Saturday, May 16, 2026
E-PAPER
Homeసోపతిఒంటి నిట్టాడు గుడిసె

ఒంటి నిట్టాడు గుడిసె

- Advertisement -

ఇగో ఇక్కన్నే
చూరు నీళ్లు రాలుస్తూ
వాన జల్లుకు వణుకుతున్న
రెక్కలు రాని సంటి పిల్లల్ని
తల్లి కోడోలె పొదువుకునేది
ఎప్పుడు చెరువు అలుగువడ్డా
బురద నీరు పారి
ఒళ్ళంతా నల్లమట్టి రాసుకుని
తెల్లని గీతల గంధం పూసుకున్న మా గుడిసె
చిమ్మటిచ్చిన పీర్ల పండుగ
షర్బత్‌ పటువ అయ్యేది
వానెలిసే దాక కాలు కింద పెట్టనియ్యక
చూరు సుక్కల తాళమేస్తూ
నులక మంచం మీద నిద్ర పుచ్చేది
పచ్చి కట్టెలు ఎగేసుకుంట
ముదునష్టపు వాన ఎప్పుడు పోతదో
అని దాది తిడుతుంటే
వాన మిత్రున్ని వెనకేసుకొస్తూ ఎర్రమన్నలికిన
మూడు రాళ్ళ పొయ్యిల
చిట పటమని అగ్గి రాజేసి
ఎసరు వంపిన గంజి నీళ్ళతోనైనా
కడుపు నింపేది
మాపటికి సుట్టాలెవలన్న వస్తరేమోనని
కుడిబాజు వాసానికి యాలాడే
జనపనార ఉట్టిల
బువ్వకుండ నెత్తుకుని ఎదురుచూసేది
అక్క పుట్టినప్పుడు వానలకు
మెత్తబడ్డ మట్టి గోడ బయటి బాజుకు కూలినా
గోడ మీదపడ్డా ఈ కట్టం తప్పేదిరా అని
మతిలపడ్డప్పుడల్లా
అమ్మి గోడెళ్ల పోసుకుంటుంటే
ఆడపిల్ల మీద అల్లా వెలుగు
దీవెనలిచ్చినట్టు ఓదార్చేది
ఒకల కడుపుల ఒకల తలకాయపెట్టి
ఒకరి కాళ్ళు ఇంకొకలకు నెత్తి బట్ట జేసి
తల్లితోడ ఎనమండుగురిని సాదింది
అమ్మీ అబ్బా పనికి పోయి అచ్చేటాలకు
ఇల్లు ఆకిలి ఊడ్చి, బువ్వ గిన్నెలు కడిగి
వేడి నీళ్లకు పొయ్యిలో కట్టెలు
ఎగనూకమని చెప్పి
ఒక పక్క పట్నం తుమ్మ చెట్టును
మరో పక్క రేగు చెట్టును మాకు
గస్తీ కాయమని పురమాయించేది
ఎనక బాజున్న చింత చెట్టును
రచ్చ బండ చేసి తీరొక్క జీవాలకు
మా గోలెంల నీళ్లు తాపిచ్చి
వాటి తగాదా తెంపేది
రాత్రంతా చుట్టూ రెక్కల పురుగులు
గోలెం కాడ చిమ్మట్లు దరువందుకుంటుంటే
మట్టి దుగిట్ల కిర్సనాయిల్‌ దీపం పెట్టి
సూరు సందులకెంచి
బంగారు వెలుగు రేఖలు పారిచ్చేది
ఉన్నన్ని రోజులు పక్క బొక్కలు వాసాలు జేసి
ఎన్ను పూస నిట్టాడై నిలబడి
కడుపుల దాసుకున్న అమ్మీనే తల్సుకునేది
మొన్న పీర్ల పండుగకు పోయినపుడు
తనంటే ఎంత పాయిరమో
బీవీ కి చెప్తుంటే కన్నీళ్లు ఒంపుకుంట
తల్లడిల్లుతూ గుండెపై వాలింది !

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -