నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్ : కేరళ మాజీ ముఖ్యమంత్రి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులను సీపీఐ(ఎం) పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు చౌటుప్పల్ సీపీఎం మండల, మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం హైవే రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్‌కు సొంత ఇల్లు కూడా లేదు. పదవి విరమణ అనంతరం కిరాయి ఇంట్లో ఉంటున్న ఆయనపై ఈడీ దాడులు చేయడం విడ్డూరం అని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై నేరుగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను, ప్రశ్నించే మీడియాను సహించలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రశ్నించే వ్యక్తులనే టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తోంది అని ఆరోపించారు.వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించిన చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులది. ఈడీ దాడులకు భయపడి మేము ప్రశ్నించే హక్కును కోల్పోము” అని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, నాయకులు బత్తుల శ్రీశైలం గౌడ్, చీర్క సంజీవరెడ్డి, ఆకుల ధర్మయ్య,బోయ యాదయ్య, అంతటి అశోక్, తూర్పునూరు మల్లేష్, చికురు ఈదయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, బావుండ్లపల్లి స్వామి, బొడ్డు అంజిరెడ్డి, యాట బాలరాజు, తిగుళ్ల యాదమ్మ, తిగుళ్ల శంకరయ్య, బాలగోని బాలరాజు, మోగుదాల రాములు తదితరులు పాల్గొన్నారు.



