ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన
నీట్ పేపర్ లీక్, విద్యార్థులపట్ల లాఠీచార్జీపై చర్చకు పట్టు
విద్యార్థుల పట్ల క్రూరత్వంపై సమగ్ర చర్చ జరగాలి
ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు? :రాహుల్ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ పేపర్ లీక్, విద్యారంగంలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘పార్లమెంట్ మార్చ్’లో విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ అంశంపై మంగళవారం ఉభయ సభల్లో ఆందోళనలు చేపట్టాయి. దీంతో పార్లమెంట్ స్తంభించింది. విద్యార్థులు , యువతపై దేశ రాజధానిలో పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు, నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించి ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు యత్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో ‘‘లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సభ్యులకు అవకాశం లభిస్తుంది’’ అని బిర్లా అన్నారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్యానెల్ స్పీకర్ సంధ్యా రే సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు.
ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా… నియమం 377 ప్రకారం సభ్యులు తమ స్థానాలలో కూర్చొని సభా కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను నాలుగు నిమిషాల్లోనే బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే సీన్ కొనసాగింది. సభను చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వినాలని కోరారు. “పేపర్ లీక్‌లు, నీట్ పరీక్షపై గళం విప్పుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ, బాష్పావాయువు ప్రయోగించారు. ప్రస్తుతం కొందరు విద్యార్థులు ఆస్ప్రతుల్లో చికిత్స పొందుతున్నారు. వారి సమస్యలను వినాలి” అని ఖర్గే అన్నారు. దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు లేచి కేకలు వేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ సభను ఏడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. చైర్మెన్ ఒక్క నిమిషంలోనే సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ సింగ్ ఒక్క నిమిషంలోనే సభను బుధవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభ స్పీకర్‌తో ప్రతిపక్ష నేతల భేటీ
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ప్రతిపక్ష నేతలు భేటీ అయ్యారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన తరువాత, స్పీకర్ ఓం బిర్లాను ఆయన ఛాంబర్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు కలిశారు.
మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు : రాహుల్‌గాంధీ
విద్యావ్యవస్థలో వైఫల్యాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ‘పార్లమెంట్ మార్చ్’ లో తమ గళం విప్పిన విద్యార్థులు, యువత పట్ల పోలీసుల అణచివేతపై స్పందించకుండా మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల పట్ల క్రూరత్వంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని అన్నారు. అయితే ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వ అనుమతి కావాలని స్పీకర్ అన్నారని తెలిపారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన దారుణంపై, విద్యావ్యవస్థలోని వైఫల్యాలపై ప్రభుత్వానికి పూర్తి జవాబుదారీతనం లేకపోవడంపై పార్లమెంటు సమగ్రంగా చర్చించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ దానికి మోడీ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. విద్యా, పరీక్షా విధానం కొన్ని చెదపురుగుల వల్ల కుళ్లిపోయిందని దేశమంతటికీ తెలుసు. ఇప్పటికైనా ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి’’ అని అన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను పోలీసులు కొట్టడం పూర్తిగా భారతీయ సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. ఈ సమస్యను ప్రతిపక్షం మరుగున పడనివ్వదని, వీధుల్లోనూ, పార్లమెంటులోనూ విద్యార్థుల గొంతు వినిపిస్తూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఇండియా బ్లాక్ భేటీ
పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు ఇండియా బ్లాక్ భేటీ అయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, ఎస్‌పి ఎంపీ ధర్మేంద్ర యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తదితరులు పాల్గొన్నారు.మరోవైపు అధికార ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, ఎన్‌డిఎ ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం కిరణ్ రిజిజు మాట్లాడుతూ దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ నొక్కిచెప్పారని అన్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ తర్వాత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని ప్రధాని మోడీ ఎంపీలకు చెప్పారని తెలిపారు.



