పర్సా సత్యనారాయణ వర్ధంతి.. స్థూపావిష్కరణ సభలో వక్తలు..కార్మిక హక్కుల రక్షణ పోరాటమే ఆయనకు ఇచ్చే నివాళి
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాటాలకు పదును పెట్టి మరింత ఉధృతం చేయడమే పర్సా సత్యనారాయణకు ఇచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, బండారు రవికుమార్, రాష్ట్ర సీనియర్ నాయకులు పి.రాజారావు అన్నారు. కార్మికవర్గ పోరాటాల దిక్సూచి పర్సా అని కొనియాడారు. కార్మిక ఉద్యమ నేత, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే పర్స సత్యనారాయణ 11వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సెవెన్ హిల్స్ దగ్గర నిర్మించిన ఆయన స్థూపాన్ని రాజారావు ఆవిష్కరించారు. ముందుగా పోతినేని సుదర్శన్ జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో రాజారావు మాట్లాడుతూ.. పర్సా మొదట గుంటూరు జిల్లా నుంచి కారేపల్లికి వచ్చి అక్కడి గ్రామస్తులతో పరిచయాలు పెంచుకున్నారని, మిన్నికంటి పర్వతాలు అనే మిత్రుడు పర్సాకు సింగరేణిలో ఉద్యోగం వచ్చే వరకూ తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించారని గుర్తు చేసుకున్నారు.
1945 జూన్ 16న కొత్తగూడెం సింగరేణిలో యూనియన్ ఏర్పాటు చేయడంలో పర్సా సత్యనారాయణ ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపారు. డ్యూటీ అవర్స్‌లో యూనియన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, యూనియన్ ఆఫీసులో చేయాల్సిన పనిని కంపెనీలో చేస్తున్నాడని అభియోగం మోపి పర్సాను విధుల నుంచి తొలగించారని చెప్పారు. దీంతో కంపెనీలో పెద్ద అలజడి నెలకొని.. పర్సాను పనిలోకి తీసుకోవాలని సుమారు నాలుగైదు వేల మంది కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ముందు బైటాయించారని, చివరకు యాజమాన్యం దిగొచ్చి తిరిగి ఆయనను విధుల్లోకి తీసుకుందని చెప్పారు. ఈ పోరాటమే కార్మికవర్గంలో పర్సాను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దిందన్నారు. ఉద్యోగం ద్వారా కార్మికవర్గ విప్లవంలో పూర్తి స్థాయిగా పాల్గొనలేనని భావించి పర్సా తన ఉద్యోగానికి రాజీనామా చేసి యూనియన్ బాధ్యతలు చేపట్టారని ఆనాటి పరిస్థితులను గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారని, తన యావత్ జీవితం కార్మికు ఉద్యమానికి అంకితం చేశారని కొనియాడారు. }
నిర్బంధ కాలంలో కార్మికోద్యమ నిర్మాత పర్సా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
1970లో సీఐటీయూ ఏర్పడ్డాక అందులోకి వచ్చారని, 1962లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో దీర్ఘాలికంగా ఇప్పుడు జనం అనుభవిస్తున్న అభివృద్ధి పర్సా సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాధించినదేనని గుర్తు చేశారు. పర్సా సత్యనారాయణ కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకునేవాడరని, తాను ఎక్కడున్నా కార్యకర్తల బాగోగులు, యోగక్షేమాలు కోరుతూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపేవారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ తెలిపారు.



