పశ్చిమాసియాలో ఉధృతమైన పోరు
చమురు నౌకలపై టెహ్రాన్ దాడులు
పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ నగరాలు
సౌదీకి షాక్ ఇచ్చిన హౌతీలు
మూతపడిన బాబ్ అల్ – మందెబ్ జలసంధి
మరింత తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం
నవ తెలంగాణ – జనరల్ డెస్క్
పశ్చిమాసియాలో వరుసగా పదో రోజు రాత్రి కూడా దాడులు కొనసాగాయి. దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లిపోతున్న పశ్చిమాసియాలో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం పొంచి ఉంది. హార్ముజ్ జలసంధిలో మరో రెండు వాణిజ్య నౌకలపై మంగళవారం ఇరాన్ దాడి చేసింది. దీంతో ఆ నౌకలలోని సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా నౌకలను హౌతీలు దిగ్బంధించారు. ఎర్ర సముద్రానికి దక్షిణం వైపు ఉన్న బాబ్ అల్`మందబ్ జలసంధిలో సౌదీ నౌకలకు ప్రవేశం లేదని హౌతీల ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంగా యెమన్‌ను అన్యాయంగా సౌదీ దిగ్బంధించిందని, అందుకే ఈ చర్యకు పూనుకున్నామని చెప్పారు. హౌతీల చర్యపై సౌదీ అరేబియా స్పందిస్తూ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా తమ నౌకల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. హౌతీల కుట్రను భగ్నం చేసేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉన్నదని యెమన్ ప్రకటించింది. హౌతీల తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో పోరు మరో మలుపు తిరిగింది.
దాడులు… ప్రతి దాడులు
అమెరికా సేనలు వరుసగా పదో రోజు రాత్రి కూడా దాడి చేసినప్పటికీ హార్ముజ్‌పై ఇరాన్ తన పట్టును ఏ మాత్రం సడలించలేదు. జలసంధిలోని ఓమన్ తీరంలో ఓ చమురు ట్యాంకర్‌పై మంగళవారం ఉదయం దాడి చేసింది. దీంతో అందులోని సిబ్బంది పడవలో పరారయ్యారు. జలమార్గంలో సోమవారం మరో రెండు పడవలపై దాడి చేసింది కూడా తామేనని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. హార్ముజ్‌లో జరుగుతున్న దాడుల నేపథ్యంలో వాణిజ్య నౌకల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అమెరికా దాడులకు ప్రతిగా బహ్‌రైన్, కువైట్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. బహ్‌రైన్‌లోని షేక్ ఇసా వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా సైనిక లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయి. బహ్‌రైన్, కువైట్‌లలోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రంపై ఐఆర్‌జీసీ దాడులు చేసింది. బహ్‌రైన్‌లో అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ మౌలిక సదుపాయాల పైనా దాడి జరిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్‌రైన్, కువైట్, జోర్డాన్‌లు గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేశాయి. అమెరికా సేనలు సోమవారం రాత్రి నుంచి ఇరాన్‌లోని సైనిక కమాండ్ కేంద్రాలు, డ్రోన్ ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. బందర్ అబ్బాస్, తబ్రిజ్, బుషెహర్ సహా దేశంలోని పలు ప్రాంతాలపై అమెరికా దాడులు చేసిందని ఇరాన్ మీడియా తెలిపింది. పలు ప్రాంతాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి.
వంద మంది గాయపడ్డారు : అంగీకరించిన పెంటగాన్
ఈ నెల 7 నుంచి ఇరాన్ జరుపుతున్న దాడులలో సుమారు వంద మంది సైనిక సిబ్బంది గాయపడ్డారని పెంటగాన్ అంగీకరించింది. అయితే వీరిలో చాలా మందికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, 96 శాతం మంది తిరిగి విధులకు హాజరయ్యారని పెంటగాన్ ప్రతినిధి సియాన్ పార్నెల్ చెప్పారు. కాగా అమెరికా – ఇరాన్ మధ్య ఘర్షణలు మొదలైన తర్వాత తొలిసారిగా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ మంగళవారం కాంగ్రెస్ ఎదుట హాజరయ్యారు. ఇదిలావుండగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లకు ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా దౌత్య కేంద్రాలను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే గ్రూపులు వివిధ దేశాలలోని అమెరికా ప్రయోజనాల పైన, స్థావరాల పైన దాడి చేయవచ్చు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలి’ అని సామాజిక మాధ్యమంలో విదేశాంగ శాఖ సూచించింది.
ఆగ్నేయాసియా దేశాల ఆందోళన
హార్ముజ్ జలసంధి మూత ప్రాంతీయ ఇంధన భద్రతకు ముప్పుగా పరిణమించడంతో అగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కీలక మధ్యవర్తుల ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని, చర్చలు – దౌత్యం ద్వారా శాంతియుత పరిష్కారం లభించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆసియాన్ విదేశాంగ మంత్రులు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. కాగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
సౌదీ నౌకల రాకపోకలను అడ్డుకుంటామంటూ యెమన్‌లోని హౌతీలు చేసిన ప్రకటన మరో ప్రాంతీయ ఘర్షణకు దారితీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు సరఫరాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఎర్ర సముద్రం చివరన దక్షిణం వైపు బాబ్ అల్- మందెబ్ జలసంధి ఉంది. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని మూసివేస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చమురు మార్కెట్లలో కుదుపు ఏర్పడుతుంది. బాబ్ అల్`మందెబ్ జలసంధి సూయజ్ కాలువకు ముఖద్వారం. ప్రపంచంలోని ఓ అతి పెద్ద నౌకా మార్గం ద్వారా యూరప్‌ను, ఆసియాను కలుపుతోంది. ప్రపంచ నౌకాయాన రవాణాలో సుమారు పదిహేను శాతం ఈ జలసంధి మీదుగానే జరుగుతోంది. గతంలో ఈ మార్గంలో ప్రయాణించిన నౌకలపై హౌతీలు దాడులు చేశారు. 2023 – 2025 మధ్య ఈ మార్గంలో నౌకల రవాణాలో ఎదురైన అడ్డంకుల కారణంగా ఏటా 20 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ప్రపంచంలో అతి పెద్ద ముడి చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియాకు ఈ జలసంధి కీలక మార్గం. జలసంధి మూసివేతతో…యన్బు టెర్మినల్ మీదుగా అంతర్జాతీయ మార్కెట్లకు చమురును సరఫరా చేయడానికి సౌదీ అరేబియా ఉపయోగిస్తున్న ఈస్ట్ – వెస్ట్ పైప్‌లైన్ ఇక పనిచేయదు.
పూర్తి స్థాయి యుద్ధానికి దిగాం : పెజెష్కియాన్
అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధానికి దిగామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చెప్పారు. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ‘ఈ రోజు జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణుల పోరే కాదు. సైనిక దాడుల ద్వారా ఇరాన్ ప్రజలను లొంగదీసుకోలేమని శత్రువు నిర్ణయానికి వచ్చాడు’ అని అన్నారు. శత్రువుతో పోరులో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగవచ్చునని, ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పారు. జీవనోపాధి, నిరుద్యోగం, పేదరికం సహా పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంటూ ఇలాంటి సమాజంలో నివసించడం మనకు అంగీకారయోగ్యం కాదని తెలిపారు. ఆర్థిక ఒత్తిడులు సమాజంలో అసంతృప్తికి దారితీస్తే, ఆ అసంతృప్తి దేశమంతటా వ్యాపిస్తే వ్యవస్థకు మద్దతుగా ప్రజలు సృష్టించిన సామాజిక మూలధనం దెబ్బతింటుందని చెప్పారు. కాగా సైనిక పరంగా టెహ్రాన్ పైచేయి సాధించినప్పుడే సంప్రదింపులు తిరిగి ప్రారంభమవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.
అదుపు తప్పుతోంది!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



