నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హాల్ లో జిల్లా పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలలు, కేజీబీవీలు, భవిత కేంద్రాలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న నిర్మాణ, మరమ్మతు పనుల పురోగతిని పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావుతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని మరమ్మతుల పనులు, కేజీబీవీల నాబార్డ్ పనులు, సివిల్ రిపేర్లు పనులు పూర్తిచేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా వచ్చే నెలలో పూర్తి అయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిర్మాణాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఇంజినీరింగ్ అధికారులు తరచూ పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ప్రతి పనికి గడువులు నిర్ణయించి నిరంతరంగా మానిటరింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎంప్లాయిమెంట్, బీసీ సంక్షేమ అధికారి సాహితీ, టీజీ్విడీసీ డి.ఈ. శివకుమార్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ దాసయ్య, జిల్లా విద్యాశాఖ ఇంచార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్, టీజీ్విడీసీ ఏఈలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



