ఆధునికత చెప్పిన మరో మాట వుంది. కళాకారులు చిత్రం గీసినా, శిల్పం తయారు చేసినా అది వారి భావప్రకటనకు, వారి ఆలోచనలకు ప్రతిబింబంలా వుండాలి. అది వారి సంతకంలా వుండాలి. అలాగే వారూ వారి కళల మీద సంతకమూ చేయాలి. బ్రిటిష్ వారు రాక ముందు మన సంప్రదాయ కళలపై కళాకారులు సంతకం చేసేవారు కాదు. ఒకే చిత్రకారుడు చిత్రం వేయాలనే పద్ధతి కాదు అది. చిత్రకారుడి మాస్టరు డ్రాయింగ్ గీసి చిత్రం నిర్ణయిస్తే, అతనితో వున్న చిత్రకారులు దానిని పూర్తి చేసేవారు. సంతకంలా చిత్రం వుండాలి, సంతకం చేయాలనేది ఆధునిక పద్ధతి.
1920ల తరువాత స్వదేశీ పోరాటం, బ్రిటిష్ వారి పాలనకు విరోధం, కళల ద్వారా కళాకారులూ స్వదేశీ ప్రేమ ప్రకటించారు. అలా చూపిస్తూనే వారి వారి ఆలోచనల ప్రకారం, దేశీయ, ప్రాంతీయ సమాజ సంస్కృతుల పునర్జీవనంపై పని చేస్తూనే వారి వారి సంతకమూ చిత్రాలపై చేయనారంభించారు. ఆధునికతలోని మంచిచెడులు రెండూ కళాకారులు ఆలోచించి వుపయోగించుకున్నారు. వారి ప్రాంతీయతను వారి కళల విషయంగా రకరకాలుగా చిత్రం సృష్టించారు. ముందుగా బెంగాలు ఉదాహరణగా తీసుకుంటే…
జామినీ రాయ్ (1887 – 1972) : స్వదేశీ కళలు, ప్రాంతీయ కళలు పునర్జీవింప చేయాలనుకోవటంతో పాటు ప్రతి కళాకారులకు వారి ఆలోచనలకు సరిపడే కళలను వారి పద్ధతిగా ప్రకటించాలని ఉత్సుకత పెరిగింది. బెంగాలు వారిపై అబనీంద్ర టాగోర్ ప్రభావం ఎంతో వుంది. అబనీంద్రుడు, అజంతా చిత్ర పద్ధతి, మొగలు, రాజస్థానీ, పహాడీ చిత్ర పద్ధతి వంటి… మన సంప్రదాయక కళల ద్వారా మన గడచిన స్వర్ణయుగాన్ని వెనక్కి తీసుకురావచ్చు, అదే బ్రిటిష్ పాఠ్య పద్ధతికి వ్యతిరేక పోరాటం అని ఆయన బోధించాడు, పాటించాడు. ఈ పాఠం విన్న ఆయన శిష్యులందరూ వారి వ్యక్తిగత పద్ధతి వెతకటం మొదలెట్టారు.
జామినీ రారు కలకత్తా కళా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, యూరోపియన్ చిత్రకళా పద్ధతి నేర్చుకున్నాడు. నిజానికి ఆ పద్ధతిన చిత్రాలు గీసినా ఆయన మంచి పని చేసి వుండేవాడు. జామినీరారుకి ఆ పద్ధతిలో కానీ, అబనీంద్రుడి పాఠాల ద్వారా నేర్పిన అజంతా, రాజస్థానీ మొదలగు కళలలోనూ రుచి దొరకలేదు. బెంగాలులో బ్రిటిష్ వారు వచ్చినాక పనికోసం వెతుక్కునే కళాకారులు బజార్లలో అమ్మే కాళీఘాట్ చిత్రాలు, అక్కడి ఎర్రమట్టి మందిరాలపై శిల్పం, బెంగాలు బొమ్మలు ఆయనని ఆకర్షించాయి. ఇందులో ఒక వ్యత్యాసం వుంది. ఈ బజారు చిత్రం, బెంగాలు బొమ్మలు, పట్టచిత్రం ఇవన్నీ జానపద కళలు. రాజస్థానీ, పహాడీ, మొగలు చిత్రాలు ఆస్థానాలలో రాజుల మద్దతుతో వేసిన చిత్రాలు. వీటి లెక్కన జానపద కళలకు తక్కువ స్థానం ఇవ్వబడుతుంది. జామినీ ఎంపిక తక్కువ స్థాయిలో చూపబడే ఈ జానపద కళల పునర్జీవనం. ఈ పద్ధతిన కళలను చిత్రించడం, శిల్పం తయారు చేయటం ఆయనకు ఆనందం ఇచ్చింది. ఈ జానపద కళల పద్ధతిలో మన కళాకారులు ఒక్కరే పనిచేయరు. కుటుంబం అంతా కల్సి, రంగులు చేకూర్చుకుని, నూరటం, కలపటం, చిత్రించటం, రంగులు నింపటం అని సమంగా పంచుకుని కళలను చేస్తారు. జామినీ అదే పద్ధతిన కుటుంబాన్నంతా ఈ పనిలోకి తీసుకువచ్చాడు. నిజానికి జామినీ బాంకురా గ్రామానికి చెందినవాడే కానీ అక్కడి జానపద కళాకారుల కుటుంబాలకు చెందిన వాడు కాదు. వారి పద్ధతిన పని చేస్తూనే అలాగే అందుబాటు ధరలకే తన చిత్రాలను, శిల్పాలను విక్రయిస్తూనే ఇది జామినీరారు కళ అని దర్శకులు గుర్తించే తన సంతకంలాంటి కళలను సృష్టించాడు.
ఈయన చిత్రాలు కాళిఘాట్ చిత్రాలలోని నల్లటి వెడల్పు గీతలతో, పట్టచిత్ర కళాకారుల చిత్రాలకు దగ్గరగా వుంటాయి. ఈయన వేసిన యశోదక్రిష్ణ, ముగ్థస్త్రీ వంటి ఎన్నో చిత్రాలు ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిష్‌వారిపై వ్యంగ్య చిత్రాలూ వున్నాయి. బొమ్మల్లా కనిపించే గుండ్రటి ముఖాల స్త్రీ బొమ్మలు చూడగానే ఒకేరకమైన చిత్రాలు అని పొరపడినా, ఒక్కో చిత్రం ఒక్కో భావప్రకటనలో కనిపిస్తుంది. తన పద్ధతిలో కొన్ని క్రైస్తవ విషయ చిత్రాలూ వేశాడు. ఈయన జానపద కళాపద్ధతిని ఎన్నుకోవటం, మాయమౌతున్న బెంగాలీ జానపద కళలను పునర్జీవింపచేయటం, బ్రిటిష్ వారిని విరోధించటం కూడా అవుతుంది. 1934లో ఈయనకి వైస్రారు బంగారు పతకం, 1955లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో అలంకరించింది. ఎ.ఎస్.ఐ., సంస్కృతిక మంత్రి శాఖవారు 1976లో ఈ కళాకారుడిని భారత నవరత్న కళాకారులలో ఒకడిగా చేర్చారు.
నందలాల్ బోస్ (1882 – 1966) : అబనీంద్రుడి విద్యార్థి. గురువు సిద్ధాంతాలను నమ్మటమే కాదు, మరింత పట్టుదలగా ముందుకు సాగాడు. రవీంద్రనాథ్ తదనంతరం శాంతినికేత్‌కి అధ్యక్షుడయ్యాడు. భారతీయ సంప్రదాయక కళలను పునర్జీవింపచేయటమే కాదు, వాటిని అదే స్వచ్ఛతలో ముందడుగు వేయించాలనుకున్నాడు. ఏదైనా విషయం కానీ, ఎక్కడికైనా ప్రయాణం చేసి అక్కడి నచ్చిన విషయాన్ని కానీ చిత్రించాలంటే ఆ విషయాన్ని చిత్రంగా మనసున నిలుపుకుని వెనక్కి వచ్చి చిత్రించాలన్నది భారతీయ చిత్ర పద్ధతి.
ఎక్కడికైనా వెళ్లి అక్కడి సంఘటనలు, మనుషులు స్కెచ్ డ్రాయింగ్‌లు అక్కడ వేసి వెనక్కి తిరిగి వచ్చి చిత్రంగా దిద్దటం యూరోపియన్‌లు నేర్పిన విద్యాపద్ధతి. అందుకని ఆ పద్ధతినే నిరోధించాడు నందలాల్. వెనక్కి తిరిగి వచ్చి చేసే జ్ఞాపకాల చిత్రాలు కూడా ప్రకృతి సిద్ధ రంగులు, నీటి రంగులు చైనా వారి కలీగ్రఫీ పద్ధతి మాత్రమే ఒప్పుకున్నాడు. బ్రిటిష్ వారి తైలవర్ణ చిత్రాలు తను వేయలేదు. ఏ విద్యార్థులనూ శాంతినికేతన్‌లో వేయనివ్వలేదు. 1941లో నందలాల్ రవీంద్రనాథ్ తరువాత, శాంతినికేతన్‌ని ఒక కోటలా మార్చాడు. పశ్చిమకళా పద్ధతిన ఎవరైనా చిత్రం వేసినా, అలా ఆలోచించినా శాంతినికేతన్ వారు ఎగతాళిగా చూశారు. నిజానికి రవీంద్రనాథ్ టాగోర్ శాంతినికేతన్‌ని మన భారతీయ ఆలోచనా విషయాలలో అంతర్జాతీయతనూ ఆహ్వానించి గురుకుల పద్ధతిలో నడపాలనుకున్నాడు.
నందలాల్, అబనీంద్రుడికి పరమశిష్యుడిలా అజంతా చిత్రాలపద్ధతి, నీటి రంగులు, జపాన్ వారి పద్ధతి ఈయన చిత్రాల విధానం అయింది. ఈయనా 1930లో స్వదేశీ విప్లవంలో పాల్గొన్నాడు. గాంధీజీ చెప్పగా 1937లో కాంగ్రెస్ సమ్మేళనం కోసం ఏర్పరచిన పండాళ్‌లో తను చిత్రాల పోస్టర్లు వేసి అలంకరించాడు. అవి మన టెంపెరా రంగుల పద్ధతిన, మనవారు చేతితో చేసిన కాగితంపై చిత్రించాడు. ఇంగ్లీషు కాగితం కాదు. మన జానపదుల జీవన విశేషాలు ఆ చిత్రాల విషయాలు. అవి పండిత పామరులందరూ మెచ్చారు. ఈయన చెక్కపై ముద్రణ కళను తన భావచిత్రాల కోసం ఉపయోగించిన మొదటి వ్యక్తి. శాంతినికేతన్, చిత్రకారులు, పల్లెజీవితం, రైతు జీవితం, ప్రకృతి దృశ్యాలు, బుద్ధుడి జీవిత చరిత్ర చిత్రాలుగా వేయమొదలెట్టారు. ఒక కవితలా, పాటలా సాగే చిత్రాలు వేయటం బెంగాలు కళాకారుల పద్ధతి. అది ఈయన పద్ధతి కూడా.
ఈయనకు మన భారత ప్రభుత్వం భారత రాజ్యాంగానికి చిత్రాలు వేయమని బాధ్యత ఇచ్చింది. 1954లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 1957లో కలకత్తా విశ్వవిద్యాలయం డి.లిట్‌తో సన్మానించింది. 1976లో భారత ప్రభుత్వ సంస్కృతి విభాగం ఎ.ఎస్.ఐ. ఈయనని జాతీయ నవ కళారత్నాలలో ఈయన పేరూ చేర్చారు.
హేమేంద్రనాథ్ మజుందార్ (1894 – 1948) : ఈయన అబనీంద్రనాథ్ గురుతలంలో ఏర్పరచిన లక్ష్మణరేఖల వంటి నియమాలను ఉల్లంఘించాడు. భారతీయ సంస్కృతి జన జీవన విషయాలను ఈయనా చిత్రించాడు. కానీ ఇంగ్లీషు వారు నేర్పిన నిజమనిపించేలాటి చిత్రం వేయటం తైల వర్ణ చిత్ర పద్ధతి అబనీంద్రనాథ్ స్వదేశీ పోరాటంలో భాగంగా విరోధించాడు. హేమేంద్రనాథ్ వంటి కొంతమందికి నిజమనిపించే చిత్రం తైలచిత్ర పద్ధతి నచ్చాయి. రణదాప్రసాద్ గుప్తా కూడా ఇలాంటి భావాలతోనే అబనీంద్రనాథ్ సహచరుల సమూహం నుండి వేరై కలకత్తాలో జుబిలీ ఆర్ట్ అకాడమీ తెరిచాడు. వీరెవరూ భారతీయ జీవన పద్ధతి, సంస్కృతిని విషయంగా చిత్రీకరించటానికి విరోధం కాదు. కానీ మరో కొత్త పద్ధతి నేర్చుకోవద్దు. ఎందుకంటే అది బ్రిటిష్ వారు చెప్పారు కాబట్టి అన్న ప్రచారానికీ, బలవంతానికి విరోధులు. కలకత్తా ఈ విధంగా ఆ సమయాన రెండు రకాల వాదనలతో యుద్ధ భూమి అయింది. కాకపోతే అబనీంద్రనాథ్ సమూహం వారు బలవంతులవటం వలన వారి మాట గెలిపించి కలకత్తా కళాసంస్థని చేజిక్కించుకున్నారు. హేమేన్ లెక్క ప్రకారం యూరోపియన్ పద్ధతిలో చక్కటి డ్రాయింగ్ పనితనం వుందని, అబనీంద్రనాథ్ సమూహం వారికి ఎదురీది తనకు నచ్చిన పద్ధతిన చిత్రం వేశాడు. స్త్రీ దైనందిన చర్యలని ఎన్నో చిత్రాలుగా వేశాడు. స్త్రీ వెనుక నుండి తడి వస్త్రంలో వున్న చిత్రాలు చాలా వేశాడు. నిజమనిపించే చిత్రం, చక్కటి డ్రాయింగ్ పద్ధతిలో ఈయన చిత్రాలు ప్రసిద్ధికెక్కాయి.
హేమేన్ కిషోర్ గంజ్ (బంగ్లాదేశ్)లో జన్మించి 1910లో కలకత్తా ప్రభుత్వ పాఠశాలలో కళలు నేర్చుకోవడానికి వచ్చాడు. అబనీంద్ర, వారి సహచరుల బలవంతపు పద్ధతిలో ఇమడలేక జుబిలి ఆర్ట్ అకాడమీలో చేరాడు. 1919లో జామినీరారు కూర్చిన భారతీయ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌కి జోగేష్ చంద్ర సీల్, భబానీచంద్ర లాహా, అతుల్ బోస్ వంటి వారితో కలిసి మద్దతు ఇచ్చాడు. వీరందరూ అబనీంద్రుడి సమూహం వారు ప్రకటించిన పునర్జీవన సిద్ధాంతాన్ని ఎదుర్కొన్నారు. వీరు శిల్పి అనే పత్రిక ద్వారా తమ నమ్మకాలను, ఆలోచనలను కళావేదికకు చేర్చారు. ఇది బెంగాల్ స్కూలు వారు ప్రచురించే రూపప్ పత్రిక ఆధికార గొంతుని ఆపటం కోసం కూడా పని చేసింది. అనివార్య కారణాల వలన ‘శిల్పి’ని ఆపినా సొసైటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే మరో పత్రిక ద్వారా దేశంలోని కళాకారుల విషయాలు, ప్రఖ్యాత కళాకారుల విషయాలూ ఈ పత్రికలో రాశాడు. 1921 – 22లో వెయ్యిమంది, నిజమనిపించే చిత్రం వేసే అకడమిక్ పద్ధతిన పనిచేసే కళాకారుల చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఈయన చిత్రాలు ఎంతోమంది ఆస్థాన రాజులనూ ఆకర్షించాయి. ఈయన బహుమతులూ పొందాడు. పటియాలా మహారాజు తమ ఆస్థాన చిత్రకారుడిగా నియమించాడు. ఈయన వల్ల బెంగాల్ కళాకారులదే కళ అనే మిద్య వదిలి అన్ని కళలూ, కళాకారులనూ దేశం ప్రసింశించ మొదలెట్టింది.
అబనీంద్రుడు భారతీయ పునర్జీవనం పై పని చేసినా,తాను బ్రిటిష్ వారికి విరోధం అని ప్రకటించినా, తానూ తన చిత్రాల మీద సంతకము మటుకు చేసాడు. అది బ్రిటిష్ పద్దతి కాబట్టి చేయను అని అన లేదు. అటు అబనీంద్రుడి శిష్యుల చిత్ర పద్దతి గురువు నేర్పిన పద్ధతినే ముందుకు సాగించారు. క్షితిన్ద్రనాథ్ మజుందార్ (1891-1975), శరత్ చంద్ర ఉకిల్ (1890-1940) వంటి శిష్యుల చిత్ర పద్దతి అబనీంద్రుడి పద్దతిని పోలి ఉంటాయి. బెంగాల్ స్కూల్ తీసుకున్న మార్గం అదే అని మనకు అర్ధం అవుతుంది. అలాగే అబనీంద్రుడి శిష్యులు సమరేంద్రనాథ్ గుప్త వేరుపడని పాకిస్తాన్ లోని లాహోర్ మయో కళా పాఠశాలలో అధ్యాపకుడు. ఈయన చిత్రాలు గురువు చిత్రాల విషయాలనే పోలివుంటాయి. కానీ మాయో కళాశాలలో ఈయన శిష్యుడు మొహమ్మెద్ అబ్దుర్ రహమాన్ చుగ్తాయి తన పద్దతిలో కొంత పాశ్చత్య పద్దతి కలిపాడు.
హకీమ్ మోహ మ్మద్ ఖాన్ లక్నో నుంచి వచ్చి అబనీంద్రుడి వద్ద చిత్రం నేర్చుకుని అదే పద్ధతిన చిత్రం వేసాడు. కే.వెంకటప్ప (1886-1965) మైసూరు నుండి కలకత్తా వెళ్లి అబనీంద్రుడి వద్ద చిత్రం నేర్చుకుని వెనక్కు వెళ్లి చిత్రం వేసినా అయన చిత్రంలో మైసూరు సాంప్రదాయ చిత్రకళా పద్దతి ఆనవాళ్లు కనిపిస్తాయి.
తరం మారిన తరువాత జరిగిన మార్పులకు, అలాగే అయన పద్దతిని బెంగాల్ స్కూల్ ని విరోధించిన జుబిలీ అకాడెమీ, భారతీయ అకాడెమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ వారు తీసుకు వచ్చిన మార్పులను అర్ధం చేసుకున్న అబనీంద్రుడు తన చిత్రం తాను వేసుకుంటూ పక్కగా ఉండిపోవలసి వచ్చింది. కలకత్తా లో ఆపై వచ్చిన పురోగమన చిత్ర మార్పులకు కారణం రవీంద్రనాథ్ టాగోర్, గగనేంద్రనాథ్ టాగోర్ ప్రవేశ పెట్టిన అంతర్జాతీయ మిశ్రమ పద్దతి.
డా||యం.బాలామణి, 8106713356



