దేవాదుల పది మోటార్లను నడపాలి
ప్రభుత్వం వినకుంటే ప్రజాపోరుకు
సిద్ధమవుతాం : మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రాజెక్టుల్లో నీరున్నప్పటికీ రైతులకు ఎందుకివ్వడం లేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదులకు మంత్రులు వెళ్లి మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతామనీ, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారని చెప్పారు. ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా నీళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారనీ, శాయంపేట, బీమదేవరపల్లి, ఎల్కతుర్తి అంతటా ఆందోళనలు జరుగుతున్నాయని వివరించారు. ఆయకట్టుకు సరిపడా నీళ్లు ఉండి కూడా పంటలకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. పది పంపులు నడుస్తాయని చెప్పినా ఐదు పంపులే నడిచాయని అన్నారు. మంత్రులు వెళ్లినప్పుడు ఏడు మోటార్లు, వారు లేనప్పుడు మూడు మోటార్లు నడుస్తున్నాయని వివరించారు. అక్కడ ఎన్డీఎస్ఏ అడ్డంకి లేదన్నారు. చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమా? తెలంగాణ రైతులకు నీళ్లు ఒడిసిపట్టడమా? అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టబడిందని అన్నారు. 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి దేవాదులను పూర్తిచేశామని చెప్పారు.
ఎల్‌నినో వస్తుందని చెబుతున్నా ఎందుకు పది మోటార్లు నడపడం లేదని ప్రశ్నించారు. వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వబోమనీ, నాట్లు వేసుకోవద్దని అన్నారని గుర్తు చేశారు. మంత్రులు మాత్రం మూడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రకటించారని అన్నారు. ఎవరి మాటలు నమ్మాలని ప్రశ్నించారు. ఎల్‌నినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. దేవాదుల సమ్మక్క బ్యారేజీ నుంచి 105 టీఎంసీల నీళ్లు ఏపీ వైపు వెళ్లిపోయాయని వివరించారు. ఇప్పటి వరకు ఎత్తింది కేవలం 1.9 టీఎంసీలు మాత్రమేనని వివరించారు. నీళ్లను ఏపీకి విడిచిపెడుతున్నందున ఎవరికి శిక్ష వేయాలి? ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు బంద్ చేయాలనీ, చిత్తశుద్ధితో దేవాదుల 10 మోటార్లు నడపాలని డిమాండ్ చేశారు. 22 రిజర్వాయర్లు నింపి 3.17 లక్షల ఎకరాలకు తాగు, సాగు నీరందించాలని కోరారు. లేకపోతే వరంగల్, నల్లగొండ, కరీంనగర్ రైతులతో కలిసి ప్రజాపోరుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఉద్యమాలు ప్రారంభం కాకముందే ప్రభుత్వం కండ్లు తెరవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రాజయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



