Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫ్రూట్ మార్కెట్ నిర్మాణంలో ఉద్రికత్త

ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంలో ఉద్రికత్త

- Advertisement -


జేసీబీలను అడ్డుకున్న కోహెడ రైతులు, బాధితులు
మా భూముల్లో మా అనుమతి లేకుండా పనులెలా చేస్తారంటూ ఆగ్రహం
భారీ పోలీసు బందోబస్తు
జూన్‌ 3‌న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనకు అధికారుల ఏర్పాట్లు
నవతెలంగాణ-తుర్కయంజాల్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ తొర్రూరు డివిజన్ పరిధిలోని కోహెడ గ్రామంలో ప్రతిపాదిత గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ నిర్మాణ ప్రాంతం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కోహెడ సర్వే నెంబర్ 167/1లో దాదాపు 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోందంటూ రైతులు ఆందోళన చేపట్టారు. సుమారు 39 ఎకరాల ఏక్సాల్ పట్టా భూమిలో 49 మంది రైతులు వ్యవసాయం చేసుకుటున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ భూమిలోనే గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. జూన్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా సోమవారం రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో జేసీబీలను రంగంలోకి దింపి భూమిని చదును చేసే పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న కోహెడ గ్రామ రైతులు, భూ బాధితులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ వృద్ధ మహిళ జేసీబీకి అడ్డుగా పడుకుంది. దాంతో రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. “మా భూమిలో మా అనుమతి లేకుండా పోలీసుల సహాయంతో పనులు ఎలా చేపడతారు?” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, అదనపు డీసీపీ కోటేశ్వర్, ఏసీపీ కాశిరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మెన్‌ చిలుక మధుసూదన్ రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి తదితరులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. “మేము తరతరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులను భయపెట్టి భూములను లాక్కోవాలని చూస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.“ఫ్రూట్ మార్కెట్ పేరుతో సాగు భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం సరైంది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని వదులుకోం” అని కోహెడ భూ బాధితుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని భూ బాధితులకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో అధికారులు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -