నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్:
భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్, తారక్ డయాగ్నస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో 139వ ఉచిత మెగా వైద్య శిబిరం.. తూర్కపల్లి మండలం దయ్యం బండ తండా గ్రామం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ..బిపి, షుగర్, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.
గ్రామ ప్రజలకు బీపీ షుగర్ థైరాయిడ్ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన లక్షణాలు, వాటి నివారణకు తీసుకొని వలసిన తగు జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు గ్రామ సర్పంచ్ వాంకుతోడు సుధాకర్ నాయక్, ఉప సర్పంచ్ నవీన్ నాయక్, వార్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి విచ్చేసి గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని, వైద్యులు గ్రామాలకు వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయడంతో పేద ప్రజలకు చాలా ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగించుకోవాలని ఆయన సూచించారు.



