Wednesday, May 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఢిల్లీ క్వాడ్ సమావేశం- చతుష్టయ మైండ్‌‌గేమ్‌!

ఢిల్లీ క్వాడ్ సమావేశం- చతుష్టయ మైండ్‌‌గేమ్‌!

- Advertisement -

మహాభారతంలో నలుగురిని దుష్ట చతుష్టయం అని పిలిచారు. వారు దుర్మార్గానికి పాల్పడ్డారు గనుక దుష్ట అని విశేషణాన్ని చేర్చారు. అమెరికా,భారత్, జపాన్, ఆస్ట్రేలియా భద్రత చర్చలు జరపాలని నిర్ణయించు కున్నందున చతుర్భుజ భద్రతా సంప్రదింపులు(క్వాడ్రలేటరల్ సెక్యూరిటీ డైలాగ్-క్వాడ్) అని పేరు పెట్టారు. పదే పదే అంత పెద్ద పేరుతో పలకలేం గనుక చతుష్టయం అందాం. మంగళవారం నాడు మన విదేశాంగమంత్రి జై శంకర్ ఆహ్వానం మేరకు చతుష్టయ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. లోపల ఏం మాట్లాడుకున్నారో పైకి ఏం చెప్పారన్నదాని గురించి పెద్దగా బుర్రలు బద్దలు చేసుకోనవసరం లేదు. ముందుగా ఈ సమావేశం గురించి పెద్దగా చర్చలు కూడా జరగలేదు గనుక సాదాసీదా సమావేశంగానే మీడియా భావించిందని చెప్పాలి. ఈ సందర్భంగా కొత్తగా చెప్పిన అంశాలు కూడా ఏమీ లేవు. పైకి ఏమి చెప్పినా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛగా నౌకారవాణా జరగాలన్నది ఈ కూటమి అజెండాలో ఒకటి. ప్రపంచాన్ని పక్కదారి పట్టించేందుకు లేని సమస్యను ఉన్నట్లుగా చూపే ఒక మైండ్ గేమ్. సోవియట్ యూనియన్‌తో ఐరోపాకు ముప్పు పొంచి ఉందంటూ నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లుగానే ఆ ప్రాంతంలో చైనా ముప్పు గురించి ప్రచారం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే ఎవరైతే ఈ డిమాండ్ చేస్తున్నారో ఆ దేశాల్లో ఒకటైన అమెరికా తన ఇరుగూ కాదు పొరుగూ కాదు, ఖండమూ కాదు, పదివేల కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న హార్ముజ్ జలసంధిలో ఆయుధాలను చూపి నౌకల దిగ్బంధాన్ని అమలు జరుపుతూ మరోవైపు చైనా పెరటితోట వంటి దక్షిణ చైనా సముద్రం గురించి తేల్చాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇంతవరకు ఏ ఒక్క నౌకనూ అడ్డుకున్న ఉదంతం లేదు.

నిజానికి చతుష్టయ కూటమి దేశాల మధ్య అవగాహన తప్ప ఎలాంటి ఒప్పందమూ లేదు. తొలుత 2002 భారత్ మినహా మూడు దేశాలు త్రిపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. తరువాత ఐదేండ్లకు భారత్ చేరింది. దీన్ని మరికొన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలని చూసినప్పటికీ ఏ దేశమూ ముందుకు రాలేదు. తరువాత పదేండ్ల పాటు దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు, ప్రకటనలు చేస్తున్నారు.2021 నుంచి ఏటా ఒక సభ్యదేశంలో కూటమి అగ్రనేతల సమావేశాలు, దానికి ముందు విదేశాంగ మంత్రుల సన్నాహక సంప్రదింపులు జరుపుతున్నారు. ఆరుసార్లు అధినాయక సభలు జరగ్గా రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సులు, రెండుసార్లు జపాన్‌లో, మరో రెండుసార్లు అమెరికాలో జరిగాయి.2024జూన30 నుంచి జూలై రెండవ తేదీ వరకు కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌ డిసిలో జరిగింది.డోనాల్డ్ ట్రంప్ మనతో సహా అనేక దేశాలపై పన్నుల యుద్ధం ప్రకటిం చటంతో గతేడాది సమావేశం జరగలేదు. తనకు వ్యతిరేకంగా జతకట్టడటంగా చైనా పరిగణిస్తుండగా, ఆసియా నాటో కూటమి అని రష్యా అంటున్నది, ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. పైకి ఎవరు ఏమి చెప్పినప్పటికీ చైనాను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం. దక్షిణ చైనా సముద్రంలోనికొన్ని దీవుల గురించి జపాన్, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. అయితే ఏ ఒక్కదేశపు నౌకనూ చైనా మలేసి(అడ్డుకున్న)న ఉదంతం లేదు. అయినప్పటికీ స్వేచ్ఛా రవాణా పేరుతో అమెరికా నాటకం ఆడుతోంది.ఇతర దేశాలను కూడగట్టేందుకు చూస్తోంది.ఆసియా‘పసిఫిక్ లేదా ఇండో’ పసిఫిక్ ప్రాంతంలో తమ పెత్తనం సాగాలన్నది దాని అసలు లక్ష్యం. ఇరాన్-అమెరికా మధ్య తలెత్తిన పోరు నేపధ్యంలో సంధి గురించి చర్చలు ఒకవైపు మరోవైపు విదేశాంగ మంత్రుల సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. అమెరికా మంత్రి మార్కో రూబియో, జపాన్ మంత్రి టోషిమిట్సు మోటెగీ, పెనీ వాంగ్(ఆస్ట్రేలియా) పాల్గొంటుండగా జై శంకర్ అధ్యక్షత వహించారు.

నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన రూబియో ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్చగా, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పాడు. ఇలాంటి సమావేశాలను భావసారూప్యత కలిగిన దేశాలతో ఏదో మొక్కుబడిగా జరపటం కాకుండా అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. నౌకా రవాణా, కీలకమైన ఖనిజాలు,లోహాల వంటి అంశాలపై నిర్దిష్ట కార్యాచరణకు పూనుకుంటామని రూబియో అన్నాడు.ఈ ఏడాది ముగిసేలోగా నలుగురు అగ్రనేతల భేటీ ఉంటుందన్నాడు. గతేడాది వాషింగ్టన్‌లో జరిగిన సమావేశ చర్చల కొనసాగింపు ఉంటుందని మన విదేశాంగశాఖ ఢిల్లీ సమావేశం గురించి చెప్పింది. చతుష్టయ కూటమి లక్ష్యాలుగా ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్టబద్దమైన పాలన వంటి కబుర్లు చెబుతున్నది. వీటన్నింటినీ అమెరికా ఉల్లంఘిస్తున్నది. చట్టబద్దంగా ఎన్నికైన వెనెజులా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్ చేసి తమ దేశానికి తీసుకుపోయి తప్పుడు కేసులతో విచారణ జరుపుతున్నది. అక్కడ ఉన్న చమురు సంపదలన్నింటినీ తన దేశ కంపెనీలకు అప్పగించింది. ఇరాన్‌లో ఉన్న ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి వేరే పాలకులను ఏర్పాటు చేస్తామని వాషింగ్టన్ బహిరంగంగా ప్రకటించటమేగాక దానిలో భాగంగా సుప్రీం నేత ఖమేనీ, ఇతర అనేక మందిని చంపివేయటంతో పాటు దాడులు కూడా చేసిన సంగతి తెలిసిందే. గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని బరితెగించి సమర్ధించిన అమెరికా మానవహక్కుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలను వల్లించినట్లే.ఇది సైనిక కూటమి కాదని చెప్పినప్పటికీ మన దేశ ఆధ్యర్యంలో నాలుగు దేశాల మిలిటరీ మలబార్ సైనిక విన్యాసాలు జరిపాయి.

చైనాను కట్టడి చేయాలని నాలుగుదేశాల నేతలకూ ఉన్నప్పటికీ పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న సమస్య ఉంది.ఆర్థిక రంగాల్లో సహకరించుకొనేందుకు అనేక వేదికలు ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు.ఒక వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాయి. ఆర్థిక, మిలిటరీ రంగాలలో ఏ ఒక్క దేశానికీ పోలిక లేదు, అసమానతలు ఉన్నాయి. చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకుపోయి తెగేంతవరకు లాగేందుకు ఎవరూ సిద్ధంగా లేరు ప్రత్యేకించి భారత్, ఆస్ట్రేలియాలు అలాంటి వైఖరిని కనపరిచాయి. ఆర్థిక రంగంలో మిగిలిన మూడు దేశాలను నమ్ముకున్న భారత్‌కు ఆశించిన మేరకు పెట్టుబడులు రాలేదు. దీంతో గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత ఐదేండ్ల పాటు నామమాత్ర సంబంధాలను మాత్రమే కొనసాగించిన మనదేశం ఇప్పుడు పెట్టుబడులకు ఆహ్వానం పలకటంతో సహా సాధారణ సంబంధాలను పునరుద్ధరించుకుంది. అటువంటపుడు చైనా వ్యతిరేకత అనే ఎర్రగీతను దాటి ముందుకు పోయే స్థితి లేదు. తక్షణం పరిష్కరించాలని భావిస్తున్న ప్రాంతీయ సమస్యల తీవ్రతను తగ్గించే అవకాశాలు కూడా లేవని ఇన్ని సంవత్సరాల అనుభవం నేర్పింది.పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడి చేసి దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక అమెరికా గిలాగిలా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికాకు ఏ ఒక్క దేశమూ మద్దతుగా నిలవకపోగా ఇరాన్‌కు మద్దతుగా చైనా వ్యవహరిస్తున్నది, భద్రతా మండలిలో దాన్ని కాపాడిన తీరు తెలిసిందే.
చతుర్భుజ భద్రతా చర్చల పేరుతో వ్యవహరిస్తున్నవారు ఇప్పుడు ఇతర అంశాల మీద కేంద్రీకరించటాన్ని బట్టి ఈ కూటమి దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత వెల్లడి అవుతున్నది.

