Monday, May 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎబోలా అలర్ట్

ఎబోలా అలర్ట్

- Advertisement -

ఆ దేశాలకు ప్రయాణాలు వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం
పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ
కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప వెళ్లొద్దని సూచన

కాంగో : ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకవేళ ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఉంటే, వారు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కంటే ముందే హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయడం తప్పనిసరని ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఇటీవల ఎబోలా వ్యాప్తిని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అదే సమయంలో ఆఫ్రికా సీడీసీ కూడా కాంగో, ఉగాండాలో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ పరిస్థితిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ’గా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సూచనల ప్రకారం, భారత పౌరులు అత్యవసరం కాని పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతం ఆ దేశాల్లో నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లిన భారతీయులు స్థానిక ప్రభుత్వాల ఆరోగ్య మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరి శుభ్రత, రక్షణ చర్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతేకా కుండా విదేశీ ప్రయాణికులపై విమానాశ్రయా ల్లో ఆరోగ్య తనిఖీలు కఠినతరం చేసే అవకా శాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక స్క్రీనింగ్ కు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

తీవ్రమైన వైరల్ హీమరేజిక్ ఫీవర్
ఎబోలా ఒక తీవ్రమైన వైరల్ హీమరేజిక్ ఫీవర్ అని, ఇది బుండి బుగ్యో వైరస్‌ స్ట్రెయిన్ వల్ల వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఈ స్ట్రెయిన్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ లేదా కచ్చితమైన చికిత్స ప్రస్తుతం అందుబాటులో లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వైరస్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీపీఈ కిట్లు ధరించిన ప్రత్యేక బృందాలు ఖననం చేయాలని అంతర్జాతీయ వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. అయితే ఇప్పటివరకు భారత్‌లో బుండిబుగ్యో స్ట్రెయిన్ ఎబోలా కేసులు ఏవీ నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -