నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం పూర్తి ‘అసమతుల్యం’ అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తువులు 18శాతం టారిఫ్‌లను ఎదుర్కొంటాయని, అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు మరియు నాన్-టారిఫ్‌ల (దేశీయ పరిశ్రమలకు భద్రత కల్పించే సుంకాలు) అడ్డంకులను సున్నాకి తగ్గించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్‌మీడియాలో పోస్ట్‌లో చేసిన ప్రకటన తెలిపింది.
టారిఫ్‌ల రద్దు ఫలితంగా భారతదేశంలోకి అమెరికా వస్తువులు వెల్లువెత్తుతాయని, దీంతో దేశంలోని పారిశ్రామిక రంగంతో పాటు కార్మికుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. నాన్-టారిఫ్‌ల అడ్డంకులను తొలగించడమంటే భారతీయ రైతులకు మద్దతునిచ్చే రాయితీలు ఇతర మినహాయింపులను తొలగించడమేనని పేర్కొంది.
అలాగే రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేసి బదులుగా 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధనం, సాంకేతికత మరియు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది వాస్తవమైతే, భారతదేశంతో అమెరికా వాణిజ్య ఒప్పందం పూర్తి అసమతుల్యంగా ఉందని స్పష్టమౌతోందని, ఇది దేశ సార్వభౌమత్వాన్ని సైతం పరిమితం చేస్తుందని పేర్కొంది.
ఈ ఒప్పందం ప్రకటనపై కార్పోరేట్ మీడియా ఉత్సాహపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోందని, కానీ ఈ ఒప్పందం పూర్తి వివరాలు ఇప్పటికీ తెలియనందున ఇది పూర్తిగా తప్పు అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. వాణిజ్య ఒప్పందం పూర్తి వివరాలు మరియు లక్ష్యాలు అందుబాటులో ఉన్నప్పుడే, సరైన అంచనా వేయగలమని తెలిపింది.
భారత్-అమెరికాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పంద పూర్తి వివరాలను కేంద్రప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం ఆవశ్యకమని, దీంతో ఆ ఒప్పందంపై పూర్తి చర్చలకు ఆస్కారం ఉంటుందని పేర్కొంది. భారతీయ పరిశ్రమ, వ్యవసాయం, శ్రామిక ప్రజల ప్రయోజనాల కాపాడటానికి ఏమైనా అపాయకరమైన నిబంధనలు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించాలని సూచించింది.



