Tuesday, February 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికోతల బడ్జెట్‌!

కోతల బడ్జెట్‌!

- Advertisement -

సరకు తక్కువ సందడెక్కువ అన్న లోకోక్తి ఊరికే రాలేదు. ఆదివారం నాడు పార్లమెంటులో అదే జరిగింది. అబ్బబ్బబ్బ ఏం నటన, ఏ డైలాగ్స్‌, ఏం చప్పట్లు…. లోక్‌సభలో 2026-27 బడ్జెట్‌ గురించి 85 నిమిషాల పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ఉపన్యాసాన్ని ఒక డాక్యుమెంటరీగా ఆస్కార్‌కు పంపితే ప్రథమ బహుమతి రావటం ఖాయం. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అమోఘం, అనితర సాధ్యం అన్నట్లుగా ఉంది. ఇక పోటీబడి బల్లలు చరిచిన ప్రధాని నరేంద్రమోడీతో సహా సహ నటీనటుల తీరుతెన్నులు మరోసారి చూడాల్సిందే తప్ప వర్ణించనలవి కాదు. ఏం గొప్ప బడ్జెట్‌ను ప్రతిపాదించారని ఈ హంగామా? తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఉపన్యాసాలను ఒక్కసారి వెనక్కు తిరిగి వింటే చెప్పినమాట చెప్పకుండా కొత్త అంశాలను జనం ముందుంచారని చెప్పాలి. ఈ విషయంలో ఆమెకు నరేంద్రమోడీ గురువు. ఆయన అందరికంటే ముదురు. గడచిన పన్నెండేళ్లలో తన అమ్ముల పొదిలోంచి కొత్త అస్త్రాలను ప్రయోగించారు తప్ప ఒకసారి వాడినదాన్ని మరోసారి సంధించలేదు.

ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపధ్యంలో దేశ ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకుపోయేందుకు మూడు కర్తవ్యాలను నిర్దేశించుకున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఒకసారి చిల్లు అని మరోసారి దాన్నే తూటు, తొర్ర, కన్నం, బెజ్జం ఇలా ఏడాదికి ఒకపదాన్ని వినియోగించి తిమ్మిని బమ్మిని చేసి మాటల గారడీతో గత బడ్జెట్లన్నింటిలో ఈ సొల్లు కబుర్లు తప్ప వేరే ఏమైనా ఉన్నాయా? మూడు లక్ష్యాలట! ఉత్పాదకత ద్వారా దేశ ఆర్థికవృద్ధి, సామర్ధ్యాలను పెంచి అందరి ఆకాంక్షలను నెరవేర్చటం, వనరులు, అవకాశాలను అందరికీ అందుబాటులోకి తెచ్చి ‘సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌’ తేవటం అని కర్తవ్యభవన్‌లో రూపొందించిన బడ్జెట్‌లో చెప్పారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి. ఏ భవనంలో రూపొందిస్తేనేం దానిలో ఉన్నదేమిటీ అన్నదే లెక్క. మోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జీడీపీలో వస్తూత్పత్తి వాటా 16 నుంచి 13శాతానికి దిగజారటం తప్ప పెరిగింది లేదు. అయినప్పటికీ పదే పదే అదే మాటలు, ఎవరిని వంచించటానికి ఈ కబుర్లు ? మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత కబుర్లు ఇప్పుడు చెప్పటం లేదు. వాటి ఆచరణ బండారం ఎలా ఉందో డేజన్‌ షిరా సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక బయటపెట్టింది.

ఆసియాలో ఉత్పాదకత సూచీ 2026 ప్రకారం పదకొండు దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉండగా 2024లో నాలుగో స్థానంలో ఉన్న ”మోడీ-భారత్‌” ఆరవ స్థానానికి పడిపోయింది. ఇంతకాలం చెప్పిన నైపుణ్య వృద్ధి ఒక మేడిపండు, వేల కోట్ల రూపాయలను అక్రమార్కులకు కట్టబెట్టటం తప్ప సాధించింది లేదు. ఇక అందరికీ అవకాశాల గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. నిజంగా ఆలాంటి పరిస్థితే ఉంటే గత మూడు దశాబ్దాల్లో, ప్రత్యేకించి ఈ దశాబ్ది కాలంలో సంపదల అవసమానత దేశంలో ఎందుకు విపరీతంగా పెరిగినట్లు? అవకాశాలు అంబానీలు, అదానీ, టాటా, బిర్లాల వంటి వారికి తప్ప సామాన్యులకు ఎక్కడ ఉన్నాయి. వంటనూనెలకు అవసరమైన పంటల సాగు చేసేందుకు రైతాంగానికి అవకాశం ఇవ్వరు గానీ అదానీ వంటి కంపెనీల దిగుమతులకు ఎన్నో ప్రోత్సాహకాలు కల్పించటం నిజం కాదా?

బడ్జెట్‌ అంటే సంపదల పంపిణీ, దాని తీరు చూస్తే పేద, మధ్యతరగతులకు, కార్మిక, రైతులు,వ్యవసాయ కార్మికులు, యువతకు ఒరగబెట్టిందేమీ లేదు. దశాబ్దాలుగా ఒక హక్కుగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన ఒక పథకంగా మార్చివేశారు. నూట ఇరవై ఐదు రోజుల పని కల్పిస్తామని కొండంత రాగం తీశారు. అందుకు గాను రూ.2.35లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా 95వేల కోట్లతో మమ అనిపించారు. ఈ మొత్తం కూడా రాష్ట్రాలు అమలు జరిపితేనే ఖర్చవుతుంది తప్ప లేకుంటే తిరిగి వెనక్కే. మోడీ సర్కార్‌ అప్పుల్లో అభివృద్ధి సాధిస్తున్నది. స్థిర ఆస్తులను సృష్టించే మూలధన కేటాయింపులు 6.3శాతం ఉండగా వడ్డీ చెల్లింపులకు పదిశాతం కేటాయించింది. చిత్రం ఏమిటంటే వచ్చే ఏడాది తెచ్చే 17లక్షల కోట్ల అప్పుల్లో 14లక్షల కోట్లు వడ్డీ, అసలు చెల్లింపులకే పోతుంది.

బడ్జెట్‌ మొత్తంగా రూ.53,47,315 కోట్లతో ప్రవేశ పెట్టారు. ఇందులో తెలంగాణ ఎక్కడుంది? విభజన హామీల ధ్యాసే లేదు. పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా గురించి మాటైనా లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ హామీలను అటకెక్కించింది. కేంద్ర పథకాలు, నిధుల కేటాయింపులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి సమాఖ్య సూత్రాలను తుంగలో తొక్కింది. వామపక్ష కేరళపై తీవ్రమైన వివక్షను ప్రదర్శించింది. ఆ రాష్ట్రానికి రావాల్సిన రూ.55వేల నుంచి 60వేల కోట్ల నిధులను ఉద్దేశపూర్వకంగా కోతలు పెట్టింది. అందుకే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‘ఇది కోతల బడ్జెట్‌’ అని విమర్శించారు. మొత్తంగా ఈ బడ్జెట్‌ తీరూతెన్నులు చూస్తే కేటాయించిన వాటిలో కూడా దేనికి ఎంత కోతపెడతారో తెలియని స్థితి. పోనీ కార్పొరేట్ల రాయితీల్లో కోతపెట్టారా? దుర్భిణి వేసి వెతికినా ఆనవాలు కనపడదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -