Monday, May 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆర్డీఎస్‌ఎస్‌‌తో అంధకారమే!

ఆర్డీఎస్‌ఎస్‌‌తో అంధకారమే!

- Advertisement -

కేసీఆర్‌ నిలిపివేసిన కేంద్ర స్కీంను నెత్తికెత్తుకున్న రేవంత్‌ సర్కార్‌
ప్రతిపక్ష‍ాలకు 
ఆయుధం ఇచ్చిన వైనం
రాష్ర్టవ్యాప్తంగా స్మార్ట్‌ 
ప్రీ పెయిడ్‌ మీటర్లు
రైతు డిస్కం ఏర్పాటూ 
దానిలో భాగమే
ప్రతి యూనిట్‌‌కు పక్కా లెక్క పేరుతో ప్రయివేటు ఫ్రాంచైజీల ఏర్పాటుకు మార్గం సుగమం
కరెంటు లైన్లు, స్తంబాలు, సబ్‌‌స్టేషన్లు, ట్రాన్స్‌‌ఫార్మర్లు అద్దెకిచ్చుకునే సంస్థలుగా ప్రస్తుత డిస్కంలు
మరో బీఎస్‌ఎన్‌ఎల్‌‌గా మారుతున్న విద్యుత్‌ సంస్థలు

ఎస్ఎస్ఆర్ శాస్ర్తి
విద్యుత్‌ ‌సవరణ చట్టం-2025, విద్యుత్‌ ‌పంపిణీ సంస్థల పునరుద్ధరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌), తెలంగాణ రాష్ర్ట రైతు విద్యుత్‌ ‌పంపిణీ సంస్థ (టీజీఆర్పీడీసీఎల్‌)….ఈ మూడూ ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న అంశాలే. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తున్న విద్యుత్‌ ‌సవరణ చట్టం-2025ను పార్లమెంటులో ప్రతిపక్ష‍ాలు అడ్డుకున్నాయి. దీనితో ఇది చట్టరూపంలోకి రాలేదు. కానీ దానిలోని ‌కార్పొరేట్‌ అనుకూల షరతులను విద్యుత్‌ ‌పంపిణీ సంస్థల పునరుద్ధరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌) పేరుతో కేంద్రం రాష్ర్టాలకు పంపి, అమలు చేయిస్తుంది. దానిలో భాగంగానే 2017లో ఈ స్కీంలో చేరేందుకు అప్పటి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ స్కీంలోని షరతులను అమలు చేస్తే ఐదేండ్లలో రూ.30 వేల కోట్ల నిధుల్ని వివిధ మార్గాల ద్వారా రాష్ర్టానికి సమకూరుస్తామని హామీ ఇచ్చింది. ఆ సొమ్ము కోసం అప్పటి కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఈ స్కీంలో చేరుతూ ట్రైపార్టీ ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చిన షరతుల జాబితాను చూసి రాష్ర్ట ప్రభుత్వం అవాక్కయ్యింది.

