హైదరాబాద్ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలు
అమలులో కీలక సవాళ్లు
నవతెలంగాణ- సిటీ బ్యూరో
హైదరాబాద్ నగరానికి చారిత్రక గుర్తింపునిచ్చిన మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తొలి దశలో రూ.7500 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ నదిని కాలుష్య రహితంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డిసిఎల్) ఆధ్వర్యంలో మొత్తం 55 కిలోమీటర్ల పరిధిలో ఐదు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ (గండిపేట) నుంచి బాపూఘాట్ వరకు 11 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నది ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్‌గా నిర్ణయించి, హద్దురాళ్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించారు.
పర్యాటక కేంద్రంగా ఏర్పాట్లు
మొదటి దశలో భాగంగా బాపూఘాట్ వద్ద ‘గాంధీ సరోవర్’ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు, సుమారు 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణ ప్రతిపాదన కూడా చర్చలో ఉంది. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా గోదావరి జలాలను మూసీలోకి తరలించి ఏడాది పొడవునా ప్రవాహం కొనసాగించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీని ద్వారా దుర్వాసన, కాలుష్యాన్ని తగ్గించాలన్నది లక్ష్యం. నగర రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయనున్నారు.
ఎస్టీపీల ఏర్పాటు ద్వారా కాలుష్య నియంత్రణ
నదిలో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించనున్నారు. నదిలోకి చేరే మురుగునీటి కాలువలను నియంత్రించి, ఎస్టీపీల ఏర్పాటు ద్వారా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. వరద ముప్పును తగ్గించేందుకు రిటైనింగ్ వాల్స్, బ్యారేజీలు నిర్మించనున్నారు. నది తీర ప్రాంతాలను ఆధునిక రివర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రెండు వైపులా రహదారులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, భారీ పార్కులు, ప్రజల వినోదానికి బహిరంగ ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు. రాత్రివేళల్లో ఆర్థిక కార్యకలాపాలకు అనువుగా ‘నైట్ ఎకానమీ’ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
కీలక సవాళ్లు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి సుమారు రూ.4,100 కోట్ల ఆర్థిక సహకారం పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.7,055 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద కేంద్ర సహకారం కోసం కూడా ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. అయితే బఫర్ జోన్లు, భూవినియోగం, స్థానిక ప్రజల ప్రయోజనాలు వంటి అంశాలు ఈ ప్రాజెక్టు అమలులో కీలక సవాళ్లుగా మారనున్నాయి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.



