వరల్డ్ నం.5పై మెరుపు విజయం
సింగపూర్ ఓపెన్ సూపర్ 750
సింగపూర్ : భారత సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ సంచలన విజయం సాధించాడు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో వరల్డ్ నం.5 జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)పై ప్రణయ్ మెరుపు విజయం సాధించాడు. గంటకు పైగా హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 10-21, 21-12, 21-18తో హెచ్.ఎస్ ప్రణయ్ విజయం సాధించాడు. తొలి గేమ్‌లో 3-3 తర్వాత తడబడిన ప్రణయ్ వరుస పాయింట్లు కోల్పోయాడు. ఆరంభంలోనే ఆధిక్యం సాధించిన జొనాథన్ క్రిస్టీ 21-10తో తొలి గేమ్‌ను అలవోకగా ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్టీ గెలుపు లాంఛనం అనుకున్న తరుణంలో ప్రణయ్ పంజా విసిరాడు. ఒత్తిడిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచే ప్రణయ్ సింగపూర్ ఓపెన్‌లో మెప్పించాడు. కీలక రెండో గేమ్‌లో విరామ సమయానికి 11-7తో ముందంజ వేసిన ప్రణయ్ ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ ప్రణయ్ మెప్పించాడు. జొనాథన్ క్రిస్టీ సైతం పుంజుకోవటంతో ప్రతి పాయింట్ కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. విరామ సమయానికి 11-10తో ఓ పాయింట్ ముందంజ వేసిన ప్రణయ్‌ని 13-13తో క్రిస్టీ సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా స్కోర్లు సమం అవుతూ సాగింది. 18-18తో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకోగా ప్రణయ్ అద్భుత ఆటతీరు కనబరిచాడు. ర్యాలీలు, స్మాష్‌లతో క్రిస్టీని ఉక్కిరిబిక్కరి చేస్తూ 21-18తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 20-22, 21-19, 17-21తో సింగపూర్ షట్లర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టో జోడీ 21-14, 20-22, 21-13తో మూడు గేముల మ్యాచ్‌లో మలేషియా షట్లర్లపై గెలుపొంది ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్ 21-11, 19-21 12-21తో చైనీస్ తైపీ షట్లర్ లిన్ చేతిలో ఓటమి చెందింది.
ప్రణయ్ సంచలనం
- Advertisement -
- Advertisement -