ఇవీ షరతులు
కేంద్రం విధించిన షరతుల్లో ప్రధానమైనవి 1. రాష్ర్ట ప్రభుత్వం వివిధ కేటగిరిల ప్రజలకు ఇస్తున్న రాయితీలన్నింటినీ దశలవారీగా ఉపసంహరించుకోవాలి. 2. వ్యవసా య పంపుసెట్ల వద్ద స్మార్ట్‌ ‌మీటర్లు ఏర్పాటు చేయాలి. 3. వ్యవసాయ ఫీడర్లను వేరు చేయాలి. 4. ఎనర్జీ ఆడిట్‌‌ను పక్కాగా నిర్వహించాలి 5. విద్యుత్‌ కొనుగోళ్లు, సరఫరాకు… వసూలు చేస్తున్న బిల్లులకు మధ్య ఎలాంటి ఆర్థిక వ్యత్యాసం ఉండరాదు. 6. గృహ, వాణిజ్య, వ్యవసాయ కనెక్ష‍న్లు అన్నింటికీ తప్పనిసరిగా విడదీసి స్మార్ట్‌ ‌మీటర్లు ఏర్పాటు చేయాలి. 7. దశలవారీగా వాటిని ప్రీపెయిడ్‌ ‌మీటర్లుగా మార్చాలి. 8. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్మార్ట్‌ ‌మీటర్లు ఏర్పాటు చేసి, ఫీడర్ స్థాయిలో మానిటరింగ్ చేయాలి. 9. రాష్ర్టంలో ప్రయివేటు డిస్కంల ఏర్పాటుకు సహకరించాలి. 10. మీటరింగ్‌, బిల్లింగ్‌, కలెక్ష‍న్‌, నిర్వహణ విభాగాలను ప్రయివేటు కంపెనీలకు ఫ్రాంచైజ్‌‌లుగా ఇవ్వాలి. ఈ షరతులపై విద్యుత్ ఉద్యోగులు, పౌర సమాజం భగ్గుమంది. విద్యుత్‌‌రంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరించేందుకే కేంద్రం ఈ తరహా స్కీంలను తీసుకొచ్చిందని ఆందోళనలు నిర్వహించింది. ప్రజాగ్రహం, వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని అప్పటి సీఎం కేసీఆర్‌ ‌రాష్ర్ట ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ట్రైపార్టీ ఒప్పందాన్ని అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆ మేరకు అసెంబ్లీలో చర్చించి తీర్మానం కూడా చేశారు.

మళ్లీ నెత్తికెత్తుకున్న రేవంత్‌ ‌సర్కార్‌
ఇప్పుడు రేవంత్‌ ‌సర్కార్‌ ‌మళ్లీ ఆర్డీఎస్‌ఎస్‌ ‌ను నెత్తికెత్తుకుంది. ఖజానాను కేసీఆర్‌ అప్పుల్లో ముంచారనీ, ప్రభుత్వానికి నిధుల కటకట ఉన్నందున ఆర్డీఎస్‌ఎస్‌ ‌షరతులు అమలు చేసి, కేంద్రం ఇస్తానన్న రూ.30వేల కోట్లు తెచ్చుకోవాలని సంకల్పించింది. దానిలో భాగంగా ఆర్డీఎస్‌ఎస్‌ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‌మంత్రివర్గం ఆమోదంకంటే ముందే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆర్డీఎస్‌ఎస్‌ ‌షరతుల్లో ఒకటైన వ్యవసాయ విద్యుత్‌ ‌వినియోగ లెక్కలు పక్కాగా తేలుస్తామని చెప్తూ ‘రైతు డిస్కం’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ డిస్కం ఏర్పాటుకు సంబంధించి ఈనెల 29న తెలంగాణ విద్యుత్‌ ‌నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)లో బహిరంగ విచారణ జరగనుంది. సెంట్రల్‌ ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ అథారిటీ (సీఈఆర్సీ) నిబంధనల ప్రకారం పనిచేసే టీజీఈఆర్సీ రైతు డిస్కం ఏర్పాటుకు ‘మమ’ అనడమే తరువాయి! ఆ వెంటనే స్మార్ట్‌‌మీటర్ల కథ తెరపైకి వస్తుంది. ఆ మధ్య దావోస్‌ ‌ప్రపంచ వాణిజ్య వేదికలో అదానీ గ్రూప్‌‌తో రాష్ర్ట ప్రభుత్వం వ్యాపార ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత స్కిల్‌ ‌యూనివర్సిటీకి ఆదానీ గ్రూప్‌ ‌రూ.వంద కోట్ల విరాళం ఇవ్వడం, రాజకీయ విమర్శలు రావడంతో వాటిని తిరిగి ఇచ్చేశామని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో విద్యుత్‌ స్మార్ట్‌ ‌మీటర్లు, ఫ్రాంచైజీల వ్యాపారమంతా అదానీ గ్రూపే చేస్తుండటం గమనార్హం.

దేశవ్యాప్తంగా నిరసనలు
ఆర్టీఎస్‌ఎస్‌‌లో చేరిన రాష్ర్టాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేక రాష్ర్టాల్లో అదానీ గ్రూప్‌ ఏర్పాటు చేసిన స్మార్ట్‌ ‌మీటర్లను ఊడబీకి, సామూహిక దహనాలు చేశారు. అనేక పంచాయతీల్లో స్మార్ట్‌ ‌మీటర్లకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఆర్డీఎస్‌ఎస్‌ కింద ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ‌సీఐటీయూ, దాని అనుబంధ సంఘాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు నిలిచిపోయింది. పంజాబ్‌లోనూ స్మార్ట్‌ ‌మీటర్లకు వ్యతిరేకంగా రైతులు ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో రైతులు స్మార్ట్ మీటర్లను తొలగించి విద్యుత్ కార్యాలయాల ఎదుట కుప్పగా విసిరేశారు. హర్యానాలో రైతు మహాపంచాయతీల్లో స్మార్ట్ మీటర్లు అనుమతించబోమని తీర్మానాలు చేశారు. ఉత్తరాఖండ్‌‌లో రైతులు, పోలీసుల మధ్య స్మార్ట మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే జరిగింది. మహారాష్ట్రలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక సంస్థల్లో ప్రజాసంఘాలు నిరసనలు చేశాయి. ఇలా దేశంలో ఎక్కడ ఆర్డీఎస్‌ఎస్‌ అమలైనా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్‌ఎస్‌ అమలు, రైతు డిస్కం నిర్ణయాలతో ప్రభుత్వం ప్రతిపక్ష‍ాలకు బలమైన ఆయుధాలను అందించినట్టు అయ్యింది.

అద్దె సంస్థలుగా డిస్కంలు
ఆర్డీఎస్‌ఎస్‌ అమలైతే ప్రస్తుతం ఉనికిలో ఉన్న రెండు డిస్కంల పనితీరు మారుతుంది. విద్యుత్‌ ‌కొనుగోళ్లు సహా అనేక మార్పులు జరుగుతాయి. విద్యుదుత్పత్తి సంస్థ అయిన టీజీ జెన్‌‌కో కొత్తగా నైవేలీ లిగ్నేట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎల్‌‌సీ ఇండియా) లిమిటెడ్‌ ‌నుంచి 200 మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్‌‌ను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. ఎన్‌ఎల్‌‌సీ ఇండియా గుజరాత్‌‌లోని కచ్‌ ‌సోలార్‌ ‌ప్రాజెక్ట్‌ ‌ద్వారా ఉత్పత్తి చేసే ఈ విద్యుత్‌‌ను తెలంగాణ జెన్‌‌కో కొనుగోలు చేస్తున్నది. సహజంగా విద్యుత్‌‌ను డిస్కంలు కొనుగోలు చేస్తాయి. కానీ ఇప్పుడు విద్యుదుత్పత్తి సంస్థ అయిన జెన్‌‌కోనే కొనుగోళ్లు చేస్తుండటం గమనార్హం. యూనిట్‌ ‌రూ.2.75 పైసలు చొప్పున విద్యుత్‌ ‌కొనేందుకు 2025లోనే తెలంగాణ విద్యుత్‌ ‌నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అనుమతి ఇచ్చింది. తెలంగాణ విద్యుత్‌ ‌పంపిణీ సంస్థలే (డిస్కంలు) జెన్‌‌కో ద్వారా ఈ కొనుగోళ్లను ప్రతిపాదించడం విచిత్రం. ఇలాంటి చిత్రాలు ఆర్డీఎస్‌ఎస్‌ అమల్లో ఇంకా అనేకం ఉన్నాయి. డిస్కంలు తమ సొంత సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న కరెంటు సబ్‌‌స్టేషన్లు, ట్రాన్స్‌‌ఫార్మర్లు, లైన్లు, కరెంటు పోల్స్ వంటి మౌలిక వసతులను ఓపెన్‌ ‌యాక్సెస్‌ ‌పేరుతో అద్దెలకు ఇచ్చుకొనే సంస్థలుగా మారే ప్రమాదం ఉన్నదని విద్యుత్‌‌రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రభుత్వరంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌‌ను ఉదాహరణగా చూపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -