Monday, May 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్తాన్ లోరైలుపై ఆత్మాహుతి దాడి

పాకిస్తాన్ లోరైలుపై ఆత్మాహుతి దాడి

- Advertisement -

24 మంది మృతి
ఈద్‌కు సైనికుల 
ఫ్యామిలీలు వెళ్తుండగా విషాదం
క్వెట్టా సమీపంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు
దాడికి బాధ్యత వహించిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ

కరాచీ : పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. బలోచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టా ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన భారీ బాంబు దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికిపైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించా రు. ఈ ఘటన ఆదివారం ఉదయం చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు ఉన్నట్టు సమాచారం.

ఏం జరిగింది..?
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ క్వెట్టా కంటోన్మెంట్‌ స్టేషన్‌ నుంచి సిటీ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈద్ పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం రైలు బోగీని ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పేలుడు తీవ్రత
పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, రైలు ఇంజిన్‌తో పాటు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అందులో రెండు బోగీలు పూర్తిగా బోల్తా పడ్డాయి. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 10కి పైగా వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల మధ్య చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

నగరంలో హైఅలర్ట్
ఈ ఘటన తర్వాత క్వెట్టా నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు పేలుడు ప్రాంతంలో ప్రజలు గుమిగూడవద్దని పాక్ హోంశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా సాయుధ దళాలను మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్లాల్సిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే స్టేషన్‌లోనే నిలిపివేశారు. ఇదిలా ఉండగా, ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. క్వెట్టా కాంటోన్మెంట్ నుంచి సైనికులను తరలిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బీఎల్ఏ ప్రతినిధి జీయాండ్ బలోచ్ వెల్లడించారు. పాక్ ప్రభుత్వం బలోచ్ ప్రజలను అణచివేస్తోందని, తమ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. తమ మాతృభూమి విముక్తి కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

దాడిని ఖండించిన పాక్ రైల్వే మంత్రి
పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి ఉగ్రవాద చర్య అని వ్యాఖ్యానించారు. దేశంలో భయాందోళనలు సృష్టించడమే ఉగ్రవాదుల లక్ష్యమని అన్నారు. ఇలాంటి దాడులతో దేశ ప్రజల ధైర్యసాహసాలను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను మానవత్వానికి శత్రువులుగా అభివర్ణించిన ఆయన, వారిని కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ గత కొన్నేండ్లుగా మిలిటెంట్ గ్రూపుల టార్గెట్‌గా మారుతోంది. ముఖ్యంగా బలోచ్ రెబల్స్‌, తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఈ రైలుపై పలుమార్లు దాడులకు పాల్పడ్డాయి.

క్వెట్టా నుంచి పంజాబ్ ప్రాంతాలకు సైనికులను తరలించేందుకు ఈ రైలును తరచూ ఉపయోగిస్తుండటంతో మిలిటెంట్లు దీన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.2018లో ఈ రైలుకు సమీపంలో రెండు బాంబులు పేలగా, రిమోట్ కంట్రోల్ సాయంతో దాడి చేసినట్టు అప్పట్లో వెల్లడైంది. 2023లో బోలాన్ జిల్లాలో రైలులో బాంబు పేలి 13 మంది గాయపడ్డారు. అదే ఏడాది మరోసారి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై పేలుడు దాడి చోటుచేసుకుని ఒకరు మరణించారు. 2024లో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2025లో బోలాన్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటన కూడా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వందలాది మంది ప్రయాణికులను భద్రతా దళాలు సురక్షితంగా రక్షించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -