Sunday, May 24, 2026
E-PAPER
Homeసోపతిఆమె నన్ను ప్రేక్షకుల్లో వెతికిన సాయంత్రం

ఆమె నన్ను ప్రేక్షకుల్లో వెతికిన సాయంత్రం

- Advertisement -

ఆమెకు నాట్యం అంటే కేవలం నత్యం కాదు. అది ఆమె శరీరం మాట్లాడే భాష. నేను ఎప్పుడూ గమనించేవాడిని.. ఆమె సాధారణంగా నడుస్తున్నప్పుడు కూడా అందులో ఒక లయ ఉండేది. మాట్లాడేటప్పుడు కళ్లలో భావాలు ముందుగా కదిలేవి. కొందరు మనుషులు జీవితాన్ని ఆలోచిస్తారు. ఆమె మాత్రం అనుభవించేది. నేను ఉద్యమాల మనిషిని. ఆమె రంగస్థలం మనిషి. నేను సభల్లో కోపాన్ని మాట్లాడతాను. ఆమె వెలుగుల మధ్య నిలబడి మౌనాన్ని నర్తిస్తుంది. బహుశా అందుకేనేమో.. ఆమె ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి నాకు నేను కొంచెం కొత్త మనిషిలా అనిపించేవాడిని.
ఆ రోజు ఆమె భరతనాట్య ప్రదర్శన. నగరంలోని పాత ఆడిటోరియం. లోపలికి వెళ్లేసరికి హాల్‌ మొత్తం మదువైన వెలుతురుతో నిండిపోయింది. వేదిక ముందు దీపాలు వెలుగుతున్నాయి. ఎక్కడో లోపల మదంగం సౌండ్‌ వినిపిస్తోంది.
ప్రేక్షకులు నెమ్మదిగా తమ స్థానాల్లో కూర్చుంటున్నారు. నేను వెనక వరుసలో కూర్చోవాలని అనుకున్నా. ఆమె కళకి ప్రేక్షకుడిగా ఉండటం చాలు అనిపించింది. కానీ స్టేజ్‌ వెనుకనుంచి ఆమె నన్ను చూసింది. ఆమె కళ్లలో వెంటనే ఏదో వెలుగు.. చేతితో చిన్నగా సైగ చేసింది. ”ముందుకి రా” అన్నట్టుగా.
నేను నవ్వుకుంటూ ముందుకెళ్లి మూడో వరుసలో కూర్చున్నా. కొద్దిసేపటికే లైట్లు ఆరిపోయాయి. వేదిక మీద ఒక్క స్పాట్‌లైట్‌ మాత్రమే మిగిలింది. మదంగం మొదటి శబ్దం వినిపించింది. ఆమె నెమ్మదిగా రంగస్థలంపైకి వచ్చింది. ఆ క్షణం.. నిజంగా చెప్పాలంటే నేను ఆమెను కొత్తగా చూశాను. తెలుపు-ఎరుపు నాట్యవస్త్రం. కాళ్లకు గజ్జెలు. నుదుటిపై చంద్రబిండి. కళ్లలో తీవ్రమైన ఏకాగ్రత. ఆమె ఇక నాతో కాఫీ తాగే అమ్మాయి కాదు. ఏదో పురాతన కళ తన రూపం ఎత్తుకుని నా ముందు నిలబడినట్టుంది.

సంగీతం మొదలైంది. మొదట ఆలాపన. తర్వాత తాళం. తర్వాత ఆమె కళ్లలో భావాలు. మొదటి కొన్ని నిమిషాలు నేను నాట్యం చూడలేదు. ఆమె కళ్లనే చూస్తున్నా. ఎందుకంటే ఆమె ఎవరినో వెతుకుతోంది. మొదటి వరుస దాటింది. రెండో వరుస దాటింది. ఆ తర్వాత ఒక్కసారిగా నా దగ్గర ఆగింది. చాలా చిన్న క్షణం. కానీ ఆమె కళ్లలో ఒక్కసారిగా ఒక నిశ్చింత… ”నువ్వు వచ్చావు.” ఆ భావం అంత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాతే ఆమె నిజంగా నాట్యం మొదలు పెట్టినట్టనిపించింది.
ఆమె రాధ పాత్రలో నర్తిస్తోంది. కృష్ణుడి కోసం ఎదురుచూసే ఆత్రం ఆమె కళ్లలో మెల్లగా పెరుగుతోంది. ఒక అడుగు ముందుకు. రెండు అడుగులు వెనక్కి. చేతులు గుండె దగ్గర ముడుచుకోవడం. మళ్లీ దూరాన్ని తాకాలనుకునేలా విప్పడం. ఆడిటోరియంలో వందలమంది ఉన్నారు. కానీ నాకు మాత్రం ఆమె నన్నొక్కడినే చూస్తున్నట్టనిపించింది. ఒక క్షణంలో ఆమె కళ్లలో విరహం కనిపించింది. మరో క్షణంలో ప్రేమ. ఇంకో క్షణంలో కోపం. ఆమె కనుబొమ్మలు కదిలిన ప్రతిసారి
ఒక భావం పుడుతోంది. అప్పుడే నాకు అర్థమైంది.. నేను సభల్లో గంటసేపు మాట్లాడి చెప్పలేని విషయాన్ని ఆమె ఒక్క చూపుతో చెప్పగలదు. ఎందుకంటే కొన్ని సత్యాలు వినిపించవు. కేవలం అనిపిస్తాయి.

ప్రదర్శన ముగిసేసరికి హాల్‌ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. కానీ నేను మాత్రం కొద్దిసేపు లేవలేకపోయాను. ఎందుకో గొంతులో ఒక భావం చిక్కుకుంది. ఆమె స్టేజ్‌ మీద నమస్కారం చేస్తోంది. కానీ ఆ క్షణంలో నాకు ఆమె చాలా దూరంగా కనిపించింది. అంత అందంగా ఉన్న మనుషులు కొంచెం భయాన్ని కూడా కలిగిస్తారు. ఎందుకంటే వాళ్లు మన సొంతమని నమ్మడానికి మనసు సంకోచిస్తుంది. కొద్దిసేపటి తర్వాత స్టేజీ వెనక్కి వెళ్లా. ఆమె గజ్జెలు విప్పుతోంది. పాదాల చుట్టూ ఎర్రటి మచ్చలు పడ్డాయి. చెమటతో మేకప్‌ కొద్దిగా కరిగిపోయింది. స్టేజ్‌ మీద దేవతలా కనిపించిన అమ్మాయి…
ఇప్పుడు అలసిపోయిన మనిషిలా ఉంది. నన్ను చూడగానే నవ్వింది.
”ఎలా ఉంది?” అంది. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయా.
”అంత బోరింగ్‌గా ఉందా?”
”లేదు…”
”నువ్వు స్టేజ్‌ మీద ఉన్నప్పుడు… నాకు భయం వేసింది.”
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
”ఎందుకు?”
కొద్దిసేపు మౌనంగా ఉన్నా.
”అంతమందిలో కూడా… నువ్వు నాకు అందనంత దూరంగా కనిపించావు,” అన్నా. ఆమె కళ్లలో ఒక్కసారిగా ఏదో కరిగింది. మెల్లగా దగ్గరకు వచ్చింది.
”రామ్‌… కళాకారులు కూడా కొంచెం ఒంటరివాళ్లే” అంది నెమ్మదిగా. ఆ మాట వినగానే ఆ రాత్రి నా ఒంటరితనాన్ని ఆమె అర్థం చేసుకున్న సందర్భం గుర్తొచ్చింది. బహుశా ప్రేమంటే ఇదేనేమో.. ఇద్దరూ వేర్వేరు ప్రపంచాలకు చెందిన వాళ్లమని తెలుసుకుంటూనే… ఒకరి ఒంటరితనానికి ఇంకొకరు ఆశ్రయం కావడం.
బయటికి వచ్చేసరికి రాత్రి గాలి మల్లెల వాసనతో నిండిపోయింది. ఆమె నడుస్తూ ఒక్కసారిగా నా చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలో ఇంకా నాట్యపు వేడి ఉంది. ఆమె అడుగుల్లో గజ్జెల శబ్దం ఇంకా మిగిలే ఉంది.
”రామ్‌…” అంది మెల్లగా.
”హ్హ్‌?”
”ఈరోజు నువ్వు ప్రేక్షకుల్లో కూర్చుని ఉండటం చూసాక… నాకు నాట్యం చేయాలనే ఉత్సాహం ఇంకాస్త పెరిగింది.”
నేను నవ్వాను.
”అంత ప్రభావమా?”
ఆమె తల ఊపింది.
”అవును… ఎందుకంటే ప్రేమించే మనిషి ప్రేక్షకుల్లో ఉంటే… మనసు తన అందమైన రూపాన్ని ఎంచుకుంటుంది.”ఆ మాట తర్వాత మళ్లీ ఒక నిశ్శబ్దం పుట్టింది. ఆ నిశ్శబ్దంలో దూరంగా ఎక్కడో గజ్జెల ప్రతిధ్వని ఇంకా వినిపిస్తోంది. ఆమె వెళ్లే ముందు ఎప్పటిలాగే వెనక్కి తిరిగింది. చిన్నగా నవ్వి… చేతులతో ఒక నాట్య ముద్ర చూపించింది. ఆ క్షణంలో నాకు అనిపించింది.. కొంతమంది మన జీవితంలోకి ప్రేమగా రారు. ఒక కళాఖండంలా వస్తారు. ఆమె అలాంటిదే.

– రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -