ఇందులో ఎక్కువ భాగం ప్రేమకథలే. భవిష్యత్తును పణంగా పెట్టి ప్రేమను గెలుచుకున్న కథ ఒకటి కాగా- విఫల ప్రేమలు, విషాద ప్రేమలు మరికొన్ని. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా విమల్ ఒక గ్రామీణ యువతి శశిరేఖ అందాన్ని గమనించి ఫొటోలు తీసి, వాళ్ల కుటుంబానికి నచ్చజెప్పి మోడల్‌గా తయారుచేసి సినీ నటిగా ఎదగడానికి తోడ్పడతాడు. అతని నిజాయితీ, మంచితనానికి ఆకర్షితురాలైన శశిరేఖ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ మాయా ప్రపంచానికి దూరంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. శశిరేఖను వెలుగులోకి తెచ్చిన విమల్ దానికి ఆమెను ఎందుకు దూరం చేశాడో తెలుసుకోవాలంటే ‘శశివదనే’ కథ చదవాల్సిందే. ప్రేమకు లాభనష్టాలు ఉండవు. త్యాగం మాత్రమే ఉంటుంది. ప్రేమించిన అమ్మాయితో జీవితము పంచుకోకపోయినా, ఆమె జ్ఞాపకాలే ఊపిరిగా బతికిన రాజుగారు- తనను వదిలి వెళ్ళిపోయిన ప్రియురాలు చివరకు పిల్లలతో అనాధగా ఉంటే, వారిని చేరదీసి వారికి కొత్త జీవితాన్నిచ్చిన రాజు గారి గొప్పతనం” రాజు గారి కిరాణా కొట్టు”లో కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడం, అంతస్తులో చాలా తేడా ఉండటంతో సహజంగానే పెద్దలు వాళ్ళ ప్రేమను అంగీకరించలేదు. చివరికి మరణమే శరణ్యం అనుకున్నారు. మరణంలో కూడా ఆమె ప్రేమను అనుమానించి, ఆమె ప్రేమకు దూరం అవుతాడు. భగ ప్రేమికుడిగా మద్యపానానికి అలవాటు పడి ఆరోగ్యం క్షీణించి ”ఆటో మెకానిక్ రమేష” చనిపోతాడు. రమేష్ ప్రాణం కాపాడటానికే, ఆమె దూరం అయిందన్న విషయం తెలుసుకోలేకపోతాడు. తెలిసి తెలియని వయసులో యువతి యువకుల మధ్య ఏర్పడే ఆకర్షణని ప్రేమగా పొరబడుతుంటారు. ప్రేమ వేరు. ఆకర్షణ వేరని ”తీరని కోరిక” తెలియజేస్తుంది. కొన్ని ప్రేమ కథలు అర్ధాంతరంగా ముగుస్తాయి. మరికొన్ని అందమైన జ్ఞాపకంలా మిగిలిపోతాయి. మిగిలిన అతి కొద్ది మాత్రమే సుఖాంతం అవుతాయి. ప్రేమ విఫలం అయినా పరిస్థితులకు తగ్గట్టు జీవితాన్ని హదయాన్ని మలుచుకొని హాయిగా జీవించగలే మెలకువ అందరిలో ఉండదని ”ఒక ఫాతిమా” నిరూపిస్తుంది.
ఈ కథలను మొదలు పెడితే చాలు, చివరి వరకు మనల్ని అవే లాక్కెళతాయి. రచయిత ప్రేమ కథలను రాయడంలో మంచి ప్రతిభను కనబరిచారు. విభిన్న నేపథ్యాలలో రూపొందిన ప్రేమ కథలు కొత్తగా ,ఆకర్షణీయకంగా ఉండి ఆసక్తిగా చదివింపజేస్తాయి. ఇందులోని ”మత్తు, కిల్లర” కథలు సహజత్వానికి దూరంగా,” ఒక ఫాతిమ, పెద్ద మనసు” కథలు అతి నాటకీయతతో కూడుకున్నప్పటికీ, ఆసక్తిగా చివరిదాకా చదివింప చేయడం విశేషం. మంచి శైలి, పఠనీయతా గుణం కలిగిన కథకుడు, కథానిర్మాణంలో మరింత శ్రద్ధ తీసుకుంటే అతనికి ఎదురే ఉండదు.
కె.పి.అశోక్
కుమార్
9700000948



