Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం ఊర్లో వైభవం.. 
ఇతర ఊర్లు గుంతలమయం

సీఎం ఊర్లో వైభవం.. 
ఇతర ఊర్లు గుంతలమయం

- Advertisement -


సీపీఐ(ఎం) రాష్ట్ర నేత భూపాల్‌
నారాయణపేట జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ, ధర్నాన
నవతెలంగాణ – నారాయణపేట

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామ కొండారెడ్డిపల్లిని రూ.200 కోట్లతో వైభవంగా తీర్చిదిద్దుతున్నారని, ఈ ప్రాంతంలోని మిగతా ఊర్ల రోడ్లు మాత్రం గుంతలమయంగా ఉన్నా పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌ అన్నారు. అధ్వానమైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ పార్కు దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భూపాల్‌ మాట్లాడుతూ.. నారాయణపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా రోడ్లు గుంతలే కనిపిస్తున్నాయని, అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను కూడా పూర్తి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 514 కుటుంబాలు ఉన్న సీఎం స్వగ్రామంలో ప్రతి కుటుంబానికీ సోలార్‌ సిస్టం, అంతర్గత మురుగునీటి వ్యవస్థను ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయించారని తెలిపారు. కానీ పురాతనమైన నారాయణపేట మొదటి మున్సిపాలిటీలో అంతర్గత మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ధ్యాసే లేదన్నారు. పక్కనున్న కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికీ డబుల్‌ రోడ్డు వేస్తున్నారని, తన నియోజకవర్గం, సొంత గ్రామంపై ఉన్న ప్రేమ పక్కనే ఉన్న నారాయణపేట నియోజకవర్గంపై ఎందుకు లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి అయినా రవాణా వ్యవస్థ అభివృద్ధికి సూచిక అన్నారు. రోడ్డు, రైల్వే, విమానయానం తదితర రవాణా సౌకర్యాలకు నారాయణపేట ప్రజలు నోచుకోవడం లేదన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. మక్తల్‌, మరికల్‌, కోయిలకొండ, యానగుంది, మద్దూర్‌ ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయని, వాటిని అభివృద్ధి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ల సమస్యలపై సర్వేలు చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నామన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లోని ఏవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండమీది బలరాం, గోపాల్‌, అంజిలయ్య గౌడ్‌, పుంజనూరు ఆంజనేయులు, నాయకులు గుండెగారి దస్తప్ప, జోషి, గోవిందరాజ్‌, కాశప్ప నరహరి, మహేష్‌ కుమార్‌గౌడ్‌, బొమ్మను పాడు బలరాం, పవన్‌, మల్లేష్‌, గోవిందు పాల్గొన్నారు.
​




- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -