నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ సహచరులకు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధికారికంగా లైన్ క్లియర్ అయింది.
గురువారం ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో సిద్ధరామయ్య మంత్రులకు ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హైకమాండ్ ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు.. మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు.. హైకమాండ్ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయమని కోరింది” అని ప్రకటించారు. అంతేకాదు, పార్టీ ఎవరిని తదుపరి సీఎంగా ఎంపిక చేసినా.. వారికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.



