తొమ్మిది రకాల వరి సాగుచేసిన రైతులు నమోదు చేసుకోవాలి
నకిలీ డీఏపీ తయారు చేస్తే
కఠిన చర్యలు
మార్కెట్లలో ఆర్డీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘వీబీ గ్రామ్‌జీ ’ కింద ఎకోపాండ్లు నిర్మించేలా, వెదురు సాగు చేపట్టేలా పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తన శాఖ పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్ధారించిన తొమ్మిది వరి రకాలను సాగు చేసిన రైతులు, ఎఈఓల దగ్గర రిజస్ట్రీ చేసుకునే విధంగా రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రస్తుత పంటల పరిస్థితిపై ఆరా తీశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఎన్ని పరికరాలు అందించాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఇతర శాఖల నుంచి వ్యవసాయ శాఖకు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. మార్క్‌ఫెడ్‌కు మంజూరైన 65 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలను వరి అధికంగా పండించే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగుల హాజరుపై రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయాలనీ, విధులకు ఆలస్యంగా వచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు.
ఒకే తరహా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ను ఆదేశించారు. నర్సరీల్లో మిగిలిపోయిన పామాయిల్ మొక్కలను వెంటనే విక్రయించి, వచ్చే నెలకు కొత్త మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు రెండు మూడు రోజుల్లోనే మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రిప్ కంపెనీలతో మాట్లాడి ఆయిల్‌పామ్ కంపెనీలే రైతులకు నేరుగా డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటు చేసేలా చూడాలని సూచించారు.
ఆయిల్‌పామ్ మిల్లుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ట్రయల్ రన్స్ ప్రారంభించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని విజయ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మిడ్‌డే మీల్స్ కార్యక్రమాలకు అవసరమైన కూరగాయలను ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచే కొనుగోలు చేసేలా, వంట నూనెగా విజయ ఆయిల్‌ను వినియోగించే అంశంపై హరేకృష్ణా చారిటీ ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడాలని సూచించారు.
అక్రమార్కులను వదలొద్దు
నకిలీ డీఏపీ తయారీకి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసి, 6 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దనీ, కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. నకిలీ డీఏపీ ఎంతమేరకు, ఎవరెవరికి విక్రయించారో వివరాలు సేకరించాలనీ, నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యక్తుల నుంచే పరిహారం ఇప్పించాలని స్పష్టం చేశారు. మార్కెట్లలో కొనసాగుతున్న ఆర్‌డీ వ్యవస్థను సమూలంగా రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. మార్కెట్ యార్డులు, మిర్చి కోల్డ్ స్టోరేజీలలో తనిఖీ చేయించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రెటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ రాహుల్ రాజ్, హాకా ఎమ్‌డీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ, హార్టికల్చర్ యూనివర్సిటీల వీసీలు జానయ్య, రాజిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు.



