ఉపసంహరణకు సుప్రీంకోర్టు నో
విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రాంగణాల నుంచి కుక్కలను తరలించాల్సిందే
గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలును పర్యవేక్షించాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. కుక్కల దాడుల తీవ్రతను, ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న దాడులను ఏమాత్రం విస్మరించలేమని తెలిపింది. వీటి ముప్పు లేకుండా జీవించే హక్కు పౌరులకు ఉందని నొక్కి చెప్పింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల తొలగింపునకు సంబంధించి 2025 నవంబర్‌లో తాము జారీ చేసిన ఆదేశాలను సవరింబోమని స్పష్టం చేసింది. జంతు హక్కుల కార్యకర్తలు దాఖలు పిటిషన్లు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అలాగే తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
‘బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారింది. గౌరవప్రదమైన జీవన హక్కు అంటే కుక్కల దాడుల భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా. ఈ విషయంలో రాష్ట్రాలు కేవలం ప్రేక్షకుల్లా ఉండలేవు. దేశవ్యాప్తంగా పిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు కూడా వీధి కుక్కల దాడులకు గురవుతున్నారు. పిల్లలు, వృద్ధులు తమ శారీరక శక్తి లేదా అదృష్టం మీద ఆధారపడి బతకాల్సిన సమాజాన్ని రాజ్యాంగం ఊహించలేదు. వీధి కుక్కల జనాభాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది.
ప్రతి జిల్లాలో
జంతు జనన నియంత్రణ కేంద్రం
భారత జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్ల్యూ బీఐ) ఫ్రేమ్‌వర్క్ నిబంధనలను కచ్చితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తిస్థాయి జంతు జనన నియంత్రణ (ఏబీసీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మరిన్ని ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు సూచించింది. అంతేకాకుండా జాతీయ రహదారులపై సంచరించే పశువుల సమస్యను కాలపరిమితిలో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సమస్యపై పర్యవేక్షణ, సమన్వయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. వీధి పశువులను నియంత్రించేందుకు పనికిరాని పాత రవాణా వాహనాలను వినియోగించాలని ధర్మాసనం ఆదేశించింది.
హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
వీధి కుక్కల నిర్వహణ సమస్యను ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న సంబంధిత హైకోర్టులు పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ విషయంలో తమ ఆదేశాలను అమలు జరిగేలా చూసేందుకు అన్ని హైకోర్టులు సుమోటోగా విచారణ చేపట్టాలని పేర్కొంది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆగస్టు 7లోపు తమ పరిధిలోని హైకోర్టులకు అమలు నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. దేశంలోని హైకోర్టులు నవంబర్ 17లోపు సమగ్ర అమలు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. గతేడాది నవంబర్ 7న వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. అప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, క్రీడా ప్రాంగణాలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. పట్టుకున్న వీధి కుక్కలను మళ్లీ అదే ప్రాంతంలో వదలకూడదని కూడా స్పష్టం చేసింది. స్థానిక సంస్థలు వీధి కుక్కలను పట్టుకుని టీకాలు, శస్త్రచికిత్సలు చేసిన అనంతరం గుర్తించిన ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడదను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఆదేశాలకు దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.



