Wednesday, July 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులోక్‌‌భవన్‌ ‌ముట్టడి ఉద్రిక్తం

లోక్‌‌భవన్‌ ‌ముట్టడి ఉద్రిక్తం

- Advertisement -

వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన
‘పార్లమెంట్‌ ‌మార్చ్‌’ లో విద్యార్థులు, యువతపై దాడికి నిరసన
అడ్డుకున్న పోలీసులు .. రోడ్డుపైనే బైటాయించిన విద్యార్థులు
ఈడ్చుకెళ్లిన బలగాలు .. అసిఫ్‌‌నగర్‌ ‌పీఎస్‌‌కు తరలింపు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పార్లమెంట్‌ ‌మార్చ్‌’ సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేసి బాష్పవాయువును ప్రయోగించడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌‌లో వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన లోక్‌‌భవన్‌ ‌ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఖైరతాబాద్‌ ‌సిగ్నల్‌ ‌నుంచి విద్యార్థి నేతలు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైటాయించారు. ఈ క్రమంలో విద్యార్థి నేతలను అరెస్టు చేస్తుండగా తోపులాట జరిగింది. వారిని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. దీంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని అసిఫ్‌‌నగర్‌ ‌పీఎస్‌‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై పోలీసులు విద్యార్థి నేతలను విడుదల చేశారు. అంతకుముందు ముట్టడినుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ‌పీడీఎస్‌‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్, ఏఐఎఫ్‌‌డీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. నీట్‌ ‌పేపర్‌ లీకేజీపై ‌సోనమ్‌ వాంగ్‌‌చుక్‌ ‌చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ సంఘీభావాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులు, యువతపై లాఠీ‌చార్జీ, బాష్పవాయువును ప్రయోగించటాన్ని ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. దేశభక్తి అంటే విద్యార్థుల, యువత రక్తం చూడటమేనా..? అని ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలపై దమనకాండను వెంటనే నిలిపేయాలని డిమాండ్‌ ‌చేశారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటీష్ పాలనను తలపించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతపై నిర్బంధ చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థి, యువతపై జరిగిన దాడులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను క్యాబినెట్‌ ‌నుంచి తప్పించాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ విద్యా విధానం–2020 పేరుతో విద్యారంగాన్ని ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ దిశగా నడిపిస్తున్న తీరును ఎండగట్టారు. దాని ఫలితంగానే పరీక్షల నిర్వహణ గాడితప్పిందనీ, వరుస పేపర్‌ లీకులతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లోక్‌‌భవన్‌‌ ముట్టడికి పిలుపునిస్తే విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే అవుతుందని తెలిపారు.

విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం ద్వారా విద్యా సంక్షోభాన్ని దాచిపెట్టలేరని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ, ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమాలకు ప్రజాస్వామికవాదులు, మేధావులు, యువత, ప్రజలు విస్తృత మద్దతును అందించాలని పిలుపునిచ్చారు. ఈ ముట్టడిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్‌‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎఫ్‌‌డీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళీ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, హైదరాబాద్ జిల్లా నాయకులు ప్రవీణ్, అర్జున్, భరత్, నరేందర్, నర్సింహారెడ్డి, లిఖిత్, చరణ్, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు జోసఫ్, హరి, ఏఐఎఫ్‌‌డీఎస్‌ రాష్ట్ర నాయకు‌లు టి.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -