ఐపీఎల్19 క్వాలిఫయర్ 1 పోరు నేడు
రాయల్ చాలెంజర్స్, టైటాన్స్ అమీతుమీ
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 19వ సీజన్ ఆఖరు అంకానికి చేరుకుంది. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు రసవత్తరంగా ముగియగా నేటి నుంచి కీలక ప్లే ఆఫ్స్ ఆరంభం కానున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌లు ఫైనల్‌కు చేరుకునేందుకు రెండు అవకాశాలను దక్కించుకున్నాయి. నేడు ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్, టైటాన్స్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఫైనల్‌కు చేరుకునేందుకు క్వాలిఫయర్2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.
నవతెలంగాణ- ధర్మశాల
ఐపీఎల్19 సీజన్ ఆరంభం నుంచి నిలకడగా విజయాలు సాధిస్తూ ఆకట్టుకున్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. లీగ్ దశ ప్రథమార్థం ఆఖర్లో బెంగళూరు చేతిలో ఓటమితో సంప్రదాయ ఆటతీరుకు స్వస్తి పలుకుతూ వరుస విజయాలు సాధించిన జట్టు గుజరాత్ టైటాన్స్. ఇప్పడు ఈ రెండు జట్లు ఫైనల్లో చోటు కోసం నేడు క్వాలిఫయర్1లో పోటీపడుతున్నాయి. బ్యాట్‌తో, బంతితో దుర్బేద్యంగా కనిపిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
భీకర ఫామ్‌లో బెంగళూరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సీజన్‌లో టాప్-2లో నిలిచింది. ప్రథమార్థంలో ఐదు విజయాలు, ద్వితీయార్థంలో నాలుగు విజయాలు నమోదు చేసిన ఆర్‌సీబీ.. అన్ని రంగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. ఫిల్ సాల్ట్ గాయంతో బాధపడుతున్నా.. వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఆ జట్టుకు మరో ప్రమాదకర ఓపెనర్ అందుబాటులోకి వచ్చాడు. విరాట్ కోహ్లి పరుగుల వేట ఈ సీజన్లోనూ కొనసాగుతుంది. దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ మిడిల్ ఆర్డర్‌లో ప్రత్యర్థులకు సింహస్వప్నం అవుతున్నారు. వికెట్‌కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయటం, టార్గెట్ ఛేదిస్తే కొన్ని బంతులు ఉండగానే లాంఛనం ముగించటం రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ లైనప్‌కు అలవాటుగా మారింది. జితేశ్ శర్మ, టిమ్ డెవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఆర్‌సీబీ సొంతం. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో నిలిచాడు. జోశ్ హాజిల్‌వుడ్ జతగా కొత్త బంతితో పవర్‌ప్లేలో ఈ జోడీ మాయ చేస్తోంది. డెత్ ఓవర్లలోనూ భువనేశ్వర్ కుమార్ గొప్పగా రాణిస్తున్నాడు. రసిఖ్, కృనాల్ పరుగుల పొదుపుపై నేడు ఫోకస్ ఉండనుంది.
సమిష్టితత్వమే బలం
గుజరాత్ టైటాన్స్ సీజన్‌ను సంప్రదాయ బ్యాటింగ్ శైలితో మొదలెట్టింది. వికెట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో ఆ ప్రభావం స్కోరు బోర్డుపై పడింది. వేగంగా వ్యూహం మార్పు చేసుకున్న టైటాన్స్.. ధనాధన్‌పై ఫోకస్ పెట్టింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ నిలకడగా రాణిస్తున్నారు. టైటాన్స్ స్కోరులో ఈ ఇద్దరి వాటానే ఎక్కువ. ఆరంభంలో వికెట్ పడితే జోశ్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ నెమ్మదిగా ఆడుతున్నారు. ఈ బలహీనతపై నేడు భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదు. జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియ, నిశాంత్ సింధు ఆశించిన ప్రదర్శన చేయాల్సి ఉంది. స్పిన్‌కు అనుకూలించని పిచ్‌పై రషీద్ ఖాన్ మ్యాజిక్ ఎలా చేస్తాడో చూడాలి. కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ ద్వయం రాయల్ చాలెంజర్స్‌కు నేడు సవాల్ విసరనున్నారు. కొత్త బంతితో రబాడను నిలువరించటం నేడు బెంగళూరుకు కఠిన సవాల్‌గా మారనుంది.
పిచ్, వాతావరణం
క్వాలిఫయర్1 పోరుకు ధర్మశాలలో బ్యాట్‌కు, బంతికి సమతూకం ఉండే పిచ్‌ను సిద్ధం చేశారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, చిన్న బౌండరీలు బ్యాటర్లకు అదనపు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. గుడ్డిగా ఊపినా.. బంతి స్టాండ్స్‌లోకి దూసుకెళ్తోంది. ఇక్కడ టార్గెట్‌లను కాపాడుకోవటం శక్తికి మించిన పని. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా):
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, టిమ్ డెవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫ్ఫీ, జోశ్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలామ్.
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోశ్ బట్లర్, వాషింగ్టన్ సుందర, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియ, రషీద్ ఖాన్, నిశాంత్ సింధు, అర్షద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
తొలి అడుగు ఎవరిదో?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