కొందరు సాధువులు రాత్రికి ఒక చోట చేరి ప్రతి రోజూ గంజాయిదమ్ము కొట్టేవారు. అది తలకు ఎక్కగానే తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలి, ఈ బతుకు ఎంతకాలం అంటూ ప్రగల్భాలు పలికేవారట. తెల్లారేసరికి దమ్ముదిగి ఎవరి కర్రా బుర్రా తీసుకొని వారు ఊరు మీదకు వెళ్లేవారు. చైనా పేరు పెట్టకుండా దాన్ని ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్ పద్ధతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ప్రతి సమావేశంలో మాట్లాడుతుంటారు. నాలుగు దేశాల నేతలు సమావేశమైనపుడు పరోక్షంగా చైనా మీద మాటలదాడిలో ఎవరూ తక్కువ తినటం లేదన్నది గతసమావేశాల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. చైనా నుంచి తలెత్తిన ముప్పు పేరుతో చేస్తున్న ప్రచారానికి దానితో సంబంధాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. అలాంటి దేశంతో లావాదేవీలు తగ్గించుకోక పోగా ఇంకా పెంచుకొనేందుకు ప్రతిదేశమూ విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నది. ఉదాహరణకు 2014లో మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో చైనా 38 బిలియన్ డాలర్ల మేరకు మిగులు ఉండగా 2026నాటికి 116 బిలియన్ డాలర్లకు చేరింది. చైనా వస్తువుల దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు. గతేడాది ట్రంప్ మనపై పన్నుల దాడి ప్రారంభించినపుడు నరేంద్రమోడీ చైనా పర్యటనలో షీ జిన్‌పింగ్, పుతిన్‌తో కలసి అవసరమైతే తాము ఏకమౌతామనే సంకేతాన్ని ఇచ్చిన సంగతిని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.

చైనాను మింగేస్తాం, నలిపేస్తాం అంటూ కొండంత రాగం తీసిన ట్రంప్ ఈ నెలలోనే పెద్ద సంఖ్యలో తన కార్పొరేట్ అధిపతులను బీజింగ్ పర్యటనకు తీసుకువెళ్లి సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అది వాణిజ్య పర్యటన తప్ప మరొకటి కాదు. విలువైన ఖనిజాల ఉత్పత్తులను చైనా బంద్ చేయటంతో తిరిగి కాళ్లబేరానికి రావటాన్ని చూశాము. గతేడాది ఆస్ట్రేలియాలో లోవీ సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా తమకు ఆర్థిక భాగస్వామితప్ప ముప్పుదేశం కాదని మెజారిటీ అభిప్రాయపడినట్లు తేలింది. చైనా అనేక దేశాలతో వాణిజ్య మిగులుతో ఉంటే ఆస్ట్రేలియా అదే చైనాతో 2025లో 4.21 బిలియన్ డాలర్లు మిగులులో ఉంది. అందువలన అది చైనాతో తగాదాకు ఏమాత్రం సి‌ద్ధ పడటం లేదు. ఉత్తర కొరియాను చూసి జపాన్ భయపడుతున్నది తప్ప చైనాతో వాణిజ్యాన్ని వదులు కొనేందుకు సిద్దంగా లేదు. అమెరికా కనుసన్నలలో నడిచే దక్షిణ కారియా పరిస్థితి అంతే. ఢిల్లీ సమావేశంకోసం వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు ఎంత చమురు కావాలంటే అంత సరఫరా చేస్తామంటూ బిస్కెట్ వేశారు.మన అవసరాలకు ప్రతిదేశం నుంచి చమురు కొనుగోలు చేయాల్సి ఉంది.అలాగాక అమెరికాను నమ్మి మిగిలిన దేశాలను వదలివేస్తే పరిస్థితి తారుమారైతే అమెరికన్లు మన జట్టుపట్టుకుంటారు, తమ కాళ్ల ముందు పడేట్లు చేసుకుంటారు. రూబియో ఢిల్లీలో మాట్లాడుతూ విలువైన లేదా కీలక లోహాలపై ఒక ఏర్పాటును ప్రకటిస్తామని, పరస్పర సహకారం, పెట్టుబడులు సరఫరాలను సమన్వయం చేసుకుంటామని చెప్పాడు. ఇండో-పసిఫిక్ ఇంథన భద్రతను కూడా పటిష్టపరుస్తామన్నాడు. ఇంకా ఇండో-పసిఫిక్ నౌకా నిఘా సహకారం పెంచుకుంటామని చెప్పాడు. ఇలాంటి సాధారణ విషయాలు తప్ప ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామమేదీ ఢిల్లీ సమావేశంలో జరగలేదు!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -