హైదరాబాద్‌లో గుడిసెలు వేసుకున్న 20 వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
రైతు భరోసా నిధులను విడుదల చేయండి
సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కనీస వేతనాల పెంపు శాస్ర్తీయ పద్ధతిలో జరగలేదనీ, వెంటనే ఈ విషయంపై పున: సమీక్షించి సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. అందులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం. బాలనరసింహ, వీ.ఎస్.బోస్ పాల్గొన్నారు. సీఎం భేటీలో చర్చకు వచ్చిన అంశాలను కూనంనేని సాంబశివ రావు మీడియాకు వివరించారు. కార్మికులకు కనీస వేతనాల పెంపును స్వాగతిస్తున్నామన్నారు. అయితే, “కనీస వేతనాల కమిటి” సిఫారసులను పరిగణనలోనికి తీసుకోకుండా వేతనాలు పెంచడాన్ని తప్పుబట్టారు. వేతనాల పెంపులో ప్రస్తుతం ఇస్తున్న వేతనాల కంటే కొత్త వేతనాలు తక్కువగా ఉన్నాయని ఎత్తిచూపారు.
వాటిని పున:సమీక్షించి సవరించాలని సీఎంను కోరామని చెప్పారు. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని సీఎంను కోరామన్నారు. రబీకి సంబంధించి రైతు భరోసాను పూర్తిస్థాయిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్క జొన్న కొనుగోలు చేయడాన్ని అభినందిస్తున్నామనీ, అయితే, మొక్కొజన్న డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకతీతంగా పేదలకు అందేందుకు గ్రామసభలలో అర్హులను గుర్తించి, ఆ గ్రామానికి కేటాయించిన ఇండ్లకు లబ్ధిదారులను లాటరీ ద్వారా గుర్తించాలని సూచించామన్నారు. భూదాన భూములలో ప్రభుత్వ స్థలలాలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలనీ, గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 20వేల మంది గుడిసెలు వేసుకున్న పేదలకు కోర్టు కేసులు పరిష్కరించి ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీఎంబర్స్‌మెంటును కొనసాగించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని విన్నవించారు.
కనీస వేతనాల పెంపును సవరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



