు.
ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు
ఢిల్లీ పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీసులు, భద్రతా దళాలపై
దాడులు, పోలీసు, ప్రభుత్వ వాహనాల ధ్వంసం, ప్రజా ఆస్తుల ధ్వంసం వంటి నేరాలపై ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘటనల్లో మొత్తం 118 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇందులో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు 70 మందికిపైగా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌తోపాటు ఇతర పోలీస్ స్టేషన్లలో ఈ ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేయడం, హింసకు కుట్ర పన్నడం,
సిబ్బందిపై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి వాటిపై కూడా కేసు నమోదు చేశారు.
విద్యార్థులను పరామర్శించిన నేతలు
పార్లమెంట్ మార్చ్‌లో పోలీసులు,
కేంద్ర బలగాల క్రూరత్వ చర్యలతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులు, యువతను వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పరామర్శించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పరామర్శించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా పరామర్శించారు.



