Saturday, May 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడు ట్రిలియ‌న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే ల‌క్ష్యం

మూడు ట్రిలియ‌న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే ల‌క్ష్యం

- Advertisement -

రాష్ట్ర వృద్ధి రేటు 10.7 శాతం
దేశ స‌గ‌టు కంటే వేగంగా వృద్ధి రేటు
ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌తో సేవ‌ల రంగానికి భారీ అవ‌కాశాలు
విద్యార్థుల రుణాలు భ‌విష్య‌త్ పెట్టుబ‌డులు
ఎస్‌‌హెచ్‌‌జీలకు వ‌డ్డీ లేని రుణాలు రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంపు :
బ్యాంక‌ర్ల స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంక్షేమ ప‌థ‌కాలు, ఆర్థిక స్వావ‌లంబన‌, ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం, మ‌హిళా సాధికార‌త‌, మూసీ పున‌రుజ్జీవంపై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌ల‌ను ఇస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం హైదరాబాద్‌‌లోని మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ప్ర‌జాభ‌వ‌న్ లో జ‌రిగిన 49వ రాష్ట్ర‌స్థాయి బ్యాంకర్ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్య‌వ‌స్థే లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం ప్ర‌జా ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు చేరుకోవడం, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరుకోవడం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు. రాష్ట్రం 130.78 శాతం క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తితో ముందుకు సాగ‌డం అద్వితీయ విష‌య‌మని వివరించారు. వ్యవసాయ రుణాల విషయంలో లక్ష్యాలను మించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషకరమ‌ని అన్నారు. రూ.1,65,297 కోట్ల లక్ష్యానికి రూ.1,68,401 కోట్ల వ్యవసాయ రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం సాధించ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యమని చెప్పారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని అన్నారు. రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, అనుబంధ రంగాలకు కిసాన్ క్రెడిట్ కార్డు సహా వివిధ పథకాల ద్వారా బ్యాంకులు అందిస్తున్న మద్దతు అభినంద‌నీయమని చెప్పారు. రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగ‌వంతంగా అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకులు సూక్ష్మ, చిన్న‌త‌ర‌హా పరిశ్రమలు, మహిళ, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల‌కు ఇచ్చే రుణాల విష‌యంలో మ‌రింత సానుకూల దృక్ఫ‌థంతో బ్యాంకులు ముందుకు రావాల‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థుల‌కు ఇచ్చే రుణాలు యువ‌త‌పై ప్రభుత్వం పెట్టే భ‌విష్య‌త్ పెట్టుబ‌డి అని తెలిపారు. సమగ్రాభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, ఉపాధి సృష్టి పట్ల ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్ర‌పంచ‌మంతా పున‌రుత్పాద‌క ఇంధ‌న‌ రంగంపై దృష్టి సారిస్తోంద‌న్నారు. అందులో భాగంగా ప్ర‌జాప్ర‌భుత్వం కూడా సౌరశక్తి విభాగంలో స్థిరమైన ప్రగతి సాధిస్తోందని తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ఇతర పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలని భట్టి సూచించారు. సామాజిక భద్రత, బీమా పథకాల పరిధిలోకి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను తీసుకురావాల‌న్నారు. బ్యాంకులు కేవలం డబ్బు డిపాజిట్ చేసే, రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలుగానే కాకుండా, రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి భాగస్వాములుగా వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజల డబ్బు అంతా బ్యాంకులకే చేరుతుంది, కాబట్టి ఆ నిధులను ఏయే రంగాల అభివృద్ధికి రుణాలుగా ఇస్తున్నామనేది చాలా ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉపాధికి ఏ రంగం ఎక్కువగా దోహదపడుతుందో ఆలోచించి బ్యాంకులు వ్యూహాత్మకంగా రుణాలు అందించాలన్నారు.

స్వయం సహాయక సంఘాలకు 
వడ్డీ లేని రుణాలు పెంపు
2047 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్ర‌స్తుత వృద్ధి రేటు చూస్తుంటే ఇది కచ్చితంగా సాధ్యమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ సగటు వృద్ధి రేటు 8.2 శాతం ఉంటే, తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతంతో దూసుకుపోతోందని చెప్పారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ప్ర‌క‌టించారు. ప్రజాప్ర‌భుత్వం మూసీ నది పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం అత్యంత వేగంగా పూర్తి చేయడం కూడా ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంద‌న్నారు. రాష్ట్రంలో వేగంగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో సేవా రంగంలో అధిక అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పారు మహిళా ఆర్థిక సాధికార‌త కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్టు వివరించారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో మహిళా సంఘాలకు రుణ పంపిణీపై యుద్ధప్రాతిపదికన దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ నగరం మహిళలకు వ్యాపార రంగంలో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇస్తోందని చెప్పారు. నగరంలోని మురికివాడల్లోని యువ మహిళా పారిశ్రామికవేత్తలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల‌న్నారు. రాష్ట్రంలో త్వరలోనే అనేక ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను తీసుకొస్తున్న‌ట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్‌, లెద‌ర్, టెక్స్‌టైల్ వంటి వివిధ రంగాలను డిజైన్ చేస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని వివరించారు. ఈ స‌మావేశంలో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌర‌వ్ ఉప్ప‌ల్‌, ఆర్బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ చిన్మ‌య మోహ‌న్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -