అర్హులందరికీ ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మహాధర్నా
నవతెలంగాణ-గాంధీచౌక్
అర్హులైన కొత్త లబ్దిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, పింఛన్ మొత్తాన్ని రూ.2,016 నుంచి రూ.4,016కు పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని, ఖమ్మం నగర ప్రజలపై విధించిన ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బుగ్గవీటి సరళ మాట్లాడారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైతే.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పట్ల అహంకారంగా వ్యవహరిస్తూ సంక్షేమంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆ ప్రజలే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపుతారని అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని వెంటనే అమలు చేయాలని, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకుపైగా పెంచాలని డిమాండ్ చేశారు. పింఛన్ల వెరిఫికేషన్ పేరుతో అర్హులైన వారి పేర్లు తొలగిస్తే సహించబోమన్నారు.
ఖమ్మం నగర ప్రజలపై అధిక ఇంటి పన్నుల భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు తగ్గించకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒకేసారి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని పలు ప్రజా సమస్యలపై జిల్లా మంత్రి, కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సాధారణ ప్రజల జీవితం రోజురోజుకూ ఆర్థిక ఇబ్బందుల్లోకి చిక్కుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పెంచుతోందని విమర్శించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, నాయకులు ఎంఏ.జబ్బార్, ఎస్‌కే మీరా సాహిబ్, దొంగల తిరుపతిరావు, ఎస్. నవీన్‌రెడ్డి, బండారు రమేష్, ఎస్‌కే నాగుల మీరా, బోడపట్ల సుదర్శన్, ఉపేందర్, వజేనేపల్లి శ్రీనివాసరావు, పి.నాగసులోచన, మాజీ కార్పొరేటర్లు ఎల్లంపల్లి వెంకట్రావు, యర్రాగోపీ, నాయకులు ప్రవీణ్, మధు పాల్గొన్నారు.
పింఛన్ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



