కేరళం మాజీ సీఎం పినరయి ఇంటిపైకి ఉసిగొల్పిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
మనీలాండరింగ్ అంటూ నిరాధార ఆరోపణలు
ఆయన అల్లుడితో పాటు మరో
పదిమంది ఇండ్లపైనా దాడులు
భగ్గుమన్న కేరళం
తీవ్రంగా ప్రతిఘటించిన ప్రజలు
‘ఈడీ గో బ్యాక్’ అంటూ నినాదాలు
రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు
రాజకీయ దురుద్దేశంతోనే : సీపీఐ(ఎం)
తిరువనంతపురం/న్యూఢిల్లీ : కేరళంలో బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర కలయిక బట్టబయలైంది. ఇద్దరూ కలిసి మాజీ సీఎం పినరయి విజయన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పార్టీ అధికారంలోకి రాగానే, కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై అర్థంపర్థం లేని ఓ పాత కేసులో మనీ లాండరింగ్ అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను బుధవారం ఉదయం విజయన్ ఇంటిపైకి ఉసిగొల్పారు. విజయన్‌తో పాటు ఆయన సన్నిహితులకు చెందిన మరో పది చోట్లకూడా ఏకకాలంలో దాడులు చేయించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈడీ దాడులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు బహిరంగంగానే సీపీఐ(ఎం)కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కేరళం ప్రచారానికి వెళ్లి, పినరయి విజయన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేసివచ్చారు. తాజాగా కాంగ్రెస్, బీజేపీల సంయుక్త డైరెక్షన్‌లో ఈ దాడులు జరిగాయి. ఈ విషయం తెలియగానే కేరళం ప్రజానీకం భగ్గుమంది. విజయన్‌కు అండగా నిలిచింది. వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయన ఇంటికి చేరుకున్నారు. గేటు ముందు బైఠాయించి, ‘ఈడీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర భద్రతా బలగాల పహారాలో దాడులకు వచ్చిన ఈడీ అధికారుల్ని ఓ దశలో నిర్భందించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు ఓవర్‌యాక్షన్ చేశాయి. దీంతో కొందరు ఆందోళనకారులు ఈడీ అధికారుల కార్లపై రాళ్లు విసిరారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలోని బేకరి జంక్షన్ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఈడీ అధికారులు ఆ ఇంటిపైనే దాడులు చేశారు.
ఆ సమయంలో ఇంట్లో విజయన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. అధికారుల దాడులకు మాజీ సీఎం కుటుంబం సంపూర్ణంగా సహకరించింది. అన్ని గదుల్లోకి ఈడీ అధికారుల్ని తీసుకెళ్లి, సోదాలు చేసుకోమని స్వేచ్ఛగా వదిలేశారు. ఇక కేసు విషయంలోకి వస్తే 2017-21 మధ్య కాలంలో ఓ ప్రయివేటు మైనింగ్ కంపెనీ కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) నుంచి విజయన్ కుమార్తె, మాజీ ఐటీ కన్సల్టెంట్ టీ వీణ ఆమెకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు అక్రమంగా రూ.1.72 కోట్లు నగదు బదిలీచేశారనేది అభియోగం. ఈ ఆరోపణలను అప్పట్లోనే వీణ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రేరేపిత చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. కానీ ఈ కేసును కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ప్రచారాస్ర్తంగా వాడుకున్నాయి. మాజీ సీఎం విజయన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేసి ఎన్నికల్లో లబ్ది పొందారు. ఈ కేసులో మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవని న్యాయస్థానాలు తేల్చిచెప్పాయి. అయినా సీపీఐ(ఎం) శ్రేణుల్ని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా తాజాగా ఈ దాడులకు తెగబడ్డారు. విజయన్ అద్దె నివాసంతో పాటు కోజికోడ్‌లో ఉంటున్న ఆయన కుమార్తె వీణ, ఆమె భర్త, మాజీ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ నివాసంలో కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు. అలాగే సీఎంఆర్‌ఎల్ కు చెందిన మరికొందరి ఇండ్లలో కూడా సోదాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఈడీ దాడులపై వీణ భర్త రియాస్ స్పందిస్తూ ఈ దాడులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమనీ, తన తుది శ్వాస విడిచే వరకూ సంఘ్ పరివార్‌పై పోరు కొనసాగిస్తానని చెప్పారు. ‘మీరు నాపై అన్ని వైపుల నుంచి దాడి చేయవచ్చు. అయితే నేను సంఘ్ పరివార్ ముందు తలవంచను. తుది శ్వాస విడిచే వరకూ పోరాడుతూనే ఉంటా’ అని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడుల విషయం తెలుసుకొని సీపీఐ (ఎం) కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కన్నూర్‌లోని పినరయి నివాసం వద్దకు చేరుకున్నారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. మాజీ మంత్రి వి.శివకుట్టి, ఎమ్మెల్యే వి.జాయ్, అనవూర్ నాగప్పన్, వీకే ప్రశాంత్, బినీష్ కొడియెరి సహా పలువురు నేతలు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ఏకేజీ సెంటర్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం అత్యవసరంగా సమావేశమైంది. అనంతరం రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయన్ తదితరుల నివాసాలపై జరిగిన దాడులు కాంగ్రెస్`బీజేపీ ఉమ్మడి ఆపరేషన్‌లోనూ, వాటి కుటిల యత్నాలలోనూ భాగమేనని సీపీఐ (ఎం) సీనియర్ నేత పి.జయరాజన్ మండిపడ్డారు. కన్నూర్ లోని విజయన్ నివాసం ఎదుట ఆయన విలేకరు లతో మాట్లాడుతూ పిన రయి శాశ్వత, అద్దె ఇండ్లలో దాడులు జరిపారని, ఆయన అల్లుడు రియాస్ ఇంటిపై కూడా దాడి జరిగిందని చెప్పారు. ‘ఇదంతా ఓ స్పష్టమైన పథకం ప్రకారం జరిగింది. పెద్ద కుట్రకు పాల్పడ్డారు. నిజమేమిటో ప్రజలు గ్రహిస్తారు’ అని అన్నారు.
మాకు సమాచారం లేదు : హోం మంత్రి చెన్నితల
ఈడీ గాలింపు చర్యలపై రాష్ట్ర పోలీసులకు కానీ, తన మంత్రిత్వ శాఖకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేదని కేరళం హోం మంత్రి రమేష్ చెన్నితల చెప్పారు. ముఖ్యమంత్రి సతీశన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమైన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. సోదాల నిర్వహణకు ఈడీ అధికారులు రాష్ట్ర పోలీసుల సహకారం కోరలేదని తెలిపారు.



